ఓజోన్ పోరతోనే మానవ మనుగడ

 Human survival depends on ozoneఈ పుడమిపై మానవాళితో పాటు సమస్త జీవ కోటి మనుగడకు అవసరమైన సహజ వాతావరణాన్ని ప్రకృతి అందించింది. అయితే కాల గమనంలో మానవుడు మాత్రం ఈ ప్రకృతి విధ్వంసానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమై తన మనుగడతో పాటు ఏ పాపం ఎరుగని మూగజీవాల ఉనికిని కూడా ప్రశ్నార్ధకం చేస్తున్నాడు. దీని ఫలితమే నేడు ప్రకృతి గమనం గతి తప్పి పోయింది. ఆరు ఋతువులు మూడు కాలాలు అనేవి క్రమం తప్పి పోయాయి. వేసవిలో వర్షాలు వర్షాకాలంలో ఎండలు దర్శనం ఇస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, సముద్రాలు జనావాసాలను ముంచెత్తడం, భూ కంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు నిత్యకృత్యం అయిపోయాయి. దీనిలో భాగంగానే ప్రకృతి మనకు అంధించిన సహజ రక్షణ కవచమైన ఓజోన్‌ పొరకు చిల్లులు పడటంగా చెప్పొచ్చు.
ఓజోన్‌ పొర అనేది భూమి వాతావరణంలోని ఓ పలుచని వాయువు, ఇది సూర్యుని అతినీలలోహిత (ఖV) వికిరణాన్ని ఎక్కువగా గ్రహిస్తుంది. సూక్ష్మంగా ఓజోన్‌ ను ఆక్సిజన్‌కు మరో రూపంగా చెప్పవచ్చును. ఎందుకంటే సాధారణంగా ఒక ఆక్సిజన్‌ అణువులో రెండు ఆక్సిజన్‌ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అణువుకు మరో ఆక్సిజన్‌ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్‌’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్‌ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్‌’ను ‘ట్రైఆక్సిజన్‌’ (ఉ3) అని కూడా అంటారు. పాలపై ఉండే మీగడలా భూమి చుట్టూ ఓ పొరలా స్ట్రాటో ఆవరణంలో ఈ ఓజోన్‌ 15 నుంచీ 50 కిలోమీటర్ల మందంలో అల్లుకుని ఉంటుంది. క్రిస్టియన్‌ ఫ్రెడరిక్‌ స్కోన్‌బీన్‌, జర్మన్‌-స్విస్‌ రసాయన శాస్త్రవేత్త, 1839లో మొదటి సారిగా ఈ ఓజోన్‌ను కనుగొన్నాడు. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి 290 నానోమీటర్ల కంటే తక్కువ తరంగ దైర్ఘ్యంతో (వేవ్‌లెంగ్త్‌) వెలువడే అతి నీలలోహిత కిరణాలను సమర్థంగా అడ్డుకోగలదు. అంటే అతి నీలలోహిత కిరణాలను ఓజోన్‌ పొర శోషించుకుని ప్రమాదకర రేడియేషన్‌ ప్రభావం నుంచి సకల జీవకోటికి ఓజోన్‌ రక్షణగా నిలుస్తూ ఉంది. ఈ కారణం చేతనే ఓజోన్‌ పొర అనేది ప్రకృతి మనకు అందించిన గొప్ప సహజ రక్షణ కవచంగా పేర్కొంటారు. ఈ ఓజోన్‌ పొర కనుక క్షీణిస్తే అంటే ఓజోన్‌కు రంద్రం పడితే ఈ భూమిపై మానవాళితో పాటు సమస్త జీవరాశి మనుగడకే ముప్పు ఏర్పడుతుంది.
ఓజోన్‌ రంద్రం
ఓజోన్‌ పొరకు రంద్రం పడటం అంటే ఆ పొరకు చిల్లు పడటం కాదు. ఓజోన్‌ పొరలోని కొంత ప్రాంతంలో 03 బిందువుల గాఢత తక్కువగా ఉంటుంది. ఇలా ఓజోన్‌ గాఢత తగ్గినప్పుడు అతి నీలలోహిత కిరణాలు భూమికి చేరే ప్రమాదం ఉంటుంది. ఈ గాఢత తగ్గిన ప్రాంతాన్నే ఓజోన్‌ పొరకు రంధ్రం పడిన ప్రాంతంగా పేర్కొంటారు. ఓజోన్‌ పొర సహజ మందాన్ని పోగొట్టుకున్నా, పూర్తిగా నాశనమైనా కూడా ఓజోన్‌ పొరకు చిల్లు పడిందని అంటారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఆధునిక యంత్రపరికరాలు అందుబాటులోకి వచ్చాయి. యంత్రపరికరాలు పనిచేయడానికి రసాయనాలు, ఇంధనం వాడుక కూడా పెరిగింది. అధునాతన యంత్రపరికాలలో వాడే కొన్ని రసాయనాలు ఓజోన్‌ పొరకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. దాదాపు ఐదుదశాబ్దాల కిందటే ఈ సంగతిని కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ రసాయనాలన్నింటినీ స్థూలంగా ‘ఓజోన్‌ డెప్లీటింగ్‌ సబ్‌స్టన్సెస్‌’ (ఓడీఎస్‌) అని పేరు పెట్టారు.
ఈ ఓడీఎస్‌ రసాయనాలు
స్ట్రాటోస్పియర్‌ను చేరుకున్నప్పుడే, అక్కడ ఓజోన్‌ పొరపై ప్రభావం చూపుతాయి. ఇవి ఓజోన్‌తో జరిపే రసాయనిక చర్యల వల్లనే సమస్య తలెత్తుతోంది. ఇవి ఓజోన్‌ అణువు నుంచి ఒక్కో ఆక్సిజన్‌ పరమాణువును కాజేస్తాయి. వీటి ప్రభావంతో ఓజోన్‌ తన సహజ స్వరూపాన్ని కోల్పోయిన ప్రదేశంలో ఖాళీ ఏర్పడి, సూర్యుడి అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమ్మీదకు దూసుకొస్తాయి. ఈ ప్రమాదం మొదటి సారిగా మూడు దశాబ్దాల క్రిందట అంటార్కిటికా ఎగువన ఓజోన్‌ పొరకు చిల్లు పడిందన్న వార్తతో ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. భవిష్యత్తుపై ఆందోళన పెరిగింది. అప్పుడు ఓజోన్‌ క్షీణతకు గల కారకాలపై దృష్టి పెట్టింది. ఓజోన్‌ పొరను ప్రధానంగా క్లోరిన్‌ వాయువు దారుణంగా దెబ్బతీస్తోంది. ఒక్కో క్లోరిన్‌ పరమాణువు ఓజోన్‌తో లక్షసార్లు చర్య జరిపి ఆక్సిజన్‌ను విడగొడుతోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రధానంగా క్లోరోఫ్లోరో కార్బన్లు(సీఎఫ్‌సీ), క్లోరోడైఫ్లోరో మీథేన్‌, ఓలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్లు ఓజోన్‌ను నాశనం చేస్తున్నాయి. నైట్రిక్‌ ఆక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, హెడ్రాక్సిల్‌, క్లోరిన్‌, బ్రోమిన్‌ వంటి వాటి వల్ల ఓజోన్‌ పొర దారుణంగా తరిగిపోతోంది. విపరీతమైన ఇంధన వినియోగం, ఎయిర్‌కండిషనర్లు, రిఫ్రిజరేటర్లలో వాడే వాయువులు విపరీతంగా వెలువడుతుండటం వల్ల ఓజోన్‌ పొరకు చిల్లుపడి, అది నానాటికీ విస్తరిస్తోంది. ప్లాస్టిక్‌, ఫోమ్‌, దోమల నాశనం కోసం వాడే కాయిల్స్‌, జెట్‌ బిళ్లల లాంటి వాటి వినియోగం వల్ల ఏర్పడే పొగ, స్ప్రేలు, పొలాల్లో చల్లుతున్న ఎరువులు, క్రిమి సంహారాలు, ఫ్రిజ్‌లు, కార్లపై వేస్తున్న కలర్స్‌, డిటర్జెంట్‌ల ఉత్పత్తుల తయారీ వల్ల ఏర్పడే క్లోరోఫ్లోరోకార్బన్లు ఓజోన్‌ పొరను ధ్వంసం చేస్తున్నాయి. భూమ్మీద అక్కడక్కడా చెలరేగే కార్చిచ్చులు కూడా ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్నాయి. వీటి వలన ఏర్పడే దుష్ప్రభావాలు సకల ప్రాణ కోటిపై పడతాయనే హెచ్చరికల నేపధ్యంలో ప్రపంచ దేశాలు 1987లో మాంట్రియల్‌లో సమావేశమై ఓజోన్‌ కు హాని కలిగించే వాయువులను నియంత్రించే విషయంలో ఒక ఒప్పందం చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ అంతర్జాతీయ ఒప్పందంలో క్లోరోఫ్లోరోకార్బన్‌లు (జఖీజలు), హాలోన్‌లు వంటి ఓజోన్‌ పొర క్షీణతకు దోహదపడే పదార్థాల ఉత్పత్తి, వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనినే మాంట్రియల్‌ ఒప్పందంగా పిలుస్తున్నారు. ఈ ప్రోటోకాల్‌ మీద మొత్తం 140 దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ విభాగంతో కలిసి ఓజోన్‌ సంరక్షణకు కృషి చేస్తామని ప్రతినబూనాయి. 2010 నాటికి ఓజోన్‌ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం 1994, డిసెంబర్‌ 19న 49/114 అనే తీర్మానం ద్వారా ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్‌ 16వ తేదీని ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినంగా నిర్వహించాలని ప్రకటించింది. ఈ రోజు 1987లో ఓజోన్‌ పొరను క్షీణింపజేసే పదార్థాలపై మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ సంతకం చేసిన జ్ఞాపకార్థంగా కొనసాగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఈ రోజున ఓ ధీమ్‌ తో ఓజోన్‌ పరిరక్షణ కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం (2023) ధీమ్‌గా ఓజోన్‌ పొరకు ఏర్పడే నష్టాన్ని పరిష్కరించడం, వాతావరణ మార్పులను తగ్గించడం అనే లక్ష్యాన్ని ప్రకటించింది. వాతావరణ మార్పులపై మాంట్రియల్‌ ఒప్పందం సానుకూల ఫలితాలను చూపుతుందని, దీనికారణంగా ఓజోన్‌ పునరుద్ధరణ దిశగా ముందుకు వెడుతుందని ఈ ధీమ్‌ ప్రధాన ఉద్దేశ్యంగా చెప్పవచ్చును.
దుష్ప్రభావాలు
ఓజోన్‌ క్షీణత కారణంగా అతి నీలలోహిత కిరణాలు భూ వాతావరణంలోకి రావడం ఎక్కువయితే, మొక్కలు నాశనమవడం, మహాసముద్ర కాంతి ప్రాంతంలో ప్లవకజాతులు తగ్గిపోవడం వంటి వివిధ జీవావరణ దుష్ప్రభావాలు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఓజోన్‌ పొరకు 1 శాతం విఘాతం ఏర్పడితే, భూమ్మీద అతి నీలలోహిత కిరణాల రేడియేషన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనితో భూమ్మీద నివసించే మనుషుల్లో వ్యాపించే క్యాన్సర్లు 2-5 శాతం మేరకు పెరుగుతాయి. క్యాటరాక్ట్‌ వంటి కంటి సమస్యలు గణనీయంగా పెరగడమే కాకుండా, మనుషుల్లోను, జంతువుల్లోను రోగనిరోధక శక్తి దారుణంగా దెబ్బతింటుంది. దీనివల్ల ప్రధానంగా మనుషులకు చర్మ క్యాన్సర్‌ సహా వివిధ క్యాన్సర్లు, పెరుగుతాయి. అకాల వార్ధక్యం ముంచుకొస్తుంది. వివిధ పంటలు దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ క్రియకు విఘాతం ఏర్పడుతుంది. గోధుమలు, వరి, బార్లీ వంటి తిండిగింజల పంటలకు, కూరగాయల పంటలకు తీరని నష్టం కలుగుతుంది. ఫలితంగా ఆహార లభ్యతకు విఘాతం ఏర్పడుతుంది. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల సముద్రాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు కూడా నశించి, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. పెంపుడు జంతువులు క్యాన్సర్లకు గురవుతాయి. మొత్తంగా చూసుకుంటే ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటే కలప, దుస్తులు, రబ్బరు వంటి పదార్థాలు త్వరగా నశిస్తాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల మనుషుల జీవితం దుర్భరంగా మారుతుంది. వీటి అన్నింటి కన్నా ప్రమాదకరమైన విపత్తు ఏమిటంటే ధ్రువప్రాంతాల్లో ఓజోన్‌ పొర పలచబడినట్లయితే సూర్యుని అతి నీలలోహిత కిరణాలు ఆ ప్రాంతానికి మరింత తీక్షణంగా తాకుతాయి. ఫలితంగా, అక్కడి మంచు శరవేగంగా కరిగిపోయి, సముద్రాల్లో నీటిమట్టం అమాంతం పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోతాయి. దీనివలన ఊహించని ప్రాణ నష్టం సంభవిస్తుంది.
ఓజోన్‌పొర గాయం మానుతోంది
ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని గత కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వలన, కోవిడ్‌తో ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం స్తంభించడం వలన కాలుష్యం చాలా వరకూ తగ్గిన నేపథ్యంలో ఓజోన్‌ పొరకు ఉన్న చిల్లులు ఎక్కువ శాతం మూసుకుపోయినట్టు ‘నాసా’ ఇటీవల తీసిన ఫొటోల్లో వెల్లడైంది. ఓ వైపు ఓజోన్‌ పొరకు పడిన రంద్రాల వలన ఏర్పడే విపత్తులపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉండగా మరొక పక్క రంధ్రాలు పడిన ఓజోన్‌ పొర క్రమేపీ పూడిక ఏర్పడుతుంది అనే శాస్త్రవేత్తల నివేదికలు ఎంతో ఊరట కలిగిస్తున్నాయి.
ప్రమాదకర రేడియేషన్‌ నుంచి భూమికి రక్షణ కల్పించే ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం నెమ్మదిగా పూడ్చుకుంటున్నదని తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. ఇది ఎంతో సంతోషించదగిన పరిణామం.
ముఖ్యంగా 2001-17 మధ్య కాలంలో ఓజోన్‌ పూడిక మొదలయ్యిందని శాస్త్రవేత్తల పరిశోధనలు తేల్చి చెప్పాయి. ఈ పరిశోధనల్లో గత కొంత కాలంగా రిడెక్షన్‌ ఆఫ్‌ ఓజోన్‌ లాస్‌ సాచురేషన్‌ 20 నుంచి 60 కి చేరినట్లు నిర్దారించారు.
ఓజోన్‌ పరిరక్షణ కోసం గత 35 సంవత్సరాల నుండి ప్రపంచ దేశాలు చేస్తున్న కృషి ఫలితంగా చిట్ట చివరకు ఓజోన్‌ రంద్రాల పూడిక ఆరంభం అయ్యింది. అయితే ఈ ఓజోన్‌ పొర గతం వలే సహజ స్ధితి పొందాలి అంటే ఓజోన్‌ పరిరక్షణ ఒప్పందాలను చిత్త శుద్దితో అమలు పరచగలగాలి. అలా కొనసాగిన నాడు ఓజోన్‌ 2066 నాటికి ఓజోన్‌ పూర్వ స్ధితికి చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేసింది. అయితే నేటికి కూడా గ్రీన్‌ హౌస్‌ వాయువుల విడుదల మాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు. రోజు రోజుకు గ్లోబల్‌ వార్మింగ్‌ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఓజోన్‌ కు జరిగే హానిని అరికట్టడం ప్రభుత్వాల ఒక్కటి బాధ్యతగా కాకుండా అంతర్జాతీయంగా ప్రతీ పౌరుడు దీనిని రక్షించే విషయంలో బాధ్యతగా వ్యవహరించగలిగిన నాడే మన మనుగడతో పాటు భావితరాల వారి మనుగడకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము.
చర్మ క్యాన్సర్‌ అవగాహన దినోత్సవం
ఓజోన్‌ పొర క్షీణించడం వలన భూమిపైకి ప్రసరించిన సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలలోని డీఎన్‌ఎను నాశనం చేస్తాయి. దానితో పాటు రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది.
ఇది కణాల అనియంత్రిత పెరుగుదల, క్యాన్సర్‌ అభివద్ధికి కారణమయ్యే ఉత్పరివర్తనాలకు దారితీస్తుంది. ఫలితంగా చర్మ క్యాన్సర్‌ (లింఫోమా) ప్రమాదం పెరుగుతుంది. దీని ప్రభావం వలన చర్మం రంగు మారడం, వైకల్యం, చర్మ గాయాలు, చిన్న మచ్చలు, చర్మపు పూతలు ఏర్పడతాయి. ఓజోన్‌ పొర రోజురోజుకు క్షీణిస్తూ ఉండటం వలన ఏటా ప్రపంచ వ్యాప్తంగా 20 నుండి 30లక్షల మంది చర్మ కేన్సర్‌ బారిన పడుతున్నట్లు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సర్వేలో వెల్లడైంది. చర్మ క్యాన్సర్‌ రోగ లక్షణాలను గుర్తించడానికి, రోగ నిర్ధారణలు చేయడానికి, చికిత్సపరంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి 2004లో ఈ అవగాహనా దినోత్సవం ప్రారంభించబడింది. ఈ దినోత్సవాన్ని ప్రారంభించినప్పటి నుండి, అర్జెంటీనాలో కళా ప్రదర్శనలు, ఫ్రాన్స్‌లో బైక్‌ ర్యాలీలు, న్యూజిలాండ్‌లో సెమినార్లు వంటి వివిధ కార్యక్రమాలతో ప్రపంచ చర్మ క్యాన్సర్‌ అవగాహనా దినోత్సవానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది అందరూ కలిసి రోగులు, వారి కుటుంబాలకు చర్మ క్యాన్సర్‌ సంకేతాలు, లక్షణాల గురించి తెలపాలి. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రజల జీవితాలను ఈ వ్యాధి ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతోంది. ప్రపంచంలోని 52 దేశాలలోని చర్మ క్యాన్సర్‌ రోగులకు సంబంధించిన 83 సంస్థలు ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి. ఓజోన్‌ ప్రభావం వల్ల సంభవించే చర్మ క్యాన్సర్‌ ప్రమాదం నుండి బయట పడాలంటే సాధ్యమైనంత వరకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీక్‌ అవర్స్‌ లో ఎక్కువ సేపు ఎండ తగలకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులను వాడాలి.
చర్మంపై ఏవైనా చిన్న చిన్న పుట్టుమచ్చలు లేదా మచ్చలు లేదా ఇతర మార్పులు ఉన్నాయేమో గుర్తించి ఆదిలోనే వైద్య సహాయం పొందగలిగితే ముప్పు నుండి బయట పడొచ్చు. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు సన్‌ గ్లాసెస్‌ ను ఉపయోగిస్తే అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను రక్షించుకోవడానికి సహాయపడతాయి. మన చర్మాన్ని హైడ్రేట్‌ గా , ఆరోగ్యంగా ఉంచగలిగితే చర్మ క్యాన్సర్‌ ముప్పు నుండి తేలికగా బయట పడొచ్చు. ఎందుకంటే బాగా హైడ్రేటెడ్‌గా ఉండే చర్మం దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. ఇది చర్మ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనికోసం వైద్యులు నీటిని ఎక్కువ తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు అనేవి కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపట్టిననాడు మంచి ఫలితాలు సాధించవచ్చు.
– రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578