మనిషి – మానవత, కేంద్రంగా – కవితా సృజన చేసిన – డాక్టర్ సి నారాయాణరెడ్డి అభ్యుదయం వైపు నిలబడ్డారు.
”ప్రళయానంతర సమయం – మొలకెత్తిన సృష్టివోలె… కొత్తదనం చిగుళ్ళగా మెత్తదనం – గుబుళ్ళుగా రూపొందిన నవజగత్తులో పొందిన సమతా సంగీతం – విని పరవశులై – ఏ తెంచిరి కర్షకులు – కార్మికులూ – నిర్వాసితులు – నిర్వణ్ణులు – మానవతా నిర్మాతలు – సౌజన్య ప్రదాతలు – నాగీతం – ప్రత్యణువున – నవభావం – ముద్రించెను” అంటారు సి.నా.రె. సైద్ధాంతిక విభేదాలతో కమ్యూనిస్టు పార్టీ నుండి నక్సలైట్లు వేరుపడిన సందర్భంలో సి.నా.రే. ఒక కవితలో ఇలా రాశారు.
తమ్ముని గొంతులో శ్రుతి కలపలేకున్నా! – దమ్మును మాత్రం మెచ్చుకుంటున్నాను.
మనుషుల మీద నమ్మకం పోయిన వాడు – మట్టిని గట్టును పట్టక ఏం చేస్తాడు?
ఆలోచన – ఆలాపన నాది – ఆక్రోశం ఉక్రోషం – వాడిది.
సాహిత్య అకాడమి ఆవార్డు పొందిన ”మంటలూ – మానవుడు” కవితా సంపుటిలోనిదే పైకవిత…
1991 రష్యా ‘కమ్యూనిజాన్ని’ వదలుకొన్న సందర్భంలో…
”ఎవడురా అన్నది కమ్యూనిజం చచ్చిపోయిందని –
ఎవడురా కూసింది ఎర్రజెండా నేల కొరిగిందని
తూర్పున సూర్యుడు పొడిచినంత కాలం –
మనిషి రక్తం ఉన్నంత వరకూ అజేయం విప్లవం –
దాన్ని ఆపడం ఎవడబ్బతరం.” పై మంచు కశిగినా – పర్వతం కరగదు అన్న ధీరుడు సి.నా.రె.
వందేమాతర గీతం వరస మారుతున్నదీ… కదిలింది అరుణసైన్యం – చెదిరిందీ చీకటి రాజ్యం – లాంటి గీతాలు… స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయి. గద్దర్‌పై గుండ్లు వర్షం కురిపించిన సందర్భంలో 1997లో సి.నా.రె. ఇలా స్పందించారు…. పాటను కూల్చేస్తారా హంతకులారా? ప్రగతిని చంపేస్తారా వంచకులారా! పాటంటే ఏమిటి – ఎవరి మెప్పుకోసం – వల్లించే దండకం కాదు – అణచబడ్డ జనం కంఠం – నినదించే రక్తఘోష – నిజం తేలేవరకు నిందితులు పాలకులే!” అన్న ఖలేజా ఆయనది.
”ధేనుహత్య నిషేధించాలనీ – అహింసా ప్రతులు – మానవ హత్యకు పొగరేపుతుంటే… లోకాన్ని సన్యసించిన సాధుపుంగవులు – లోక్‌సభ గోడలకెగబ్రాకుతుంటే… ఎంత హాయిగా నిదురపోయింది చట్టం.” అన్న కవిత – నేటి మోడీ పాలనకు రిలవెన్స్‌గా ఉందికదా! 1971 కవులపై పీడీ చట్టం పెట్టినప్పుడు – ఝంఝం కవితా సంకలనం నిషేధించినప్పుడు – కవుల ఇళ్ళపై దాడులు జరిగినప్పుడు… తీవ్రంగా స్పందించారు సినారె. ‘గోవా’ విముక్తి ఉద్యమాన్ని సమర్థించారు. ఇరాన్ – జోర్డాన్ పరిణామాల్ని కవిత్వీకరించారు. బాబ్రీ విద్వంసంలోనూ కవిత రాసారు. శ్రీలంక కమ్యూనిస్ట్ నేత ‘గణపతి’ ఉరిశిక్ష ఖండిస్తూ కవిత రాసారు. గ్లోబలైజేషన్ కాదు – డాలరైజేషన్ అంటూ ప్రపంచీకరణ నిరసిస్తూ మాట్లాడేవారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో క్విట్ స్కూల్ ఉద్యమంలో పాల్గొనడం – పోలీసు చర్యపై కవిత రాయడం ఆయనలోని ప్రగతిశీలతకు తార్కాణాలు… 150 ఎకరాల భూస్వామి కుటుంబం ఆయనది. పేదలకు భూమి పంచారు. తన ఎంపి లాడ్స్ నిధులతో గ్రంథాలయాన్ని సముద్ధరణకు ఖర్చు చేసారు. భార్య సుశీలపేరుతో రూ.50వేలు నగదుతో పురస్కారం ఏటా ఇచ్చేవారు. ఎందరో కవుల్ని ప్రోత్సహించారు. పీఠికలో రాసారు. సభల్లో పాల్గొన్నారు. హిందీ – రష్యన్ – ప్రెంచి – జపనీస్ – ఇటాలియన్ – అరబిక్ భాసల్లో ఆయన రచనలు అనువాదాలైనాయి. అభ్యుదయ – ప్రగతిశీల మానవతా వాద కవి 90కి పైగా పుస్తకాలు రాసారు. జూన్ 2017లో అస్తమించారు. (నేడు డాక్టర్ సి.నా.రె. జయంతి)
– తంగిరాల చక్రవర్తి, సెల్: 9393804472