గాజాలో భారీ పేలుడు

గాజాలో భారీ పేలుడు– ఎనిమిది మంది ఇజ్రాయిల్‌
– సైనికులు మృతి
ఇజ్రాయిల్‌ : ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతోన్న వేళ దక్షిణ గాజాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ఇజ్రాయిల్‌ సైనికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఇజ్రాయిల్‌ సైనికులు ప్రయాణిస్తున్న నేమర్‌ వాహనం పేలటంతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం తెలిపింది. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అదే విధంగా మతదేహాలను గుర్తించటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇజ్రాయిల్‌ సైనిక అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఎవరు జరిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో పేలుడు పరికరం అమర్చారా ? లేదా యాంటీ ట్యాంక్‌ మిసైల్‌ను నేరుగా ప్రయోగించారా ? అని ఇజ్రాయిల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడులో ఎనిమిది మంది సైనికులు మతి చెందటం భారీ నష్టమని తెలిపారు. ఇప్పటివరకు 306 మంది ఇజ్రాయిల్‌ సైనికులు మతి చెందారని వెల్లడించారు. మృతి చెందిన సైనికులకు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు నివాళులర్పించారు. తమకు భారీ నష్టం జరిగినా యుద్ధ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు.