– రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే దేశానికి వినాశనమే..
– ఓంకార్ వర్ధంతి సభలో వామపక్ష నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మనువాదమంటేనే విచ్ఛిన్నం. దాని భావాజాలాన్ని ఓడించకపోతే..దేశ భవిష్యత్ అంధకారమే’ అని వామపక్ష నేతలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయంలో ఓంకార్ 15వ వర్థంతి సందర్భంగా ‘మనువాదం-రాజ్యాంగం’ అంశంపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదెగోని రవి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, ఎంసీపీఐ(యూ) పొలిట్‌బ్యూరో సభ్యులు వల్లపు ఉపేందర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి మురహరి, ఆర్‌ఎస్‌పీ కార్యదర్శి జానకిరాములు, సీపీఐఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాయల చంద్రశేఖర్, ఎన్‌డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె గోవర్దన్, బీఎల్‌ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్, మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సుకన్య తదితరులు మాట్లాడారు. సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ మనువాదమంటే కుల వ్యవస్థను పెంచి పోషించటమేనని చెప్పారు. అసమానతలను యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నదన్నారు. ధర్మం నాలుగుపాదాల మీద నడవటమంటే బ్రహ్మణీయ భావాజాలాన్ని అమలు చేయటమేనన్నారు. ఏ కులం ఏం చేయాల్నో మనుధర్మ శాస్త్రం స్పష్టం చేసిందనీ, దాన్ని పాటించటమే మన విధి అని చెబుతున్నారని గుర్తు చేశారు. దేశం సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ అనాగరిక ఆలోచనలు చేయటమేంటని ప్రశ్నించారు. మనువాద ఆలోచనలకు అడ్డంకిగా భారత రాజ్యాంగం ఉందనీ, దాన్ని ధ్వంసం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ చెబుతున్నదని తెలిపారు. నియంతృత్వ, ఫాసిస్టు ఆలోచనలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపెందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని విమర్శించారు. దేశంలో మతతత్వాన్ని, మతోద్మాదాన్ని పెంచి పోషిస్తూ మైనార్టీ మతాలపై దాడులకు పూనుకుంటున్నదని వాపోయారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూలదోస్తున్నదని చెప్పారు. వీటిని ఎదుర్కోవాలంటే వామపక్ష ఐక్య ఉద్యమాలే శరణ్యమన్నారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..మద్దికాయల ఓంకార్ రాజ్యాంగ హక్కులను రక్షించడానికి చట్టసభల్లో తన గళాన్ని విడిపించే వారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంసీపీయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, వి తుకారాం నాయక్, మంద రవి, పెద్దారపు రమేష్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.