హుకుంనామా!

Hukunnama!మరెవరిదో కాదు.. పైన తాళ్లులాగే వారిదే! మనకి కనపడే వారంతా ”కేతిగాళ్లు.. బంగారక్కలే..!” మరీ ముఖ్యంగా 1990ల తర్వాత ప్రపంచ బ్యాంకు విధానాలు మెల్లిగా పాతుకోవడం మొదలైంది. ఆ తర్వాత దేశమంతా ఈ తోలు బొమ్మలాట క్యారెక్టర్లే తైతక్కలాడుతున్నాయి. వెనక తాళ్లు లాగే ప్రపంచబ్యాంకు సూత్రధారులు అస్సలు కనపడరు. పాలకులను, వారి హావభావాలను, డైలాగులను బట్టి, పార్టీల రంగులను బట్టి చూస్తే తప్ప విధానాల లోతుపాతులు అర్థంకావు.
1990ల్లో అటు బహుళజాతి గుత్త సంస్థలు, ఇటు ఐఎంఎఫ్‌ ప్రపంచబ్యాంకు వంటి అంతర్జాతీయ మదుపు సంస్థలు అన్ని మూడవ ప్రపంచ దేశాల్లోని విద్యుత్‌ సంక్షో భాలకు ప్రధాన కారణం, అవసరమైనంత భారీ థర్మల్‌ కేంద్రాలు లేకపోవడమేననీ, దానికి చాలినంత బొగ్గు, గ్యాసు దిగుమతి చేసుకునైనా సరే అర్జంటుగా థర్మల్‌ కేంద్రాలు స్థాపించాలన్నాయి. ఇకనేం?! ఎన్రాన్‌ అలా వచ్చి, మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటి బోర్డు (ఎంఎస్‌ఈబీ) ని ఇలా ముంచిపోయింది.
పాత కథంతా ఇప్పుడెందుకనుకుంటున్నారేమో?! దేనికైనా గతించిన చరిత్ర తెల్సుకోకపోతే వర్తమానం అర్థంకాదు. భవిష్యత్‌ డోలాయామానంలో ఉంటుంది. ముఖ్యంగా విద్యుత్‌కు సంబంధించి ప్రస్తుత పాలకుల కార్యాచరణ అర్థం కావాలంటే పాత నేపథ్యం కొంత అర్థమై ఉండాలి. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ”గ్రీన్‌ ఎనర్జీ”అనే పాట పాడింది. ఆశ్చర్యమేమంటే ఇదే పాట అమరావతిలోనూ ప్రతిధ్వనించింది. అక్కడితో ఆగితే ఫరవాలేదు. మోడీ మహాశయుని పుణ్యాన దేశమంతా మారుమోగుతోంది. బహుశా నిన్న పత్రికల్లేవు గాని, ఉండుంటే పతాక శీర్షికలెక్కాల్సిన వార్త ”తెలంగాణ ప్రజలకి కరెంటు చార్జీలు పెంచట్లేదనే ‘శుభవార్త’ట! వార్త కరెక్టే గాని దీంట్లో శుభం ఎంతో, అశుభం ఎంతో రాష్ట్ర ప్రజలకి తెలియాలి.
ఎప్పటికప్పుడు పారదర్శకంగా ప్రజలకి చార్జీల మోత అర్థం కావాల్సిందిపోయి… రెగ్యులేటరీ కమిషన్లు ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలైనాయి. అందుకనే బీఆర్‌ఎస్‌ సుమారు రూ. 16వేల కోట్లకు పైబడే మొత్తాన్ని ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ చివరికి పైసా చెల్లించకుండానే దాటిపోయింది. దాన్ని రేవంత్‌ ప్రభుత్వం తమ భుజాల మీదేసుకుంది. ఆ మేరకు మంచిదే. చివరికి 2025-26 ఏడాదికి సంబంధించింది కూడా ప్రభుత్వం మీదేసుకుంది. అదేనట శుభవార్త. ఇక్కడ అసలు విషయమేమిటంటే 2000 సం||లో జరిగిన విద్యుత్‌ చార్జీల వ్యతిరేక ఉద్యమంతో ఈ పాతికేండ్లలో వచ్చిన ఏ పార్టీ, ఏ ప్రభుత్వమూ విద్యుత్‌ చార్జీలు పెంచే ధైర్యం చేయలేకపోతోంది. చివరికి విద్యుత్‌ సంస్థలు వేల కోట్ల రూ.లు ‘ట్రూ-అప్‌’ చార్జీలు పేర పేరబెట్టి ఈఆర్సీ ముందుకుపోయినా ప్రభుత్వాలు సాహసించలేకపోతున్నాయి.
ఇప్పుడు తాజాగా రాష్ట్రం ప్రకటించిన గ్రీన్‌ ఎనర్జీ పాలసీ (7.6)లో వ్యవసాయ భూముల్లో సోలార్‌ ప్లాంట్‌లు పెడితే దాన్ని నాలుగెకరాల వరకు వ్యవసాయేతర భూమిగా ‘డీమ్డ్‌ కన్వర్షన్‌’ స్టేటస్‌ ఇస్తారు. ఒక రకంగా నయా భూస్వాముల తయారీకి ఇది పెద్దమార్గం కానుంది. ప్రభుత్వ పెద్దల వ్యవహారం చూస్తే అరచేతిలో పెట్టి మోచేతి దాకానో, వీలైతే ఇంకా ఆ పైకో నాకించేలా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2024-25లో గరిష్ట డిమాండు 15,623 మె.వా. ఉందట. అది మరో పదేండ్లకు 31,809 మె.వా. పెరుగుతుందట. ఎలానో తెలుసా? మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్‌ సిటీ, ఎ.ఐ. సిటీ, ఫార్మాసిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్‌, పారిశ్రామిక కారిడార్‌ తదితర అభివృద్ధి పనుల వల్లనట! సామెతలు చెబితే పెద్దలు నొచ్చుకోవచ్చు. ఆలీ లేదు.. చూలూ లేదు… పుట్టబోయే కొడుకు పేరు సోమలింగమట?! మొన్న ఫార్మాసిటీ అంటేనే నానా యాగీ జరిగింది. అబ్బే! అది ఫార్మాసిటీ కాదు, దాని పేరు ఇండిస్టియల్‌ కారిడార్‌ అన్నారు.
అయితే, గియితే సోమలింగమే పుడితే పందేరం రెడీ చేశారు. ప్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌లట, విండ్‌ పవర్‌ ప్లాంట్లట, గ్రీన్‌ హైడ్రోజనట, హైబ్రిడ్‌ ప్రాజెక్టులట! పంచరంగుల చిత్రాలు 70 ఎమ్‌.ఎమ్‌.లో చూపుతున్నారు. ముందస్తు ప్రణాళికలు మంచివే! కానీ అవి ఎవరి ప్రయోజనాలను కాస్తున్నాయో జనానికి అర్థం కావాలిగా?!!