– ఆయన సూచనలు మాకెంతో ఉపయోగం : సీఎం రేవంత్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి తమ పార్టీలో చేరిన సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు కె.కేశవరావుకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన్ను ప్రత్యేక సలహాదారునిగా నియమించేందుకు యోచిస్తున్నామని చెప్పారు. ఇది క్యాబినెట్ ర్యాంకుతో సమానంగా ఉంటుందని వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం గురువారం అక్కడి పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కెకె సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రాజ్యసభకు ఆయన రాజీనామా విషయంలో అందరం కలిసే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే పదేండ్లపాటు పక్కాగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ రకంగా రెండో సారి కూడా తామే గెలుస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. మూసీ అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించామని తెలిపారు. ఎలాంటి గందరగోళం లేకుండా 11 వేలకు మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టామని వివరించారు. కాగా రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌ఖర్‌కు రాజీనామ లేఖను అందచేశారు. పదవీ కాలం రెండేండ్లు ఉన్నా రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.