– నేటితో ముగియనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్
– 7 లక్షల మంది పుస్తక, సాహితీ ప్రియులు, విద్యార్థుల సందర్శన
– యువతీయువకులతో కళకళలాడుతున్న స్టాల్స్
– నేడు మరో లక్షన్నర మంది సందర్శించే అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో పుస్తక జాతరకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సాంకేతిక రంగం వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలోనూ.. పుస్తకప్రియులకు కొదవ లేదనేది కండ్లకు కట్టినట్టు కనబడుతున్న సత్యం. ఇంటర్నెట్, ఇన్‌స్టాగ్రామ్, ఫెస్‌బుక్, వాట్సాప్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల్లో కావాల్సిన సమాచారం క్షణాల్లో దొరుకుతున్న ఈ తరుణంలో పుస్తకాల కోసం పుస్తక, సాహితీ ప్రియులు, యువతీయువకులు, విద్యార్థులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో బుక్ ఫెయిర్‌ను సందర్శంచడం ఆకట్టుకుం టోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 9న ప్రారంభమైన 36వ జాతీయ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. ఈ పదిరోజుల్లో సుమారు 7లక్షల మంది సందర్శకులు బుక్ ఫెయిర్‌కు తరలివచ్చారు. వారిలో 2లక్షలకుపైగా చిన్నారులు, ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. వీరందరికి ఉచిత ప్రవేశం కల్పించారు. ఇక పదో రోజు అదివారం సెలవు దినం కావడంతో పండుగ వాతావారణం కనిపించింది
‘యువత’ జోరు
బుక్‌ఫెయిర్‌లో ప్రధానంగా విద్యార్థులు, యువకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దాదాపు 369 గ్రంథ విక్రయ కేంద్రాలను కలియతిరుగుతూ ఆద్యంతం సేదతీరారు. టెక్నాలజీ యుగంలో ఏదో తెలియని ఒత్తిడికి గురవుతున్న వారు ఇక్కడి రావడంతో మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినంత ఆనందంలో మునిగిపో యారు. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు కావాల్సిన పుస్తకాలను కొనిచ్చారు. ప్రధానంగా పోటీపరీక్షల పుస్తక స్టాళ్లన్నీ యువతతో రద్దీగా కనపడుతున్నాయి. అలాగే కెరీర్, అకడమిక్, వ్యక్తిత్వవికాస పుస్తకాలతోపాటు ఫిక్షన్, నాన్‌ఫిక్షన్ పుస్తకాల కొనుగోలుకు మక్కువ చూపిస్తున్నారు. వీటితో పాటు ఇతర విక్రయ కేంద్రాల్లోని పలు పుస్తకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ స్టాల్‌లో ఉంచిన పుస్తకాల్లో చరిత్ర, అలిశెట్టి ప్రభాకర్, అమ్మ, ఇంగ్లీష్ టీచర్ వంటి పుస్తకాలకు మంచి ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఇతర పుస్తక ప్రచురణ సంస్థలు విభిన్న అంశాలపై వెలువరించిన పుస్తకాలకు గిరాకీ ఉందని చెబుతున్నారు. అలాగే పుస్తక ప్రదర్శన జరగుతున్న తీరు పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను అభినందించారు.
పారదర్శకంగా ప్రవేశ రుసుము టికెట్ల జారీ :
బి.శోభన్ బాబు, జాయింట్ సెక్రటరీ, హైదరాబాద్ బుక్ ఫెయిర్
బుక్ ఫెయిర్ ప్రవేశ టికెట్ల విషయంలో పారదర్శకంగా ఉండేలా ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఉపయోగించాం. మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ పద్దతిలో టికెట్లు జారీ చేశాం. క్యూ లైన్‌లో నిల్చుని టికెట్లు తీసుకునే వారికోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. టికెట్ల అమ్మకాలు బాగున్నాయి. పదేండ్ల లోపు పిల్లలకు, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టు లకు ఎలాంటి రుసుము తీసుకోకుండా ఉచిత ప్రవేశం కల్పించాం. పెద్దసంఖ్యలో ఉచిత పాస్‌లు పంపిణీ చేశాం.
షెడ్యూల్ ప్రకారమే అన్ని కార్యక్రమాలు :
పి.నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు, హైదరాబాద్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌లో రవ్వా శ్రీహరి వేదిక ఎంతో కీలకం. ఈ వేదికపై 11 రోజుల పాటు ప్రతిరోజూ జరిగే నూతన పుస్తకావిష్కరణలు, సాహిత్య, సంస్కృత, బాల వికాస్ కార్యక్రమాలు, రచయితల చర్చా గోష్టి, ఇతర కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. అందరితో సమన్వయం చేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేయాలి. ఈ వేదికపై ప్రతిరోజూ ఎనిమిది కార్యక్రమాలు జరుగుతున్నాయి. గెస్ట్‌లకు శాలువాలు, మెమొంట్‌లతో బుక్ ఫెయిర్ తరపున సన్మానిస్తాం.
మౌలిక సదుపాయల కల్పనలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశాం కె. బాల్ రెడ్డి, ఎం. సూరి బాబు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఈ ఏడాది మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ వచ్చాం. గతంలో కంటే ఈసారి 7 మరుగుదొడ్లు, 12 మూత్రశాలలు ఏర్పాటు చేశాం. స్టాల్స్‌కు స్టాల్స్ మధ్యలో గ్యాప్ 30 ఫీట్ల నుంచి 40 ఫీట్లకు పెంచాం. సందర్శకులు అన్ని స్టాల్స్ తిరిగేలా బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఎండల తీవ్రత నేపథ్యంలో అందరికి చల్లటి నీరు అందిస్తున్నాం. రోజూ సాయంత్రం స్టాల్స్ నిర్వహకులకు స్నాక్స్ ఇస్తున్నాం. బుక్ ఫెయిర్‌లో మౌలిక సౌకర్యాలు, నిర్వహణకు సంబంధించి షాప్ హౌల్డర్స్ దగ్గర నుంచి సందర్శకుల వరకు సంతోషం వ్యక్తం చేశారు. నూతన కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో బుక్ ఫెయిర్ అద్భుతంగా సాగుతోంది.