భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

– 15వేల మెగావాట్లకు చేరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం 10.03 గంటలకు పీక్‌ అవర్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో 15,254 మెగావాట్లకు చేరింది. అయితే ఈ డిమాండ్‌ను విద్యుత్‌ పంపిణీ సంస్థలు ముందే ఊహించడంతో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక విద్యుత్‌ వినియోగం. రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా పెరగడంతో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతున్నట్టు టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. మొత్తం విద్యుత్‌ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానిదేనని ఆయన చెప్పారు. విద్యుత్‌ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలోఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని ఆయన వివరించారు. ఈ ఏడాది వేసవికాలంలో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 16 వేల మెగావాట్లకు పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేశామని ఆయన తెలిపారు. డిమాండ్‌ ఎంత పెరిగినా ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.