లండన్‌ ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..

– విమానాల రాకపోకలను నిలిపివేత
లండన్‌ : బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని లూటన్‌ విమానాశ్రయంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌లోని కారు పార్కింగ్‌ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర వాహనాలకు కూడా అంటుకోవడంతో అగ్ని జాలలు ఎగసిపడ్డాయి. దీంతో పార్కింగ్‌ పైకప్పు పాక్షికంగా కూలిపోయింది. ఈ ప్రమాదంతో విమానాల రాకపోకలను నిలిపివేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని రకాల విమానాలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సర్వీస్‌ సిబ్బంది మంటలను ఆర్పడంతో పాటు, విమానాశ్రయంలోని ఇతర భవనాలు, వాహనాలకు మంటలు వ్యాపించకుండా నిరోధించారని చెప్పారు.