– నెల్లూరు నరసింహారావు
గాజాపై ఎడతెగకుండా సాగుతున్న ఇజ్రాయిలీ బాంబు దాడులవల్ల అక్కడ నివసిస్తున్న 23 లక్షల పాలస్తీనా వాసుల జీవనం నరకప్రాయంగా మారింది. అధికారికంగా ప్రకటించిన 7000 మరణాలకు అదనంగా 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అక్కడి ప్రజలకు ఆహారం, తాగు నీరు, చమురు అందు బాటులో లేకుండా పోయాయి. ఇజ్రాయిల్ ‘ఆకలిని ఆయుధం’గా వాడుతోందని ప్రపంచ స్థాయి చారిటీ సంస్థ ఆక్స్ ఫాం విమర్శించింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి కేవలం 2శాతం ఆహార సరఫరా మాత్రమే గాజాను చేరింది.
చమురు కొరత వల్ల, ఇజ్రాయిలీ బాంబింగ్ కారణంగా చెడిపోయిన రోడ్లవల్ల స్థానిక సర ఫరాలను కూడా ప్రజలకందించలేకపోయారు. విద్యుచ్చక్తి లేకపోవటంతో రిఫ్రిజి రేటర్లు పని చేయనందున ఆహార పదార్థాలను నిల్వచేయటం కూడా సాధ్యపడటం లేదు. ఇజ్రాయిలీ బాంబింగ్ కారణంగా బేకరీలు, సూపర్ మార్కెట్లు మూతపడ్డాయి. దానితో ఆహారం దొరకటం మరింత కష్టమైపోతోంది. గాజాలో ఒక్కో వ్యక్తికి కేవలం మూడు లీటర్ల నీరు మాత్రమే లభ్యమౌతోంది. మనవ సంక్షోభంలో కూడా ప్రతి మనిషికి 15లీటర్ల నీరు అవసరం ఉంటుందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అంటే గాజా ప్రజలకు అవసరమైన నీటిలో కేవలం 5వ వంతు మాత్రమే అందుతోంది. రాఫా సరిహద్దు నుంచి సరఫరా అవుతున్న వంట సామాగ్రిని నీటి కొరత ఏర్పడినందున ప్రజలు ఉపయోగించుకోలేక పోతున్నారు. ఆకలిని ఆయుధంగా మార్చటాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్థించ కూడదని, మానవత్వం మంటగలుస్తుంటే ప్రపంచ నాయకులు చూస్తూ కూర్చోకూడదని ఆక్స్ ఫాం మధ్యప్రాచ్య రీజినల్ డైరెక్టర్ శాల్లీ అబీ ఖలీల్ అన్నారు.
ప్రపంచ నాయకుల్లో ఇజ్రాయిలీ మారణకాండను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పూర్తిగా సమర్థిస్తున్నాడు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌లో కలిసి మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలు తమ ప్రతిఘటనకు మూల్యం చెల్లిస్తున్నారని బైడెన్ అన్నాడు. అమెరికా దాని మిత్ర సామ్రాజ్యవాద దేశాలు ఇజ్రాయిల్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. ఆ ప్రాంతంలో అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధపడుతున్నాయి. అమెరికా ఇప్పటికే రెండు విమాన వాహక యుద్ధ నౌకలను ఇజ్రాయిల్‌కు మద్దతుగా పంపింది. ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, కువాయిట్‌లలో తిష్టవేసిన అమెరికా సైన్యాల రక్షణకు 11 క్షిపణి రక్షణ వ్యవస్థలను మోహరించటం జరిగింది. ఇరాన్‌తో యుద్ధం చెయ్యాలనే లక్ష్యంతో అమెరికా ఇదంతా చేస్తోంది. సామ్రాజ్యవాద దేశాలు ఇజ్రాయిల్‌కి ఇచ్చిన అనైతిక స్వేచ్ఛ వల్ల పాలస్తీనాలో ఊహాతీత మానవ సంక్షోభం ఏర్పడింది. ఇందుకు ఉదాహరణగా ఇప్పటివరకు 24మంది జర్నలిస్టులు హతులయ్యారు. నుసైరత్ శరణార్థుల క్యాంపుపై ఇజ్రాయిల్ చేసిన వైమానిక బాంబు దాడిలో గాజా అల్ జజీరా బ్యూరో ఛీఫ్ వాయెల్ దాదౌ తన భార్యను, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నాడు. రాఫాలో ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక పాఠశాలలో తలదాచుకున్న వారికి సమీపంలో బాంబు పేలటం వల్ల విపరీతమైన నష్టం వాటిల్లింది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వ్యవస్థ అంతా పతనం అవటం వల్ల క్షతగాత్రులకు కనీస వైద్య సౌకర్యాలు అందటం లేదు. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ హాస్పిటల్ ఒక సామూహిక సమాధి అవుతుందని కరెంటు సరఫరాకి అవసరమైన చమురు అందుబాటులో లేకుండా పోయిన స్థితిలో అక్కడ పని చేస్తున్న డాక్టర్ హుస్సుమ్ అల సాఫియా అన్నారు. వందలాది క్షతగాత్రులతో, చనిపోయిన పిల్లలతో హాస్పిటల్ నిండిపోయిందని, పరిస్థితి హ్రుదయవిదారకంగా ఉందని ఆమె అన్నారు. ఇటువంటి పరిస్థితి గాజాలోని ప్రతి హాస్పిటల్ ఎదుర్కొంటోంది.