– ప్రజలపై రూ.20 వేల కోట్ల భారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గడిచిన పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో తెలంగాణలోని అన్ని వర్గాలపై భారం మోపిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2015-2016లో డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, అన్ని కేటగిరీల నుంచి విద్యుత్ ఛార్జీల ద్వారా రాష్ట్రంలోని డిస్కంలు (ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్) రూ.18,845 కోట్లు వసూలు చేశాయని తెలిపింది. 2023-24లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి విద్యుత్ ఛార్జీల ద్వారా డిస్కంలకు వచ్చిన రాబడి రూ.43,439 కోట్లు కాగా, ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల భారం రూ. 24594 కోట్లుగా వెల్లడించింది. ఇందులో పెరిగిన కనెక్షన్లు.. పెరిగిన విద్యుత్ వినియోగం పక్కన పెట్టినా, దాదాపు రూ.20 వేల కోట్ల భారం పడిందని తెలిపింది.. 2015-16లో 5 శాతం, 2016-17లో 8 శాతం, 2022-23లో ఒకేసారి 16 ఛార్జీల పెంపుతో వినియోగదారులపై రూ. 6 వేల కోట్లకుపైగా భారం పడిందని పేర్కొంది. 2020కి ముందు ఫిక్స్డ్ ఛార్జీల ప్రస్తావన లేక పోగా, గృహ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ ఛార్జీలను వసూలు చేయటం మొదలు పెట్టిందని తెలిపింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీలు పెంచలేదంటూ ప్రజలను మోసం చేసిందని వివరించింది. పేదలను, మధ్య తరగతి ప్రజలను ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలి పెట్టకుండా గత ప్రభుత్వం ఒక్కో యూనిట్ పై 50 పైసల నుంచి ఒక రూపాయి చొప్పున వడ్డించిందని తెలిపింది. డిస్కంల సంస్థల లాభనష్టాలను వెల్లడించకుండా గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిందని ఆందోళన వ్యక్తం చేసింది.