రైల్వే బడ్జెట్‌ కేటాయింపుల్లో భారీ వ్యత్యాసం

Huge difference in railway budget allocations– తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలుగురాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక వివక్షను ప్రదర్శించింది. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లను కేటాయించగా, తెలంగాణ రాష్ట్రానికి కేవలం రూ.5,071 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో రూ.4,418 కోట్లు కేటాయిస్తే, ఈ సారి 14 శాతం అధికంగా నిధులు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. శుక్రవారంనాడిక్కడి రైల్‌ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానాలు చెప్పలేదు. ‘పాలసీ మేటర్‌…మాకు తెలీదు…మా దృష్టికి రాలేదు’ అంటూ దాటవేత ధోరణి అవలంబించారు. బడ్జెట్‌ కేటాయింపుల కోసం తెలంగాణ నుంచి పంపిన ప్రతిపాదనలు చెప్పేందుకూ నిరాకరించారు. రైల్వే బడ్జెట్‌ కేటాయింపుల కోసం పలువురు పార్లమెంటు సభ్యులు నేరుగా రైల్వే జీఎమ్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఆ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్నారో లేదో కూడా స్పష్టత ఇవ్వలేదు. ప్రయాణీకులే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లు ఎక్కట్లేదంటూ, సర్వీసుల నిలిపివేతను సమర్థించుకున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు తాము జోన్‌ మొత్తంగా పంపామని చెప్పిన ఆయన, వాటిలో కేంద్రం తిరస్కరించిన అంశాల వెల్లడిని దాటవేశారు. బడ్జెట్‌ పింక్‌బుక్‌లో పేర్కొన్న అంశాలనే విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వేకు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.13,786.19 కోట్లు కేటాయించగా, 2024-25లో రూ.14,232.84 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయని తెలిపారు. తెలంగాణ కనెక్టివిటీకి సంబంధించి రూ.770.12 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం రోడ్డు – డోర్నకల్‌ మధ్య 54.65 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ ప్రాజెక్ట్‌ మంజూరైందని పేర్కొన్నారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి కొత్త లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.350 కోట్లు కేటాయించారనీ, 151 కి.మీ., ఈ ప్రాజెక్టు 2006-07 సంవత్సరంలో రూ. 1,160 కోట్లతో మంజూరు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో 1/3వ వంతు నిధులు, అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సి ఉందనీ, దానిలో భాగంగా మనోహరాబాద్‌ – సిద్దిపేట మధ్య 76 కిలోమీటర్ల సెక్షన్‌ను పూర్తి చేసి ప్రారంభించామనీ, మిగిలిన పనులు జరుగుతున్నాయని వివరించారు. కాజీపేట-విజయవాడ మూడవ లైన్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.310 కోట్లు కేటాయించారనీ, 220 కి.మీ., పొడవుగల మూడవ రైల్వే లైన్‌ ప్రాజెక్ట్‌ పనులు 2012-13 సంవత్సరంలో రూ. 1,953 కోట్ల వ్యయంతో మంజూరు అయ్యాయని తెలిపారు. విజయవాడ- ఎర్రుపాలెం మధ్య 33 కిలోమీటర్లు, వరంగల్‌-నెక్కొండ సెక్షన్ల మధ్య 32 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయనీ, మిగిలిన సెక్షన్లలో పనులు జరుగుతున్నాయని చెప్పారు.ముదేడ్‌ మరియు సికింద్రాబాద్‌ మీదుగా అకోలా- డోన్‌ (పూర్ణ – ముదేడ్‌ మరియు బొల్లారం – మహబూబ్‌నగర్‌ మినహా) డబ్లింగ్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ. 220 కోట్లు కేటాయించారని చెప్పారు. రైల్వే బోర్డు సూచనల మేరకు బొల్లారం – మహబూబ్‌నగర్‌ మధ్య ఇప్పటికే పూర్తయిన భాగాన్ని మినహాయించి ముదేడ్‌ – డోన్‌ మధ్య ప్రాజెక్ట్‌ను చేపడుతున్నామన్నారు. గుంటూరు- బీబీనగర్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టు కోసం రూ.200 కోట్లు కేటాయించారన్నారు. ఈ ప్రాజెక్ట్‌ 2023-24లో 248 కి.మీ.ల మేర రూ. 2,480 కోట్ల వ్యయంతో మంజూరు చేయబడిందని తెలిపారు. భద్రాచలం రోడ్డు – డోర్నకల్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించారన్నారు. ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రెండవ దశ ప్రాజెక్ట్‌ కోసం వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారని తెలిపారు. రూ.817 కోట్ల వ్యయంతో మంజూరైన ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు మల్కాజిగిరి-బొల్లారం మధ్య 14 కి.మీ., డబుల్‌ లైన్‌ విద్యుదీకరణ, తేలాపూర్‌ – రామచంద్రపురం మధ్య 6 కిలోమీటర్లు , మేడ్చల్‌ – బోలారం మధ్య డబ్లింగ్‌ 14 కిలోమీటర్లు, మౌలాలీ – ఘట్‌కేసర్‌ మధ్య 12.2 కిలోమీటర్లు నాలుగు లైన్లు, మరియు ఫలక్‌నుమా-ఉందానగర్‌ మధ్య 13.5 కి.మీ మేర డబ్లింగ్‌ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఈ సెక్షన్‌లోని సనత్‌నగర్‌ నుంచి మౌలాలీ వరకు విద్యుదీకరణ డబ్లింగ్‌ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రెండవ దశ యాదాద్రి వరకు విస్తరణ ప్రాజెక్ట్‌ కోసం రూ. 10 కోట్లు కేటాయించారని చెప్పారు. 2016-17లో 33 కిలోమీటర్ల మేర దూరానికి రూ.330 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేయబడిందనీ, ఆ తర్వాత ఈ వ్యయం రూ. 430 కోట్లకు పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కవర్‌ చేస్తున్న విజయవాడ (19.5 కి.మీ), కాజీపేట (10.65 కి.మీ), రేణిగుంట (9.6 కి.మీ) మరియు వాడి (7.6 కి.మీ) వద్ద బై-పాస్‌ లైన్ల నిర్మాణానికి రూ.209.8 కోట్లు కేటాయించారన్నారు. తెలంగాణ-మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించి పర్లి వైద్యనాథ్‌ (1.9 కిమీ), వికారాబాద్‌ (2.8 కిమీ ), విష్ణుపురం (4.9 కిమీ), లాతూర్‌, ముదేడ్‌, పూర్ణ, అంకోలా బై-పాస్‌ లైన్ల నిర్మాణానికి రూ. 172.27 కోట్లు కేటాయించారని చెప్పారు. కాజీపేటలో రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ కోసం రూ.150 కోట్లు, చర్లపల్లిస్టేషన్‌లో శాటిలైట్‌ టెర్మినల్‌ అభివృద్ధి కోసం రూ.46 కోట్లు కేటాయించారు. వందే భారత్‌ రైళ్ల నిర్వహణ సౌకర్యాల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. సమావేశంలో ఏజీఎమ్‌ ఆర్‌ ధనుంజరు, సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.