భారతీయ చిత్రసీమలోని అత్యుత్తమ చిత్రాల రూపకర్త ”హృషి-దా” గా ప్రసిద్ధి చెందిన హృషికేష్ ముఖర్జీ, తన కెరీర్‌లో 42 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆయన సినిమాలు ఎక్కువగా మధ్యతరగతి జీవనశైలి చుట్టూ తిరిగాయి. భారతదేశంలోని ‘మిడిల్ సినిమా’కి మార్గదర్శకుడిగా పేరుపొందిన, హృషికేష్ ముఖర్జీతో ‘ఆనంద్, చుప్కే చుప్కే, అభిమాన్’ వంటి చిత్రాలలో నటించిన అమితాబ్ బచ్చన్ అతన్ని ‘ఫాదర్ ఫిగర్’ అని పిలిచారు. హృషికేష్ ముఖర్జీ దర్శకుడు, ఎడిటర్, రచయితగానే కాకుండా, భారతీయ సినిమా గొప్ప చిత్రనిర్మాతలలో ఒకరిగా ప్రసిద్ది చెందాడు. మారుతున్న మధ్యతరగతి నీతిని ప్రతిబింబించే తన సాంఘిక చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ముఖర్జీ ప్రధాన స్రవంతి సినిమాలలో దుబారా తగ్గించడంతోపాటు, ఆర్ట్ సినిమాలలో పూర్తి వాస్తవికతకు ప్రాధాన్యత కల్పించేవాడు.
హృషికేష్ చిత్రనిర్మాణ శైలి, నాణ్యత, కథ అంశాలపై ఎప్పుడూ రాజీపడలేదు. హృషికేష్ దర్శకత్వం వహించిన ‘మౌసమ్, అనారి, అనూరాధ, అనుపమ, ఆశీర్వాద్, సత్యకామ్, ఆనంద్’ సినిమాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్ర బహుమతులు లభించాయి. హృషికేష్ కేంద్రీయ సెన్సార్ బోర్డుకు అధ్యక్షునిగా, జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పోరేషన్ కు చైర్మన్ గా వ్యవహరించారు. బారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికిగాను హృషికేష్ ముఖర్జీ కి 1999లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారంతోపాటు 2001లో భారత ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ పురస్కారమిచ్చి గౌరవించింది.
హృషికేష్ ముఖర్జీ కలకత్తా నగరంలో 1922వ సంవత్సరం సెప్టెంబరు 30వ తేదీన జన్మించాడు. కలకత్తా విశ్వ విద్యాలయం నుంచి సైన్సు విద్యార్థిగా పట్టా పొందిన హృషికేశ్ టీచరుగా పనిచేస్తూనే, చిన్నప్పటినుంచి ఉన్న సంగీత, సాహిత్యాభిరుచితో ఆలిండియా రేడియోలో ఫ్రీలాన్సర్ గా కవితలు చదవడం, నాటకాలు వేయడం చేస్తుండేవాడు. స్నేహితులు సినిమాలలో చేరమని ప్రోత్సహించడంతో తన 23 వ ఏట 1945 లో న్యూ థియేటర్స్‌లో అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ ఖాళీ లేదు.. కావాలంటే లేబొరేటరీ అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరమన్నారు వాళ్ళు. దీంతో హృషికేష్ లేబొరేటరీ అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరి రాత్రులు ఆ పని చేసుకుంటూ, పగలు స్టూడియోలో జరిగే షూటింగులను గమనించేవాడు. అయితే హృషికేష్ పట్టుదల దర్శకుడు బిమల్‌రారుని మెప్పించింది. వెంటనే అతను తన యూనిట్‌లో అసిస్టెంట్ కెమెరామన్‌గా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా ఎదిగాడు. బిమల్ రారు సామాజిక సమస్యలను కథాంశాలుగా తీసుకుని కళాత్మకంగా చిత్రీకరించి, వ్యాపారపరంగా విజయం చేసేవాడు. తరవాత హృషికేష్ సుబోద్ మిట్టల్ వద్ద ఎడిటింగ్ శాఖలో శిక్షణ పొందాడు. 1951లో బిమల్ రారు నిర్మించిన ‘దో బిఘా జమీన్’ కు స్క్రీన్‌ప్లే రైటర్‌గా, సహాయ దర్శకుడిగా, ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1953లో అశోక్ కుమార్ బిమల్ రారు దర్శకత్వంలో నిర్మించిన ‘పరిణీతా’ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. 1954లో హితేన్ చౌదరి బిమల్ రారు దర్శకత్వంలోనే ‘బిరాజ్ బహు’ సినిమా నిర్మిస్తే దానికి కూడా ఎడిటర్ హృషికేష్ ముఖర్జీనే. 1955 లో బిమల్ రారు ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవదాస్’ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. తరవాత 1970 వరకు ‘గరమ్ కోట్’, ‘మధుమతి’, ‘హీరా మోతీ’, ‘చార్ దివారి’, ‘చెమ్మీన్’ (మళయాళ చిత్రం), ‘దస్తక్’ సినిమాలకు ఎడిటర్‌గా అమర్ కుమార్, రాము కరియత్, రాజిందర్ సింగ్ బేడిల వద్ద పనిచేశాడు. బిమల్‌రారు చిత్రం ‘మధుమతి’ సినిమాకు హృషికేష్ ఎడిటింగ్ ప్రతిభకు ఫిలింఫేర్ బహుమతి లభించింది. 1977 నిర్మించిన కన్నడ చిత్రం ‘అనురూప’ కు హృషికేష్ ఎడిటర్ బాధ్యతలు నిర్వహించాడు. హృషికేష్ ముఖర్జీ ఎడిటర్‌గా పనిచేసిన చివరి చిత్రం మన్మోహన్ దేశారు నిర్మించిన ‘కూలీ’.
దర్శకుడిగా హృషికేష్
దర్శకుడిగా హృషికేశ్ ముఖర్జీ తొలి చిత్రంతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్ర బహుమతిని అందుకున్నాడు. అది 1957లో దిలీప్ కుమార్, సుచిత్రాసేన్ నటించిన ‘ముసాఫిర్’ చిత్రం. ఈ చిత్రానికి కథను సమకూర్చింది కూడా అతడే. అయితే ఈ సినిమా గొప్పగా ఆడలేదు. ”దర్శకుడిగా నీ తొలిచిత్రంలో నేను హీరోగా నటిస్తాను” అని దిలీప్ కుమార్ హృషిని ప్రోత్సహించడంతో ‘ముసాఫిర్’ చిత్రానికి దర్శకత్వం చేశాడు. రెండు సంవత్సరాల తరవాత ఎల్.బి. లక్ష్మణ్ నిర్మించిన ‘అనారి’ సినిమాకు హషికేష్ దర్శకత్వంతో బాటు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించాడు. రాజకపూర్, నూతన్ నటించిన ఈ సినిమాకు శంకర్ జైకిషన్ సంగీత దర్శకులు. ఈ సినిమాకు ఏకంగా 5 ఫిలింఫేర్ బహుమతులతో పాటు జాతీయ ఉత్తమ చిత్రంగా బహుమతిని అందుకుంది. హృషికేశ్ సినిమాలకు కథాబలం మిన్న. తొలి సినిమా ‘ముసాఫిర్’ లో ప్రతి జీవితంలో ఎదురయ్యే జననం, వివాహం, మరణం వంటి సమస్యలను విభిన్న కోణాలలో ఆవిష్కరించాడు. ఈ సినిమా చూశాక రాజ్ కపూర్ ‘అనారి’ సినిమాకు హృషికేష్‌ను దర్శకుడిగా పెట్టుకున్నాడు. ‘అనూరాధ’ సినిమాలో ఒక అసాధారణ వైద్యుడు నిజజీవితంలో వృత్తిపట్ల జిజ్ఞాసతో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కథాంశంగా హృషికేష్ ఎన్నుకున్నాడు. ‘అనుపమ’ చిత్రం ఒక యదార్థ సంఘటన నేపథ్యంలో సాగుతుంది. ఇక ‘ఆనంద్’ సినిమా జీవితం మీద ఆశ, మత్యువుతో పోరాటం వంటి అద్భుత కథతో నిర్మించిందే. హషికేష్ ముఖర్జీ మొత్తం మీద 42 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రధానంగా హషికేష్ 1960-80 మధ్యకాలంలో అద్భుతమైన సాంఘిక సమస్యాత్మక చిత్రాలు నిర్మించాడు. వాటిలో ‘అనూరాధ, ఛాయా, అసలీ-నకిలీ, ఆనంద్, అనుపమ, ఆశీర్వాద్, సత్యకామ్, గుడ్డి, బావార్చి, అభిమాన్, నమ్మక్ హరామ్, మిలి, చుప్కే చుప్కే, ఆలాప్, గోల్ మాల్, ఖూబ్ సూరత్, బేమిసాల్’ వంటివి గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి. హీ-మాన్ ధర్మేంద్రను ‘చుప్కే చుప్కే’ సినిమా ద్వారా కామెడీ హీరోగా నటింపచేసిన ఘనత ఆయనదే. అలాగే 1970లో వచ్చిన ‘ఆనంద్’ చిత్రం ద్వారా అమితాబ్‌బచ్చన్‌కు సూపర్ స్టార్ ఇమేజ్‌ని కట్టబెట్టిన రాజేష్ ఖన్నాకు ‘బ్రేక్’ ఇచ్చింది కూడా హృషికేషే. 1971లో ‘గుడ్డి’ చిత్రం ద్వారా జయాభాదురిని, ‘బోలె రే పపీ హరా’ ద్వారా సినీనేపథ్య గాయకురాలిగా వాణీ జయరాం హిందీ చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కూడా అతనిదే. 1998 లో జి.పి. సిప్పీ నిర్మించిన ‘ఝూట్ బోలె కవ్వా కాటే’ దర్శకుడిగా హృషికేశ్ ముఖర్జీ కి చివరి సినిమా. ఇందులో అనిల్‌కపూర్, జూషిచావ్లా జంటగా నటించారు.
రెండు దశాబ్దాలు హృషికేష్ హవా
1960 నుంచి రెండు దశాబ్దాల పాటు హృషికేశ్ హవా నడిచింది. టాప్ స్టార్లందరూ ఆయనతో పని చేయడానికి ఉవ్విళ్లూరారు. ఆయన చెప్పిన సమయానికి షూటింగుకి వచ్చి, అతి తక్కవ పారితోషికాలు తీసుకుని నటించేవారు. శంకర్ జైకిషన్, ఎస్.డి.బర్మన్, సలిల్ చౌధురీ, పండిట్ రవిశంకర్, హేమంత్ కుమార్, వసంత్ దేశారు, ఆర్డీ బర్మన్ తదితర సంగీతదర్శకులు తమ బెస్ట్ ట్యూన్స్ ఆయన సినిమాలకు అందించేవారు. ఉత్తమాభిరుచికి, ఆహ్లాదానికి చిరునామాగా మారిన హృషీ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి, కమర్షియల్ గా కూడా హిట్ చేసేవారు. ఆయన సినిమాల్లో ప్రేక్షకాదరణ పొందని వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందుకే ఎందరో నిర్మాతలు హృషికేశ్ తో సినిమాలు తీయించుకోవడానికి ఉబలాట పడ్డారు. దిలీప్ కుమార్ ‘ముసాఫిర్’, దేవ్ ఆనంద్ ‘ఆస్లీ నక్లీ’, రాజ్ కపూర్ ‘అనాడీ’, ‘ఆషిక్’, రాజేశ్ ఖన్నా ‘బావర్చీ’, ధర్మేంద్ర ‘అనుపమా’, సంజీవ్ కుమార్ ‘అర్జున్ పండిట్’, శతృఘ్న సిన్హా ‘కొత్వాల్ సాబ్’… యిలా ఎందరో ప్రతిభావంతులతో పని చేసినా, ఆయన ఎవరితోనూ పేచీ పడలేదు. అహంకారాన్ని ప్రదర్శించలేదు. అందరి చేత ‘హృషీదా’ అని పిలిపించుకున్నాడు.
హృషిని ‘బాబూ మోషాయి’గా పిలుచుకున్న రాజ్ కపూర్
రాజ్ కపూర్ హృషికేష్ ను ‘బాబూ మోషాయి’ గా పిలుచుకునేవాడు. దానికి కారణం… హృషికేష్ ముఖర్జీ ఎంచుకునే నటులు ‘స్టార్స్’ కారు… వాళ్ళు నిజమైన నటులుగా పరిశ్రమలో చెప్పుకునేవారు. హృషికేశ్ మెరుగులు దిద్దిన నటులు రాజేష్ ఖన్నా, అమితాబ్ బచన్, ధర్మేంద్ర… ముందు నటులు, ఆ తరవాతే స్టార్లు. తనకు నచ్చని కథను హృషికేశ్ ఏనాడూ సినిమాగా మలచడానికి సాహసించ లేదు. ఆనంద్ సినిమాలో ‘ఆనంద్’ పాత్రకు హృషికేశ్‌కు రాజ్‌కపూర్ ప్రేరణ. అసలు ఆ పాత్రను రాజ్ కపూర్ పోషించాల్సింది. కానీ ఈ సినిమా మొదలయ్యే సమయానికి రాజ్‌కపూర్‌కు చాలా తీవ్రమైన జ్వరమొచ్చింది. ఆనంద్ పాత్ర రోగిష్టిపాత్ర కావడంతో, సెంటిమెంటల్ గా భావించి రాజేష్ ఖన్నాను తీసుకున్నారు ఈ ‘బాబూ మోషాయి’.
హృషికేష్ సినిమాల్లోని పాటలు
హృషికేష్ సినిమాల్లో వచ్చిన పాటల నుండి మంచి పాటలు సెలెక్ట్ చేయ్యడమంటే కుదిరే పని కాదు. అన్నీ పాటలు బాగుంటాయి. అయితే ఆయన సినిమాల్లోని ముఖ్యమైన మూడు పాటలు.
ఒకటి ‘అనాడీ’ చిత్రంలోని ”జీనా యిసీకా నామ్ హై..” అనే పాట. ఎవరి ముఖం పైనైనా చిరునవ్వు తెప్పించడానికి నిన్న, నీవు అర్పించుకో, వీలైతే ఎవరి కష్టాన్నయినా నీ సొంతం చేసుకో, ఇదే జీవితమంటే.. అని సాగుతుంది ఆ పాట. ఇంకోటి ‘ఆనంద్’ చిత్రం లోని ”జిందగీ కైసీ హై పహేలీ..” అనే పాట. జీవితం ఒక పజిల్.. ఒకసారి నవ్విస్తుంది, మరోసారి ఏడిపిస్తుంది. అయినా మనసు మేలుకోదు. కలల వెంట పరుగెడుతుంది, ఓ రోజు ఈ స్వాప్నికుడు కలలను దాటుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతాడు. ఎక్కడికి అనే ఆ చిక్కు ముడి మాత్రం ఎప్పటికీ వీడదు అని సాగుతుంది. మరో పాట ‘ఆశీర్వాద్’ చిత్రం లోని ”జీవన్ సే లంబే హై, బంధూ, యే జీవన్ కె రస్తే..” కూడా ఈలాంటి నీతే చెప్తుంది. ఇక ‘అనుపమా’ చిత్రం లోని ”ఐసీ భీ బాతేఁ హోతీ హై..” పాట ఆల్‌టైమ్ ఫేవరేట్. యౌవనారంభంలో ఉన్న ఒక ముగ్ధ డోలాయమాన అనుభూతి గురించి, వ్యక్తావ్యక్తంగా ఉండే ఆమె భావాల గురించి, బాల్యం వీడి కలలు కనే స్థితిలోకి వస్తున్న ఆమె మానసికావస్థ గురించి చెప్పే ఆ పాట సాహిత్యపరంగా, సంగీతపరంగా, చిత్రీకరణపరంగా ఆణిముత్యంగా నిలిచింది.
హీరోలతో గాఢమైత్రి
బొంబాయిలోని ‘బాంబే టాకీసు’ వారు తమ సంస్థ తీస్తున్న సినిమాలు పరాజయం పొందుతూండడంతో 1951లో బిమల్ రారు ని కలకత్తా నుంచి బొంబాయి రప్పించి 1952 లో ‘మా’ అనే సినిమా తీయించారు. బిమల్ తనతో పాటు హృషికేష్‌ని కూడా బొంబాయి తీసుకుని వచ్చేశారు. అప్పటినుండి బొంబాయే హృషికేష్ కార్యక్షేత్రమై పోయింది. బిమల్ నిర్మాతగా మారి తీసిన హిందీ సినిమా ‘దో బిఘా జమీన్’ కు హృషి స్క్రిప్టు రాయడంతో బాటు అసిస్టెంటు డైరక్టరుగా, ఎడిటరుగా పని చేశారు. దానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. అప్పటినుండి బిమల్ రారు కి హృషికేష్ కుడిభుజంగా మారిపోయారు. కలకత్తాలోనే రాజ్‌కపూర్‌తో స్నేహం కుదరగా, బొంబాయి వచ్చాక దిలీప్ కుమార్, అశోక్ కుమార్, దేవ్ ఆనంద్, ధర్మేంద్ర తర్వాతి రోజుల్లో రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ తోపాటు అనేకమంది హీరోలతో హృషికేష్‌కు గాఢమైత్రి ఏర్పడింది.
టివి సీరియల్స్ నిర్మాణంలో
హృషికేష్ ముఖర్జీ ‘హమ్ హిందూస్తానీ’, ‘తలాష్’, ‘దూప్ చావోం’ వంటి టెలివిజన్ సీరియళ్ళు నిర్మించారు. హృషీకేశ్ సినిమాలలో సెక్స్, హింస వంటి మసాలాలు ఉండనే వుండవు. 1961లో హృషికేష్ కీళ్ళ నొప్పులతో బాధపడ్డారు. అయినప్పటికీ ‘అసలీ నకిలీ’, ‘అనుపమ’ చిత్రాలను చక్రాల కుర్చీలో నుంచే నిర్మించడం విశేషం.
కుటుంబం
హృషికేష్ ముఖర్జీ భార్య అతనికన్నా ముప్పై సంవత్సరాల ముందే మరణించారు. హృషికేష్ కు జయశ్రీ, రాజశ్రీ, సురశ్రీ అనే ముగ్గురు కూతుళ్ళు, ప్రదీప్, సందీప్ అనే ఇద్దరు కొడుకులు. వారిలో సందీప్ అనే చిన్న కుమారుడు ఆస్తమాతో బాధపడుతూ బొంబాయి రైల్వేస్టేషన్ లోనే కన్నుమూయడం హృషికేష్‌ను బాగా బాధించిన అంశం. అతని తమ్ముడు ద్వారకనాథ్ ముఖర్జీ కూడా మంచి రచయిత. హృషికేష్ నిర్మించిన ఎక్కువ సినిమాలకు అతడే స్క్రీన్ ప్లే సమకూర్చేవాడు. హృషికేష్ నివాసం బాంద్రాలో. ఆయనకు కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం. ఇంటిలో రకరకాల జాతుల కుక్కపిల్లలు దర్శనమిస్తూ ఉండేవి. తన చివరి రోజుల్లో ఒంటరిగానే, తన పనివాళ్ళతో బాటు హృషికేష్ జీవించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడిన ఆయన ముంబై లీలావతి ఆసుపత్రిలో క్రమం తప్పకుండా డయాలిసిస్ చేయించుకునేవాడు. అదే ఆసుపత్రిలో 83 సంవత్సరాల వయసులో 2006 ఆగస్టు 22న కన్నుమూశాడు.
అవార్డులు…
1999లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్న హృషికేష్ ముఖర్జీ కి భారత ప్రభుత్వం 2001లో ‘పద్మవిభూషణ్’ పురస్కారమిచ్చి గౌరవించింది. అదే సంవత్సరం హృషికేష్‌కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం ‘ఎన్.టి.ఆర్. జాతీయ బహుమతి’ కూడా దక్కింది. 1961లో హషికేష్ చిత్రం ‘అనూరాధ’ బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం కొరకు నామినేట్ అయ్యింది. హషికేష్‌కు ఉత్తమ ఎడిటర్‌గా ‘నౌకరి, మధుమతి, ఆనంద్’ సినిమాలకు ఫిలింఫేర్ బహుమతి లభించింది. ఆతడు నిర్మించిన ‘ఆనంద్, ఖూబ్ సూరత్’ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా ఫిలింఫేర్ బహుమతులు గెలుచుకున్నాయి. ఆనంద్ సినిమా కథకు, అనోఖి రాత్ సినిమా స్క్రీన్ ప్లే లకు ఫిలింఫేర్ బహుమతులు దక్కాయి. 1994లో హషికేష్ ముఖర్జీ ఫిలింఫేర్ సంస్థ నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాడు. ‘నెల్లు’ అనే మళయాళ చిత్రానికి కేరళ ప్రభుత్వ ఉత్తమ ఎడిటర్ బహుమతి తీసుకున్నాడు. హషికేష్ దర్శకత్వం వహించిన ‘మౌసమ్, అనారి, అనూరాధ, అనుపమ, ఆశీర్వాద్, సత్యకామ్, ఆనంద్’ సినిమాలకు జాతీయ స్థాయి ఉత్తమ చిత్ర బహుమతులు లభించాయి. కేంద్రీయ సెన్సార్ బోర్డుకు అధ్యక్షునిగా, జాతీయ చలనచిత్ర అభివద్ధి కార్పోరేషన్ కు చైర్మన్ గా హృషికేష్ ముఖర్జీ వ్యవహరించాడు.