చేవెళ్లలో భారీ క్రాస్‌ ఓటింగ్‌

చేవెళ్లలో భారీ క్రాస్‌ ఓటింగ్‌– కమలానికి గులాబీ ఓట్లు షిఫ్టు
– కనీస ప్రభావం చూపని బీఆర్‌ఎస్‌
– సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాల్లోనూ వెనుకంజ రంజిత్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా గులాబీ పంతం
– రెండింతలు పెరిగిన బీజేపీ ఓటింగ్‌ శాతం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
చేవెళ్ల పార్లమెంట్‌లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. అయితే కొండ విజయానికి.. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరగడం కారణమని చెప్పవచ్చు. బీఆర్‌ఎస్‌ ఓట్లు మొత్తం బీజేపీకి షిప్టు అయ్యాయని స్పష్టం అవుతుంది. బీఆర్‌ఎస్‌ కనీస ప్రభావం చూపలేకపోయింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీఆర్‌ఎస్‌ వెనుకంజలో ఉండటం గమనార్హం. అయితే ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన గడ్డం రంజిత్‌రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంక్‌ను బీజేపీకి మళ్లించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు ఈ వాదనకు ఊతమిస్తున్నాయి. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో మొత్తం మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్‌, తాండూరు, పరిగి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మహేశ్వరం, రాజేందర్‌నగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాండూరు, వికారాబాద్‌, పరిగిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నారు. మొత్తం 29,38,370 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 16,57,107 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డికి 8,09,882 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి 6,30,985 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కి 1,78,968 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డిపై 1,78,897 ఓట్లు మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.
తగ్గిన బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్న మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల అసెంబ్లీ స్థానాల్లో గతంలో కంటే బీఆర్‌ఎస్‌ తక్కువ ఓట్లు సాధించగా.. ఆ ఓట్లు మొత్తం బీజేపీకి పడినట్టు తెలుస్తోంది. భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగి బీజేపీ అభ్యర్థి గెలుపునకు దోహదం చేసాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మహేశ్వరం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 1,25,578 ఓట్లు పోలవ్వగా, పార్లమెంట్‌ ఎన్నికల్లో కేవలం 46,653 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి అసెంబ్లీలో 99,391 ఓట్లు రాగా పార్లమెంట్‌ ఎన్నికల్లో 1,50,327 ఓట్లు రావడం విశేషం. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 70,657 రాగా.. పార్లమెంట్‌లో 95,575 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్‌ తన ఓటింగ్‌ శాతం పెంచుకుంది. కానీ బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంక్‌ మాత్రం భారీగా తగ్గింది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 1,21,734 ఓట్లు రాగా, పార్లమెంట్‌ ఎన్నికల్లో 28,529 ఓట్లతో సరిపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా ఈ సారి సాధించలేదు. ఈ ఓట్లు మొత్తం బీజేపీకి షిప్టు అయ్యాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో 1,57,332 ఓట్లు రాగా ప్రస్తుతం కేవలం 42,648 ఓట్లు మాత్రమే వచ్చాయి. గతంలో సాధించిన మెజార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 80,148 ఓట్లు రాగా, ప్రస్తుతం 1,78,256 ఓట్లు సాధించింది.
గులాబీ అధినేత ఎజెండాలో భాగమేనా..!
చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడే బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఎలాగైనా ఆయన్ను ఓడించాలని కంకణం కట్టుకుంది. తాము గెలువకపోయినా రంజిత్‌రెడ్డిని ఓడించాలని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం క్యాడర్‌కు దిశానిర్దేశం చేసింది. ప్రస్తుత ఫలితాలు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి కొండ గెలుపునకు బీఆర్‌ఎస్‌ సహకరించినట్టు తేటతెల్లం అవుతోంది. గడ్డం రంజిత్‌రెడ్డిని ఓడించి.. బీఆర్‌ఎస్‌ తన పంతం నెగ్గించుకుందనే వాదనలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి.