కొల్‌కతాలో వైద్యుల భారీ ర్యాలీ

A huge rally of doctors in Kolkataకొల్‌కతా: శనివారం నుంచి అత్యవసర సేవలకు హాజరవుతామని ప్రకటించిన కొల్‌కతా వైద్యులు శుక్రవారం భారీ ఆందోళన నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ (డబ్ల్యూబిజెడిఎఫ్‌) ఆధ్వర్యాన రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం (స్వాస్థ్య భవన్‌) నుండి సిజిఒ కాంప్లెక్స్‌లోని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) కార్యాలయం వరకు సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. హిలాండ్‌ పార్క్‌ ప్రాంతం నుండి ఉత్తర కొల్‌కతాలోని శ్యాంబజార్‌ వరకు రిలే టార్చ్‌ ర్యాలీ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ పాల్గొన్న జూనియర్‌ డాక్టర్‌ అనికేత్‌ మహాతో మీడియాతో మాట్లాడుతూ ‘సమ్మెను ముగించడాన్ని మా బలహీనతగా రాష్ట్ర ప్రభుత్వం చూడకూడదు’ అని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు, ఆరోగ్య కార్యకర్తల నుంచి తమకు లభించిన మద్దతు ఇంక నుంచి కూడా కొనసాగుతుందని డబ్లూబిజెడిఎఫ్‌ ఆశిస్తుందని అన్నారు. మరో వైద్యులు దేబాసిస్‌ హల్దర్‌ మాట్లాడుతూ వైద్య కళాశాలల్లో తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.
40 మంది వైద్య విద్యార్థులపై వేటు
పశ్చిమ బెంగాల్‌ నడియా జిల్లా కళ్యాణి వద్ద ఉన్న జెఎన్‌ఎం ఆసుపత్రి, వైద్య కళాశాలకు చెందిన 40 మంది వైద్య విద్యార్థులు, జూనియర్‌ డాక్టర్లను ఆరునెలల పాటు అధికారులు నిషేధించారు. ఇతర విద్యార్థులను, డాక్టర్లను బెదిరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం జరిగిన కళాశాల కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిషేధం విధించిన 40 మంది విద్యార్థులను ఆరు నెలల పాటు కాలేజీలోకి అనుమతించరు. పరీక్షలకు హాజరుకావడాన్ని అనుమతిస్తారు.