టీసీఎస్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు

టీసీఎస్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు– గతేడాది 13వేల మందికి కోత..!
– క్యూ4లో రూ.12,435 కోట్ల లాభాలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌)లో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 1,759 ఉద్యోగులు తగ్గారు. గడిచిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉద్యోగుల్లో 13,249 మంది మేర తగ్గారు. ఆ మొత్తం మంది మానేశారా..? లేకా తొలగించారా అనేది స్పష్టత లేదు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య నికరంగా 22,600 పెరగడం విశేషం. తాజా గణాంకాల ప్రకారం మార్చి 31 నాటికి టిసిఎస్‌లో 6,01,546 మంది ఉద్యోగులున్నారు. మొత్తం సిబ్బందిలో 35.6 శాతం మహిళలు కాగా.. 152 దేశాలకు చెందినవారు ఉన్నారని టిసిఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సిఒఒ) ఎన్‌ గణపతి సుబ్రమణియన్‌ తెలిపారు. ఉద్యోగుల వలసల రేటు 12.5 శాతానికి తగ్గిందని టిసిఎస్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు కనబరిచిన వారికి రెండంకెల ఇంక్రిమెంట్‌ ఉంటుందని ఆయన వెల్లడించారు. గతేడాది కొత్త నియామకాలు 6,333కు తగ్గాయి. నాలుగో త్రైమాసికంలో కేవలం 821 మంది కొత్త ఉద్యోగులను మాత్రమే తీసుకుంది.
గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో టిసిఎస్‌ నికర లాభాలు 9 శాతం పెరిగి రూ.12,434 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది క్యూ4లో రూ.11,058 కోట్ల లాభాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో రూ.59,162 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ4లో రూ.61,237 కోట్లకు చేరింది. తుది డివిడెండ్‌ కింద ప్రతీ షేర్‌పై రూ.28 చెల్లించడానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. గడిచిన త్రైమాసికంలో తమ కంపెనీ మెరుగైన ప్రగతిని కనబర్చిందని గణపతి సుబ్రమణియన్‌ అన్నారు. వర్థమాన మార్కెట్ల వృద్థి మరింత పటిష్టతను పెంచిందన్నారు. శుక్రవారం బిఎస్‌ఇలో టిసిఎస్‌ షేర్‌ విలువ 0.45 శాతం పెరిగి రూ.4,000.30 వద్ద ముగిసింది.