– జీహెచ్‌ఎంసీకి రూ.1107.29 కోట్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ 2023-24)కి ఈ సంవత్సరంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరు ద్వారా రూ.1107.29 కోట్ల ఆదాయం సమకూరింది. 140 వాణిజ్య భవనాలకు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో బహుళ అంతస్తులు 44 ఉండటం విశేషం. అలాగే ఇనిస్టిట్యూట్స్, ఆస్పత్రులకు సంబంధించి 34 సాధారణ భవనాలకు, 12 బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చారు. 2282 సాధారణ అపార్ట్ భవనాలు కాగా, 130 బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. 2022-23లో రూ.1454.76 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ.347.47 కోట్ల ఆదాయం తగ్గింది. 2021-22లో రూ.1144.08 కోట్ల ఆదాయం వచ్చింది. గత అక్టోబర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలు కావడంతోపాటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, తిరిగి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో రియల్ ఎస్టేట్ మందగించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎనిమిది నెలల నుంచి రియల్ రంగంలో స్థబ్ధత నెలకొందని వ్యాపారులు అంటున్నారు. సాధారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ.వెయ్యి కోట్లకు అటు ఇటుగా ఆదాయం ఉంటుంది.
2023-24లో మొత్తం 13641 భవన నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో 11074 భవన నిర్మాణాల అనుమతులు కాగా, 2567 ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లు మంజూరు చేశారు. రియల్ ఎస్టేట్ రంగం ద్వారా కేవలం రాష్ట్రాభివృద్ధి మాత్రమే కాక, జీడీపీ కూడా పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం వచ్చిన ఆదాయం తక్కువేమీ కాదంటున్నారు.