క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు

– తప్పు చేస్తే డిపార్టుమెంట్‌ అని కూడా చూడం : రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
వన్డే వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. దేశంలో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్‌ ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ సేడియంలో ఈ నెల 6 నుంచి 10 వరకు మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో గురువారం ఉప్పల్‌ స్టేడియాన్ని సీపీ పరిశీలించారు. అనంతరం డీసీపీలు శ్రీబాలా, బాల స్వామీ, జానకి దరావత్‌, ఏసీపీ శ్రీనివాస్‌, సీఐ గోవింద్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో సీపీ భద్రత వివరాలను వెల్లడించారు. స్టేడియం సిట్టింగ్‌ కెపాసిటీ 39 వేలు ఉంటుందని, స్టేడియం లోపల పరిసరాలలో 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. స్టేడియం లోపల ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దాదాపు 1200 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారన్నారు. క్రికెట్‌ చూడటానికి నగరంతోపాటు దేశవిదేశాల నుంచి ప్రేక్షకులు, అభిమానులు వస్తారని, ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించాలన్నారు. ఒకరిని కించ పరిచే విధంగా నినాదాలు చేయొద్దని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రతి ఒక్కరి కదలికల పైనా నిఘా ఉంటుందన్నారు. పోలీస్‌ శాఖతోపాటు ఏ డిపార్టుమెంట్‌ వారు తప్పుచేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఉదయం 11 గంటలకు ప్రేక్షకులను గ్రౌండ్‌లోకి అనుమతిస్తామని, 2 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుందన్నారు. గ్రౌండ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ కవర్‌ అయ్యేలా సీసీ కెమెరాలు పెట్టామని, కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సెక్యూరిటీని మానిటరింగ్‌ చేస్తామన్నారు. ప్రత్యేకంగా పార్కింగ్‌ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్‌ అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి బయటకి వెళ్లకుండా మెల్లగా వెళ్లాలని కోరారు.
షీ బృందాలు, మఫ్టీలో పోలీసుల నిఘా
స్టేడియంలో పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు షీ బృందాలు, మఫ్టీలో పోలీసులను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. స్టేడియం లోపలా బయటా మఫ్టీలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తారన్నారు. బ్లాక్‌ టికెట్స్‌ ఆమ్మే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
పలు వస్తువులపై నిషేధం
నిషేధిత వస్తువులు తీసుకురావద్దని క్రికెట్‌ అభిమానులకు సీపీ సూచించారు. హెల్మెట్‌, పవర్‌ బ్యాంక్‌, సిగరెట్లు, మద్యం, తినే పదార్థాలు బయట నుంచి నీళ్ల డబ్బాలను అనుమతించబోమని చెప్పారు. ముఖ్యంగా స్టేడియానికి వచ్చేవారు టిఫిన్‌ బాక్స్‌లను తీసుకుని రావడాన్ని నిషేధించారు. వాటితోపాటు ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మ్యాచెస్‌బాక్స్‌లు, బ్యాటరీలు, బైనాకూలర్స్‌, బ్యాగ్స్‌, బ్యానర్స్‌, లైటర్స్‌, కాయిన్స్‌, సీతల పానియాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ వస్తువులు, పెన్స్‌, ఇయర్‌ఫోన్లు తీసుకొని రావడం నిషేధమని సీపీ తెలిపారు.