శునకాక్రోశం

Howl of a dogమనుషులంగా మనం జీవిస్తున్నది ఒక ఆవరణంలోనే. ఒంటరిగా కాదు. మన చుట్టూ ఓ ప్రాకృతిక, జీవావరణం సజీవంగా ఉంది కాబట్టే నిత్య ప్రాణవాయువుతో కదలాడుతున్నాము. భూ మండలంలోని అనంత జీవకోటికీ మనకూ ఏదో ఒక సంబంధం ముడిపడే ఉంటుంది. కానీ మనం మనుషులం ప్రత్యేకమనుకుంటాం. ఇతర జీవులకు మనకూ ఏం సంబంధం లేదనీ, మనుషుల కేంద్రంగానే ఆలోచిస్తుంటాం. ఇది అజ్ఞానమే. మన చుట్టూ వున్న ఆవరణం, జీవకోటి పరిరక్షణ మీదనే మన మనుగడ ఆధారపడి ఉందనే విషయం, తన గురించి తానే ఆలోచించుకునే స్వార్థజీవిగా మారిన మనిషి మరిచిపోయాడు. ఎందుకంటే ఈ వ్యవస్థ మనిషినలా ఒంటరినీ, స్వార్థపరుణ్ణీ చేసింది మరి!
అనాదిగా కుక్క మన సహజీవి. మచ్చిక చేసుకున్న జంతువు. అంతేకాదు, అతి విశ్వాసజీవిగా పేరు తెచ్చుకున్నది కూడా. ఆదిమంలో మన ఆహార వేటలో మనతో పాటుగా సహకరించిన ప్రాణి. అనేక అపాయాల నుండి రక్షణగా నిలిచింది. ఇప్పటికీ ఇంట్లో కాపలాగా కుక్కనే ఉంచుతాము. దొంగ లను పట్టిచ్చే శక్తి యుక్తులూ ఉన్న జీవి అది. ప్రకృతి ఉపద్రవాలను మనుషులకంటే ముందుగా పసికట్ట గల జ్ఞానం దానిది. బుజ్జి కుక్కలను చూస్తే పిల్లల మనసు విప్పారుతుంది. మన ఇండ్లళ్లో ప్రేమగా పెంచుకునే, కుక్కలను రకరకాల పేర్లు పెట్టి ముద్దుగా పిలుచుకుంటాము. అట్లాంటి మనమే కనకపు సింహాసనమున శునకము కూర్చుండదగునా! అనీ ‘కుక్కా’! అనీ ‘కుక్కబుద్దీ’ అనీ తిట్టడానికీ వాడుతాం ఎందుకోమరి! కానీ ఎప్పుడయినా ఓ అన్నం ముద్ద దానికి పెడితే, దాని జీవితాంతమూ మనల్ని చూడగానే తోక ఊపుతూ ప్రేమను ప్రకటిస్తుంది. అందుకే విశ్వాస జంతువని పేరు తెచ్చుకుంది. జాలిగా కృతజ్ఞతగా చూసే దాని కళ్లు మనిషి కండ్ల తర్వాత అన్ని భావాల్ని గొప్పగా చూపించగలిగేది కుక్క కండ్లే అని ప్రఖ్యాత రచయిత జాక్‌ లండన్‌ అంటారు.
మనతోపాటే, మన వీధిలోనే జీవిస్తున్న కుక్కల వలన మనుషులకు ప్రమాదమేర్పడిందని ఈ రోజు ఆందోళన చెందుతున్నాము. వీధి కుక్కల బారినపడి ఈ మధ్య అనేక మంది పిల్లలు మరణించడం భయాందోళనలు కలిగిస్తున్నది. మన దేశంలోనే అతి ఎక్కువ కుక్కలు జీవిస్తున్నాయి. దాదాపు ఏడు కోట్ల సంఖ్య దానిది. పిచ్చి కుక్క కాటుకు గురయితే రేబీస్‌ వ్యాధి సోకుతుంది. ఇది ప్రాణాలను మింగేస్తుంది. రేబీస్‌ వ్యాధితో ఎక్కువగా మరణించేదీ మనదేశంలోనే. గత పదేండ్లలో ఒక్క హైదరాబాద్‌ నగరంలో మూడులక్షల ముప్పయి ఆరువేలకు పైగా మనుషులు కుక్కకాట్లకు గురయ్యారని సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో వీధి కుక్కల దాడిలో చిన్నపిల్లలు చనిపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, పత్రికల వార్త కథనాలను సుమోటోగా స్వీకరించింది. చిన్న పిల్లల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని కోర్టు తప్పు పట్టింది.
మనుషుల ప్రాణాలు పోవటం, అదీ చిన్నపిల్లలపై పడి కుక్కలు కరుస్తున్న దృశ్యాలు మనందరినీ కలిచివేసే సంఘటనలే. ఇన్ని తరాలుగా సహజీవనం చేస్తున్న కుక్కలు ఇంత పిచ్చివిగా ఎందుకు మారుతున్నాయో సమాజమూ ఆలోచించాలి. ఒక ముఖ్యమైన కారణం, వాటికి ఆహారం దొరకడం లేదు. ఆకలితో చెత్త చెదారం తిని వ్యాధుల బారిన పడుతున్నాయి. దీని మూలంగా అవి విచ్చలవిడిగా మనుషుల వెంటపడుతున్నాయి. వీధుల్లో చెత్త పేరుకు పోవడమూ ఒక పెద్ద సమస్యే. దీనికి ప్రభుత్వాలదీ, అధికారులదీ బాధ్యత. వాటికి కావలసిన ఆహారం లేకపోవటంతోనే దాడులకు తెగబడుతున్నాయనేది వాస్తవం. వాటికి ఇవ్వాల్సిన వాక్సినేషన్‌ కూడా చేయటం లేదు. కేవలం స్టెరిలైజేషన్‌ చేశామని ప్రభుత్వం చెప్పి చేతులు దులుపుకుంటున్నది. అందుకనే ఇప్పుడు ఇదో పెద్ద సమస్యగా తయారయింది. చాలావరకు వీధి కుక్కలు వాటి జోలికి పోయినపుడే వెంటపడతాయి. రాయి విసిరితేనో, బెదిరిస్తేనో, వాటి ఆత్మరక్షణ కోసం మొరిగి వెంటపడతాయి. కేవలం మూడు నుండి నాలుగేండ్ల వరకే జీవించే కుక్కలకు ఆహారం దొరక్కపోవడం, వ్యాధుల బారిన పడటమే అసలు సమస్య. ప్రపంచంలోనే నెదర్లాండ్‌ ఈ సమస్యను పరిష్కరించుకున్నది. ఎలా అంటే కుక్కల్ని చంపికాదు. ఇండ్లలో పెంచుకునే జాతికుక్కల పైన పన్నులు పెంచి, వీధి కుక్కలను పెంచుకునే వారికి రాయితీ ఇచ్చింది. మన దేశవాళీ కుక్కలు వేటికంటే కూడా తక్కువ కాదు అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఈవీధికుక్కల సమస్యను పూణె, ఇండోర్‌, బెంగళూరు నగరపాలక సంస్థలు సరైన రీతిలో ఎదుర్కొంటున్నాయి. మన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి.
కనుక కుక్కలయినా, కోతులయినా, మనుషుల సమూహాలు చేస్తున్న తప్పిదాల వల్లనే ఆవరణం పాడైపోయి, సహజంగా జీవనం సాగించే జంతువులు, పక్షులు, పర్యావరణమూ మారిపోయి హాని కలిగి స్తున్నాయనే వాస్తవాన్ని గమనించాలి. వీధికుక్కలు మనిషికి శత్రువులు కావు. అవి శత్రువులుగా మారటానికి మనుషులే కారకులు, వ్యవస్థే కారణం, అందుకనే పరిష్కరించుకోవడం మన చేతుల్లోనే ఉంది.