దళిత ఇంజినీర్‌పై దాడి చేసిన వ్యక్తికి టికెట్‌ ఎలా కేటాయిస్తారు?

For the man who attacked the Dalit engineer How to allocate ticket?– రాజస్థాన్‌లో దళిత సంఘాల ఆగ్రహం
–  ప్రధానికి, బీజేపీకి బహిరంగ లేఖ
జైపూర్‌: రాజస్థాన్‌లో బీజేపీ తీరు అక్కడి దళితులను ఆగ్రహానికి గురిచేసింది. ధోల్‌పూర్‌లోని బారీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్‌ నిరాకరించడంతో గిర్‌రాజ్‌ సింగ్‌ మలింగను బీజేపీ అక్కున చేర్చుకున్నది. ఆయనకు టికెట్‌ కేటాయించింది. ఇది ఇప్పుడు అక్కడి దళిత సంఘాలలో ఆగ్రహానికి కారణమైంది.
దళిత ఇంజినీర్‌పై దాడి
2022, మార్చి 28న రాజస్థాన్‌ పవర్‌ బోర్డ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న హర్షాధిపతి (28)పై వాల్మీకిపై మలింగ దాడికి పాల్పడ్డాడు. ఒక గ్రామానికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారని ఆరోపిస్తూ మలింగ, ఆయన అనుచరులు హర్షాధిపతిని కులం పేరుతో దూషిస్తూ… రాడ్‌లు, కర్రలతో కొట్టారు. ఇంజినీర్‌కు తగిలిన గాయాలను వివరిస్తూ దళిత సంఘాలు ఇప్పుడు మోడీ, బీజేపీకి బహిరంగ లేఖ రాశాయి. దాడి ఫలితంగా బాధితుడి 22 ఎముకలు విరిగిపోయాయనీ, ఏడాదిన్నర నుంచి (ఇప్పటికీ) అతను ఆస్పత్రిలోనే ఉన్నాడని వివరించాయి.
‘దళితులపై బీజేపీకి ఉన్న ప్రేమ ఇదేనా?’
ఇటు బీజేపీపై కాంగ్రెస్‌ సైతం ఆరోపణల దాడి పెంచింది. మలింగకు రాష్ట్రంలో గూండాయిజంతో సంబంధం ఉన్నదని ఆరోపించింది. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ కేటాయించవద్దని తెలిపింది. ”నడ్డా జీ, మోడీ జీ, దళిత-వాల్మీకులపై బీజేపీకి ఉన్న ప్రేమ ఇదేనా? మలింగాను పార్టీలోకి బీజేపీ స్వాగతించిన తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. రాజస్థాన్‌లోని మీ పార్టీకి చెందిన బాధ్యతాయుతమైన నాయకులు ఈ అంశంపై మాట్లాడిన తీరు, గిర్‌రాజ్‌ సింగ్‌ మలింగను విమర్శించిన తీరు నిందితులకు శిక్ష పడుతుందనే ఆశను కలిగించింది. కానీ, దళిత అఘాయిత్యాలకు పాల్పడిన వ్యక్తిని చూసి మేము షాక్‌ అయ్యాము. ఎంతో ఆర్భాటంగా, ఆనందంతో బీజేపీలోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ మిఠాయిలు పంచి, మలింగకు లడ్డూలు తినిపించి స్వాగతం పలికారు” అని దళిత సంఘాలు ఆవేదనను వ్యక్తం చేశాయి. రచయిత, దళిత హక్కుల కార్యకర్త భన్వర్‌ మేఘవంశీ మాట్లాడుతూ.. బీజేపీ దళిత హింసను ఎన్నికల అంశంగా మారుస్తుందన్నారు. ”కాంగ్రెస్‌ మా డిమాండ్‌ను విని, మలింగకు అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. అది ఎన్నికలలో వారిని దెబ్బతీసినప్పటికీ.. మేము వారి సూత్రప్రాయ వైఖరిని స్వాగతించాము. కానీ ఈ సంఘటనల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా” అని మేఘవంశీ అన్నారు.