– నిర్దిష్టమైన మార్గదర్శకాలు లేక గందరగోళం
– అధికారులు చెప్పినా అనేక అనుమానాలు, సందేహాలు
– ఆశలతో దరఖాస్తుదారుల బారులు
– మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు
– అవగాహన రాహిత్యంతో అవస్థలు
– అనుమానాలను నివృత్తి చేయడంలో సిబ్బంది విఫలం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘ప్రజా పాలన’ పేరుతో ఎనిమిది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ప్రభుత్వం… అభయహస్తం కింద ఐదు గ్యారెంటీలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భారీ అశలతో జనం కూడా దరఖాస్తు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులైంది. దరఖాస్తు చేసుకోవడానికి అన్ని వర్గాల నుంచి భారీగానే స్పందన ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి ముందు, ఇచ్చిన తర్వాత అందులో వివరాలను భర్తీ చేసే క్రమంలో సందేహాలు జనాన్ని వెంటాడుతున్నాయి. వాటిని ప్రభుత్వ సిబ్బంది సైతం నివృత్తి చేయలేకపోతున్నారు. ఉన్నతాధికారులు చెబుతున్నా అనుమానాలు జనం నుంచి పోవడం లేదు. ఒక్కో అధికారి ఒక్కొక్క తీరుగా సూచనలు చేస్తుండటంతో అయోమయానికి లోనవుతున్నారు. నిర్దిష్టంగా మార్గదర్శకాలు లేకపోవడం, పథకాల గురించి అవగాహన కల్పించకపోవడంతో దరఖాస్తుల్లోని అంశాలు సరికొత్త సందేహాలకు తావిచ్చినట్టయింది. కొత్త గ్యారెంటీలను అందుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే గత ప్రభుత్వ హయాం నుంచి పొందుతున్న లబ్ధి ఆగిపోతుందేమో… వివరాల ఆధారంగా ఆనర్హత వేటు పడుతుందేమో.. ఉన్న రేషన్, కార్డుకూ కోత పడుతుందేమో. ఇలాంటి భయాలు మొదలయ్యాయి. దరఖాస్తులో వివరాలను ఇవ్వడం ద్వారా ఈ గ్యారెంటీలకు రూపొందించే మార్గదర్శకాలతో ఇప్పటివరకూ అందిన ఫలాలు కూడా ఆగిపోతాయనేది వారి ఆందోళన. పైగా ఇప్పుడు లబ్ధి పొందుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలా? లేదా? అనేది కూడా సందేహంగానే ఉంది.
తీరని సందేహాలు..
ఎవరు ఏ గ్యారెంటీ పలాలను అందుకోవాలనుకుంటున్నారో వారే దరఖాస్తు చేయాలని సీఎం రేవత్‌రెడ్డి మీడియాతో చెప్పారు. ఏ గ్యారెంటీ ఎవరికి ఎంత అవసరమున్నది? వారికున్న అర్హతలేంటి? ఎంతమందికి రేషను కార్డుల్లేవు” ఇలాంటివన్నీ తెలుస్తాయని, ఆ తర్వాత ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుందని, నిస్సహాయులకు సాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నొక్కిచెప్పారు. కానీ సరైన ప్రచారం కల్పించకపోవడం, మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో ప్రజల అనుమానాలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
ఊరొక చోట ఉండేది మరో చోటైతే సమస్యే..!
చాలామంది గ్రామాలను వదిలి వేరొక చోట నివాసముంటున్నారు. అటువంటివారు ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఆధార్ కార్డుపై అడ్రస్ ఒకచోట, రేషన్ కార్డు మరొకచోట ఉంటే ఎక్కడ అప్లై చేసుకోవాలనేది కూడా సమస్యగా ఉంది. రేషన్ కార్డులు లేని వారు కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై దరఖాస్తు ఇస్తున్నారు. అయితే ఇవి ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనే అనుమానం కూడా ఉంది. దరఖాస్తులను ఎలా పరిశీలిస్తారని, లబ్దిదారులను ఎలా గుర్తిస్తారు. తప్పులతడకలతో పేర్లు ముద్రిస్తే వాటిని ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఎకౌంట్ నెంబర్ ఎప్పుడు తీసుకుంటారు.. ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. కౌలు రైతులు, రైతు కూలీల విషయంలోనూ అనుమానాలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యుల వివరాల్లో గతంలోని రేషను కార్డులో ఉమ్మడి కుటుంబంగా ఉన్నా ఇప్పుడు వేరే కుటుంబంగా ఉంటే పొందుపరిచేది ఎలా? అనే సందేహాలున్నాయి. పాతరేషను కార్డులో ఒకే కుటుంబంగా ఉన్నా ఇప్పుడు ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లి ఆధార్ కార్డు అక్కడి అడ్రస్ ఉంటే గ్యారెంటీల ఫలాలు పొందడానికి అర్హత ఉంటుందా? అనే సందేహాలున్నాయి. ధరణిలో భూముల వివరాలు తప్పుగా పడిన రైతులు రైతు భరోసా కు ఎలా అప్లై చేసుకోవాలనే విషయంలోనూ సందేహాలు ఉన్నాయి. పాతరేషన్ కార్డు ప్రకారం కుటుంబ పెద్ద చనిపోతే సభ్యులుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చా? విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న భార్యాభర్తలకు గతంలో రేషన్‌కార్డు ఉంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా?.. పాత కార్డును మార్పు చేసుకునే వీలుంటుందా?.. కుటుంబ పెద్ద పేరుతోనే విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ. 500 సిలిండర్ సబ్సిడీ వర్తిస్తుందా? కనెక్షన్లలో మార్పులు చేసేంతవరకూ లబ్ధి అందుతుందా? లేదా? కార్డులో అప్పట్లో ఆవివాహితులుగా ఉండి ఇప్పుడు పెండ్లి చేసుకున్నట్లయితే భార్య/భర్త పేరు చేరకపోతే వారి వివరాలను ఇప్పుడు దరఖాస్తులో ప్రస్తావించవచ్చా? తదితర సందేహాలు దరఖాస్తుదారులను వెంటాడుతున్నాయి. ఆధార్ కార్డులోని అడ్రస్ ప్రకారం దరఖాస్తును ఆ చిరునామా ఉన్న ప్రాంతంలో సమర్పించాల్సి ఉంటుందా? లేక రేషన్ కార్డులోని ఆడ్రస్ ప్రకారం అందజేయాలా? ఆధార్, రేషను కార్డుల అడ్రస్లు వేర్వేరుగా ఉంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?… రెండు చోట్లా చేసుకోవాలా?..తదితర సందేహాలు ఉన్నాయి.
మీ సేవల వద్ద పడిగాపులు…
ఆధార్ కార్డుపై అడ్రస్ చేంజ్ చేయించుకోవడం కోసం పలువురు మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొందరు దరఖాస్తులు, ఈకేవైసీ కోసం బారులు తీరుతున్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో మీసేవ కేంద్రం వద్ద, నగరంలోని పలు మీ సేవ సెంటర్ల వద్ద ఇలాంటి దశ్యాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఆధార్ లో తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ ఉండటంతో పలువురు ఆరు గ్యారెంటీలు వర్తించవేమోనని ఆందోళనతో మార్పిడి కోసం తంటాలు పడుతున్నారు. ప్రాథమిక స్థాయి పరిశీలన చేసి ప్రజల నుంచి వివరాలను తీసుకోవడానికే సిబ్బందికి సమయం సరిపోవడం లేదు. మరోవైపు ప్రజలు ప్రస్తావించే సందేహాలకు వారి దగ్గర కూడా సమాధానాలు లేవు. నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందని కారణంగా వాటిని వివరించడం కూడా ఆఫీసర్లకు శక్తికి మించిన పనిగా మారింది.
అనుమానాల నివృత్తికి హెల్ప్ డెస్క్ లు
దరఖాస్తులపై అనుమానాల నివృత్తికి హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నది ఉన్నట్టుగా అప్లై చేయొచ్చు. ఒకవేళ రేషన్ కార్డు లేని వారు పాత రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా దరఖాస్తు చేయొచ్చు. తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఉండి… పెండ్లయిన పిల్లలకు రేషన్ కార్డు లేనట్టయితే తల్లిదండ్రుల రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు తో నిమిత్తం లేకుండానే ఆరు గ్యారంటీల అమలు ఉంటుంది. ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కౌలు రైతులు, రైతు కూలీలు అప్లికేషన్ ఫామ్ లో నిర్దిష్టమైన చోట తమ వివరాలను పొందుపరచాలి. రైతుబంధు వస్తున్నా రైతు భరోసా కోసం తగిన వివరాలను దరఖాస్తులో పేర్కొనాలి. దరఖాస్తు ఫారాన్ని నింప లేని వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరూ విధిగా రశీదు పొందాలి.
వీపీ గౌతమ్, ఖమ్మం జిల్లా కలెక్టర్