నవతెలంగాణ-వేమనపల్లి
మండలంలో అర్ధరాత్రి సమయంలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి పడ్డాయి. నీల్వాయి-మల్లంపేట ప్రధాన రహదారి వెంబడి ఉన్న కల్వర్టు సమీపంలో భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా నేలకొరగడంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీల్వాయి ఎస్‌ఐ శ్యామ్ పటేల్ సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను తొలగించే వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అడవిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బలంగా వీచిన గాలికి పలు గ్రామాల్లో ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరగడంతో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.