మానవత్వం చాటిన ఆళ్ళపల్లి కానిస్టేబుల్

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
అత్యవసర పరిస్థితుల్లో ఓ మహిళకు ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లోని ఓ కానిస్టేబుల్ గురువారం తన రక్తాన్ని దానం చేసి మానవత్వాన్ని చాటి చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆళ్ళపల్లి మండలం నవతెలంగాణ రిపోర్టర్ మహమ్మద్ ఫయీమ్ బంధువుకి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రక్త పరీక్షలు నిర్వహించగా హెమోగ్లోబిన్ తక్కువగా ఉందని, ఆపరేషన్ నిమిత్తం “ఓ” పాజిటివ్ బ్లడ్ కావాలని వైద్యులు తెలిపారు. దాంతో రిపోర్టర్ వాట్సాప్ మాధ్యమంగా విషయం తెలపడంతో ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే వై.శ్రీనివాసరావు అనే కానిస్టేబుల్ స్పందించి, స్వీయ ఖర్చులతో ఖమ్మం బ్లడ్ బ్యాంక్ దగ్గరకు వచ్చి తన “ఓ” పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు. రక్తదానం అనంతరం కానిస్టేబుల్ మాట్లాడుతూ.. ఈరోజు నా పుట్టిన రోజని, ఈరోజున నాకు తెలియకుండా ఎంతో మంది ఆపదలో ఉంటారని, కనీసం నాకు తెలిసిన వారినైనా నా పుట్టిన రోజున ఆపదలో ఉంటే ఆదుకోవాలనే మంచి ఆలోచనతో రక్తదానం చేశానని చెప్పారు. కానిస్టేబుల్ చేసిన మంచి పనికి ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ తో పాటు తోటి పోలీసులు, పలువురు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసి, తన జన్మదినం రోజున ఆపదలో ఉన్న ఓ మహిళకు రక్తదానం చేసిన నేపథ్యంలో తనకు జన్మదిన శుభాకాంక్షలు వాట్సాప్ మాధ్యమంగా తెలుపుతూ అభినందనలు తెలిపారు.