గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలన్నింటిలోకి అత్యంత అనూహ్యమైన ఘటన డమాస్కస్ పతనం. పదేండ్ల కిందట – కతార్, టర్కీ, సౌదీ అరేబియా, అమెరికాల ధన, ఆయుధ సహాయ మందుకున్న – తిరుగుబాటు దళాలు సిరియా సరిహద్దుల నుండి లోనికి చొరబడినపుడు బషర్ అల్-అసద్ ప్రభు త్వం కూలడం ఖాయమని ఆనాడు విశ్లేషకులనుకున్నారు. అత్యంత శక్తివంతమైన దేశాల దన్నుతో ఏర్పడ్డ ఆ తిరుగుబాటు శ్రేణుల్లోకి చేరిన వ్యక్తులు కింది ఐదు కోవలకు చెందుతారు.
1. అల్-అసద్ ప్రభుత్వ ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల దెబ్బతిని ఆగ్రహంతో ఉన్న పలు వర్గాలు – ముఖ్యంగా, బలమైన పరిశ్రమలున్న టర్కీ నుండి దిగుమతయిన ఉత్పత్తులతో పోటీ పడలేక కుప్పకూలిన చిన్న పరిశ్రమల కార్మికులు.
2. దీర్ఘకాలిక కరువు వల్ల వ్యవసాయం దెబ్బతిని, ప్రభుత్వ సహాయమూ దొరకక, పనుల కోసం పొట్ట చేత పట్టుకుని ఇద్లిబ్, అలెప్పొ నగరాలకు వలస వచ్చిన ఉత్తర సిరియా ప్రాంతపు రైతాంగం.
3. హఫేజ్ అల్-అసద్ మరణం తరువాత రాజకీయ సంస్కరణలు కోరుతూ సిరియాలోని పలు నగరాలలో 2000-01లో జరిగిన చర్చా గోష్టుల (ముంతదయాత్) నుండి పుట్టి డమాస్కస్ వసంతం (డమాస్కస్ స్ప్రింగ్)గా పేరొందిన ఉద్యమంలో, పెద్ద ఎత్తున పాల్గొని దాని వైఫల్యంతో అసంతప్తి చెందిన లౌకికవాద మధ్యతరగతి వర్గాలు.
4. గాఢమైన మత విశ్వాసాలున్న మధ్య తరగతి వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘ముస్లిం సోదర కూటమి’ (ముస్లిం బ్రదర్‌హుడ్). దాదాపు అరబ్ దేశలాన్నింటిలో ఉన్న ఈ కూటమిని, 1982లో అప్పటి సిరియా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. 2010-11 కాలంలో అరబ్ వసంతం పేరిట ఈజిప్ట్, ట్యునీసియాలలో జరిగిన ఆందోళనలలో ఆయా దేశాల సోదర కూటములు పోషించిన ముఖ్య పాత్ర, సిరియా సోదర కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.
5. ఇరాక్‌లో అల్-ఖైదా శిక్షణతో రాటుదేలి, డమాస్కస్ బురుజులపై జిహాదీ నల్ల జెండాని ఎగరేయడానికి ఉవ్విళ్లూరుతున్న ఇస్లామిక్ సాయుధ శ్రేణులు.
2011లో విఫలమైన ప్పటికీ, ఇవే శక్తుల్లోని కొన్ని వర్గాలు డిసెంబర్ 7న అసద్ ప్రభుత్వాన్ని పడదోసి డమా స్కస్ స్వాధీన పరుచుకున్నాయి. గత పదేళ్లుగా అసద్ ప్రభుత్వం నిలబడడానికి ప్రధాన కారణం ఇరాన్, రష్యాల అండ. వీరితోబాటుగా పొరుగున ఉన్న ఇరాక్, లెబనాన్ లోని హిజ్బుల్లాల మద్దతు కూడా అసద్ ప్రభుత్వానికి సాయపడింది. తిరుగుబాటు దళాలు డమాస్కస్ నగరానికి దగ్గరగా వస్తుండగా, తన భార్యాబిడ్డలతో మాస్కోకి పలా యనం చేసి, ఇపుడు అక్కడ కంటి వైద్యునిగా కొనసాగనున్నాడు. తన సైన్యాలు, గట్టి దెబ్బ తిన్నా, పోరు నుండి వైదొలగవనీ, తనకు మద్దతు ఇచ్చిన జనాలను ధైర్యంగా ఉండాలనీ, ఇటువంటి ఒక్క ఊరడింపు మాటా, ప్రకటనా లేకుండా సిరియా విడిచిపెట్టాడు అసద్. మాస్కో చేరుకున్న కొన్నాళ్ళకి టెలిగ్రామ్ మాధ్యమం ద్వారా ఈసురోమనే ఓ చిన్న సందేశం విడుదల చేశాడు.
2014లో రష్యా, ఇరాన్‌ల సాయంతో సిరియా సైన్యం తిరుగుబాటు దళాలను వెనక్కి నెట్టింది. ఇలా ఓటమి పొంది చెల్లాచెదురైన పలు దళాలు, టర్కీ సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఇద్లిబ్ పట్టణంలో తిరిగి జతగూడాయి. అప్పటి వరకు అల్- ఖైదాలో భాగంగా ఉన్న అతి పెద్ద తిరుగబాటు దళం, 2016లో అల్- ఖైదాతో తెగతెంపులు చేసుకుని ఇద్లిబ్‌లో హెచ్.టి.ఎస్ (హయాత్ తహ్రీర్ అల్-షామ్ లేదా అల్-షామ్ విముక్తి కూటమి) పేరిట అవతరించి, ఇద్లిబ్ నగర పాలనను తన కిందకి తెచ్చుకుంది. అదే హెచ్.టి.ఎస్ ఇప్పుడు డమాస్కస్‌పై జెండా ఎగరేసింది.
అల్ ఖైదాకి ఒకశాఖగా పుట్టిన హెచ్.టి.ఎస్, అల్-ఖైదా నుండి వ్యవస్థాగతంగా విడిపోయినా, భావ జాలంలో మారలేదు. సిరియాని ఒక ఖిలాఫత్ (ఖలీఫా కింది ఇస్లాం పాలన)గా తీర్చిదిద్దడం వారి ఆశయం. తాము మతబ్రష్టులుగా ముద్ర వేసిన అలావీలు, ఆర్మీనిన్లు, కుర్దులు, షియాలు ఇతర మైనార్టీలపై ఇరాక్, ఉత్తర సిరియా లలో పలుచోట్ల తాను సాగించిన ఊచకోతలకి పేరుగాంచినవాడు హెచ్.టి.ఎస్ అధినేత అబూ మహమ్మద్ అల్-జోలానీ. అల్-ఖైదా అవతారం విడిచి గడ్డం కత్తిరించి, ఖాకీ బట్టలు వేసి విలేకరులతో ఆచితూచి మాట్లా డుతూ, కూడగట్టిన అపఖ్యాతి చెరుపు కోడానికి అల్-జోలాని ఇపుడు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అంతర్జాతీయ మీడియా ద్వారా, ఇతనికంటిన అల్-ఖైదా నెత్తుటి మరకలు తుడిచి, ఒక సిరియా ప్రజాస్వామ్యవాదిగా వల్లె వేసే ప్రయత్నం కనిపిస్తోంది.
సిరియా దేశస్తులైన ఇద్దరు మిత్రులతో డిసెంబర్ 12న నేను మాట్లాడినప్పుడు, మైనార్టీ సముదాయాలకు చెందిన ఆ ఇద్దరూ ప్రాణ భయం వెల్లడించారు. ఇప్పుడున్న పండగ వాతావరణం సద్దుమణిగి, మున్ముందు మైనార్టీలపై మారణకాండగా మారబోతోందని వారికి తెలుసు. వారెరుగున్న అలావి, షియా కుంటుంబాలపై ఇప్పటికే ఓ మాదిరి దాడులు మొదలయ్యాయి. 2003లో సద్దాం ప్రభుత్వం కూలిన వెంటనే ఇరాక్‌లో నెలకొన్నట్లు అనిపించిన ప్రశాంతత, తర్వాత కొన్ని వారాల్లో మొదలైన అంతర్యుద్ధంగా మారిందని మరో మిత్రుడు గుర్తుచేశాడు. సిరియాలో కూడా, అనుకోని తీరులో కుప్పకూలిన పాత ప్రభుత్వ బలగాలు తేరుకుని తిరగబడతాయా అన్నది ఓ ప్రశ్న. అధికారంలోకి వచ్చిన ఈ కొత్త శక్తుల కింద సిరియా సమాజంలో ఏం జరగనుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా యుద్ధ కాలంలో పక్క దేశాలకు చెదిరిపోయిన డెబ్బయి లక్షల మంది సిరియన్లలో కొందరు వెనక్కి రాబోతున్నారు. వీరు తమ కష్టాలకు కారకులుగా ఎంచినవారిపై పగ సాధింపు దాడులకు పాల్పడే అవకాశం ఎక్కువ. ఇది శాంతితో ముగిసే యుద్ధం కాదు.
ఈ సంక్షోభంలో నలుగుతున్న సిరియన్ ప్రజల పరిస్థితి అర్ధం చేసుకుంటూనే, ఈ పరిణామాల ప్రభావం పొరుగు దేశాలపైన, అంతర్జాతీయంగానూ ఎలా ఉండనుందో అంచనాకు రావడం కూడా అవసరం. ఇజ్రాయిల్ నుండి, సహెల్ ప్రాంత దేశాల వరకు దీనిప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.
1.ఇజ్రాయిల్. అంతర్యుద్ధంలో తలమునకలై వున్న సిరియా బలహీనతను సందుగా తీసుకున్న ఇజ్రాయిల్, గత పదేళ్లుగా సిరియాలోని సైనక స్థావరాలపై ఎడతెరపిలేని బాంబు దాడులు చేసి, సిరియా అధికార సైన్యాలనూ, వారి మిత్ర దళాల (ముఖ్యంగా ఇరాన్, హిజ్బుల్లాల) యుద్ధ సామర్ధ్యాలను బలహీనం చేసింది. గత ఏడాదిగా పాలస్తీనాలో జరుపుతున్న మారణకాండను తీవ్రం చేస్తూనే, మరో పక్క సిరియాలోని ఇరాన్, హిజ్బుల్లా దళాల సరఫరాలపై బాంబు దాడులను ముమ్మరం చేసింది. దానితో ఆగకుండా, హిజ్బుల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ హసన్ నస్రల్లాను చంపి, హిజ్బుల్లా పునాదులున్న దక్షిణ లెబనాన్‌పై ఆక్రమణ దాడి చేసింది. మరో వైపు, ఇద్లిబ్ నుండి డమాస్కస్ మీద దాడికి వస్తున్న హెచ్.టి.ఎస్ సైన్యాలకు ఇజ్రాయిలీ వైమానిక రక్షణ కల్పిస్తూ, సిరియా ప్రభుత్వ సైన్యాలపై, వారి స్థానాలపై దాడులు చేసి సిరియా అరబ్ సైన్యాన్ని (అసద్ ప్రభుత్వ సైన్యం) నిర్వీర్యం చేసింది. డమాస్కస్ హెచ్.టి.ఎస్ బలగాలు స్వాధీనమవడంతో, ఇజ్రాయిల్, 1973 నుండి తమ ఆక్రమణలో ఉన్న గొలాన్ మిట్టలలోని (గోలాన్ హైట్స్) తన సైన్యాన్ని (డివిజన్-210) బలోపేతం చేసి, అక్కడ ఐక్య రాజ్య సమితి ఏర్పరిచిన బఫర్ జోన్‌పై దాడి చేసి ఆక్రమించింది. అంతే కాదు. ఆ బఫర్ జోన్‌ను దాటి ఇజ్రా యిల్ ట్యాంకులు డమాస్కస్‌కు దగ్గర లోకి వచ్చాయి. ఇజ్రా యిల్ సైన్యాలు సిరియా లో ఇంత లోనికి చొచ్చుకు వచ్చినా, అధికారంలోకి వచ్చిన హెచ్.టి.ఎస్ నుండి ఎటువంటి ప్రతిఘ టనా లేదు.
2.టర్కీ. సిరియాలో 2011లో తిరుగుబాటు మొదలైన నాటి నుండే, టర్కీ ప్రభుత్వం దానికి సైనిక, ఆర్థిక సహాయాలు చేస్తూ వచ్చింది. సిరియా నుండి వెలివేయబడ్డ ముస్లిం సోదర కూటమి ప్రభుత్వానికి ఇస్తాంబుల్‌లో నెలవు కల్పించింది. 2020లో సిరియా అరబ్ సైన్యం (అసద్ ప్రభుత్వ సైన్యం) ఇద్లిబ్‌కి పారిపోయిన తిరుగుబాటు దళాలపై సైనిక చర్య మొదలెట్టినపుడు టర్కీ సిరియా మీద డాడి చేసి, అసద్ ప్రభుత్వం మెడలు వంచి, తాము ఇద్లిబ్‌పై డాడి చేయబోమన్న ఒప్పందం వారిపై రుద్దింది. ఇద్లిబ్ నుండి వెళ్ళి డమాస్కస్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న, సాయుధ దళాల్లో దాదాపు అందరూ టర్కీ నుండి శిక్షణ పొందినవారే. ఉత్తరాన కుర్దులతో, దక్షిణాన సిరియా అరబ్ సైన్యాలతో పోరాడడానికి కావాల్సిన ఆయుధాలను వీరికి టర్కీ అందించింది. టర్కీ చొరవతోటే మధ్య ఆసియా నుండి ఎందరో సాయుధ ఇస్లామిక్‌వాదులు వచ్చి హెచ్.టి.ఎస్ లో కలిశారు. ఇలా చేరినవారిలో చైనా నుండి వచ్చిన ఈగుర్లు కూడా ఉన్నారు. గత పదేళ్ళలో, టర్కీ సిరియాపై రెండుసార్లు డాడి చేసి, కొంత భూభాగాన్ని ఆక్రమించి, అది చారిత్రికంగా టర్కీకి చెందాల్సినదని సమర్ధించుకుంది. టర్కీ గుప్పిట్లో ఉన్న ఆ భూభాగం, హెచ్.టి.ఎస్ ఏలుబడిలో ఉన్న సిరియాకి తిరిగిరాదన్నది స్పష్టం.
3. లెబనాన్ ఇరాక్. 2003లో సద్దాం హుస్సేన్ పతనం తరువాత-లెబనాన్, సిరియాలోని తన కూటమి మిత్రులకు (హిజ్బుల్లా, అసద్ ప్రభుత్వం) సరఫరాల కోసం ఇరాన్, సిరియా గుండా ఒక భద్రమైన తోవ ఏర్పరిచింది. ప్రభుత్వ మార్పుతో, ఆ దారుల్లో హిజ్బుల్లాకి సామాగ్రి పంపడం ఇప్పుడు కష్టతరం. లెబనాన్, ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న సిరియా, ఈరోజు ఓ అల్- భావజాలం ఉన్న సంస్థ ఏలుబడి కిందకు వచ్చింది. అ ప్రాంతంలో ఏం జరుగ బోతోందన్నదానిపై ఒక స్పష్టత లేనప్పటికీ, ఈ రెండు దేశాలలో షియాలను దెబ్బతీయాలని చూసే అల్-ఖైదాకి అనువైని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పగలం.
4. పాలస్తీనా. పాలస్తీనా విమోచన పోరాటంపై, అక్కడ ఇజ్రాయిల్ సాగిస్తున్న ఊచకోతపై సిరియాలోని పరిణామాలు తీవ్రమైన ప్రభావం చూపను న్నాయి. హెచ్.టి.ఎస్‌కి సదుపా యంగా, అసద్ సైన్యాలను బలహీన పర చడంలో ముఖ్య పాత్ర పోషించిన ఇజ్రాయిల్ పాలస్తీనాలో సాగిస్తున్న ఆగడాల ను, దురాక్రమణను అల్-జోలాని ఖండించి, ఎదిరించే అవకాశాలు గానీ లేదా హమాస్, హిజ్బుల్లాలకు ఇరాన్ నుండి సిరియా ద్వారా వచ్చే సరఫరాలను అనుమతించే అవకాశంగానే లేదనే చెప్పాలి. అతని పేరే గోలాన్ ప్రాంతవాడని సూచించినా, ఇజ్రాయిల్‌తో పోరాడి దాని ఆక్రమణ కిందున్న గోలాన్ మిట్టల్ని (గోలాన్ హైట్స్‌ని) తిరిగి సిరియా కిందికి తెచ్చే అలోచన, అల్ ‘జోలానీ’ ప్రభుత్వానికి లేదు. సిరియా, లెబనాన్‌లలో ఇజ్రాయిల్ ఈ మధ్య కబళించిన ప్రాంతాలు దానికి కవచంలా పని చేస్తూ, పూర్వం ఈజిప్ట్, జోర్డాన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాలతో (1979, 1994) కలిపి ఇజ్రాయిల్‌కి కొత్త ధీమాని తెచ్చిపెట్టాయి. ఇజ్రాయిల్ పొరుగు దేశాలేవీ దాన్ని ఎదిరించే స్థితిలో ఈరోజు లేవు. దీనితో పాలస్తీనా పోరాటం ఆసా ంతం ఒంటరిదైంది. వారి పోరు ఆగేది కాకున్నా, పోరాటానికి కావాల్సిన సామాగ్రి, సాయం అందించే పొరుగువారు ఎవరూ మిగల్లేదు.
5. సహెల్ ప్రాంతం. అమెరికా, ఇజ్రాయిల్ పేరుకి రెండూ వేర్వేరు దేశాలైనా, అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్కటిగానే పరిగణించాలి. ఇజ్రాయిల్ విజయం, అమెరికాకి కూడా గెలుపే. సిరియాలో ప్రభుత్వ మార్పు వల్ల ఇరాన్‌కే కాదు, రష్యాకి కూడా ఓ గట్టి దెబ్బ. రష్యాని బలహీనపరచాలన్న, అమెరికా దీర్ఘకాలిక వ్యూహానికి ఇదో గెలుపు. మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలకు వెళ్ళే రష్యా రవాణా విమానాలు సిరియా విమానాశ్రయాలలో ఇంధనం నింపుకునేవి. ఆ సదుపాయం రష్యాకు ఇకపై ఉండదు. ఆఫ్రికాకు వెళ్లే రష్యా సైనిక విమానాలకు, ముఖ్యంగా సహెల్ దేశాలకు వెళ్లే విమానాలకు మార్గ మధ్యంలో ఇంధనం దొరకడం ప్రస్తుతం అనిశ్చితం.
సహెల్ దేశాలైన బుర్కినా ఫాసో, మాలి, నైజర్‌లలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే జాతీయ ప్రభుత్వాలు ఈ మధ్య ఏర్పాటయ్యాయి. ఇప్పటిదాకా వీటికి రష్యా సైనిక సాయం అంతో ఇంతో అందుతోంది. సిరియాలోని పరిణామాలతో రష్యా బలహీనం కావడం వల్ల, ఇదే అదనుగా అమెరికా, సహెల్‌కు సరిహద్దులలో ఉన్న నైజీరియా, బెనిన్‌లను, సహెల్ దేశాల మీద దాడులకు పురిగొల్పే అవకాశం ఉంది.ఈ ప్రాంత పరిణామాలను మున్ముందు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.
విజరు ప్రసాద్