కాంగ్రెస్‌ పాలనకు వంద రోజులు

Hundred days of Congress rule– అనుమానాలు.. అవహేళనలను అధిగమించి ముందుకు
– శ్వేతపత్రాలు..విచారణ కమిటీలతో సీఎం దూకుడు
– ఎన్నికల సభల్లో తనదైన శైలిలో వాగ్బాణాలు
– ఆరు గ్యారెంటీల్లో ఐదింటికి శ్రీకారం
– మరికొన్నింటిపై ప్రకటనలు
– అప్పులు..ఆర్థిక పరిమితులున్నా అమలు చేసి తీరతామంటూ భరోసా
– కొత్త ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల కోటి ఆశలు
– అనుమానాలు.. అవహేళనలను అధిగమించి ‘సెంచరీ’
‘ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం.. కొద్ది రోజులు, వారాల్లోనే అది పడిపోవటం ఖాయం…’ అంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు చెందిన నేతల బెదిరింపులు ఒకవైపు… ‘కాంగ్రెస్‌ సర్కార్‌ అనేది తుమ్మితే ఊడిపోయే ముక్కు… ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకదా..? ఇక్కడ కూడా అదే జరిగి తీరుతుంది…’ అంటూ కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ రాష్ట్ర నేతల హెచ్చరికలు మరోవైపు… ఇలాంటి అవమానాలు, అవహేళనలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు ‘సెంచరీ’ పూర్తి చేసుకుంది. పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండి, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ పాలనకు శుక్రవారంతో వంద రోజులు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ విశ్లేషణ..
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేసీఆర్‌ హయాంలో పదేండ్లపాటు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఫరవాలేదని అనిపించినప్పటికీ… ‘అహంకారాన్ని’ ఎక్కువ కాలం భరించలేమంటూ రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. నిరంకుశ నైజాంనే నేలకూల్చిన ఈ గడ్డ మీద ‘నియంతృత్వానికి’ తావు లేదంటూ బీఆర్‌ఎస్‌ను తిరస్కరించిన జనం… కాంగ్రెస్‌కు పట్టంగట్టారు. ఇదే సమయంలో ఆరు గ్యారెంటీలు, ఉద్యోగ నియామకాలు, రైతు భరోసా తదిరాంశాలతో ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌, కోమటిరెడ్డి తదితర సీనియర్లు ఉన్న కాంగ్రెస్‌లో… సీఎం ఎవరవుతారనే ఉత్కంఠతకు తెరదించుతూ ఆ పార్టీ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌కు అవకాశమిచ్చింది.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో గతేడాది డిసెంబరు 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, పాలనా పగ్గాలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి… ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఆయన సారధ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే… మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటితోపాటు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ సౌకర్యాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు అంకురార్పణ చేసింది. తద్వారా ఆరు గ్యారెంటీల పరిధిలో ఉన్న 13 అంశాలకు సంబంధించి ఐదింటిని పూర్తి చేశామని ప్రకటించింది. మిగతా 8 అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, నిధులు కేటాయించాల్సి ఉంది. వాటిని కూడా అమలు చేయటం ద్వారా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం చూరగొనాలి. నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి తమ ఆశలు అడియాశలైన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను గద్దె దించి, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ‘ఆపన్న హస్తం’ అందించిన జనం… రేవంత్‌ సర్కార్‌ తమకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తుందనే విశ్వాసంతోనే ఉన్నారు. ఆ విశ్వాసాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ కాపాడుకోవాలి. అయితే ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల కొరత ప్రధాన అవరోధంగా ఉందంటూ ప్రభుత్వ పెద్దలు ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత బీఆర్‌ఎస్‌ హయాంలో లెక్కకు మిక్కిలిగా చేసిన అప్పులపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని ప్రకటించిన సంగతి విదితమే. కానీ రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితి అనేవి ఎన్నికలకు ముందు కూడా మనకు తెలిసిన విషయాలేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల వాటి సాకుతో గ్యారెంటీల అమలుపై వెనకడుగేస్తే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అప్పులు, ఆర్థిక పరిస్థితులు, పరిమితులెన్ని ఉన్నా… ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిందేనని ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన తరుణంలో ప్రజలు, ప్రతిపక్షాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని రేవంత్‌ ప్రభుత్వం ముందుకెళుతుందని ఆశిద్దాం.
వంద రోజుల్లో కాంగ్రెస్‌ సర్కారు చేపట్టిన చర్యలు…
– సీఎంగా రేవంత్‌ ప్రమాణం చేసిన రోజున్నే (డిసెంబరు 7, 2023) ప్రగతి భవన్‌ ముందున్న కంచె తొలగింపు, ఆ భవన్‌కు ప్రజా భవన్‌గా నామకరణం, అక్కడ మహాత్మా జ్యోతిబాఫూలే వేదికగా ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం. తద్వారా వారంలో రెండు రోజులపాటు ప్రజలు తమ సమస్యలను అధికారులకు నేరుగా చెప్పుకునే అవకాశం
– గతేడాది డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం. ఆ సందర్భంగా గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరణ
– అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పన. ఈ పథకం ద్వారా ఇప్పటికే దాదాపు 23 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని వెల్లడి
– ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు
– మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలు
– అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే గృహ జ్యోతి పథకం ప్రారంభం.
– ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తామంటూ సీఎం ప్రకటన. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం.
– అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత. వీరిలో 53 శాతం మంది పురుషులు, 47 శాతం మంది మహిళలున్నారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, టీఎస్‌పీఎస్సీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ద్వారా చేపట్టిన నియామకాలు. అదనంగా సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలు
– గత ప్రభుత్వ హయాంలోని రిజర్వేషన్ల వివాదాలు, ఫలితాల నిలిపివేతలు, కోర్టు కేసులన్నింటినీ ఒక్కటొక్కటిగా అధిగమించిన సర్కార్‌, ఆ క్రమంలో టీఎస్‌పీఎస్సీ బోర్డు ప్రక్షాళన. గత పాలకవర్గాన్ని తప్పించి కొత్త చైర్మెన్‌ను, బోర్డు సభ్యుల నియామకం. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు
– రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. విద్యుత్‌ విభాగంలో జరిగిన అవినీతి అక్రమాలు, అవకతవకలపై అసెంబ్లీలో చర్చ. సాగునీటి పారుదల విభాగంపై శ్వేతపత్రం విడుదల
– కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్‌ విచారణను చేపట్టటంతోపాటు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలసంఘానికి లేఖ రాసిన సర్కార్‌. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పిల్లర్లను పరిశీలించిన ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం
– సీఎం రేవంత్‌ విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర రక్షణ శాఖ, కంటోన్మెంట్‌ ఏరియాలో రక్షణ శాఖ భూములపై కారిడార్ల నిర్మాణానికి ఆమోదం. మెహిదీపట్నంలో స్కై వాక్‌ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న రక్షణ భూముల అప్పగింతకు గ్రీన్‌ సిగల్‌
– హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌ రహదారిపై రూ.2,232 కోట్లతో భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌కు సీఎం శంకుస్థాపన
– జాతీయ రహదారి 44 (హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు)పై రూ.1,580 కోట్లతో డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ నిర్మాణానికి పునాది రాయి వేసిన సీఎం రేవంత్‌
– హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌-2 విస్తరణకు ఫరూక్‌ నగర్‌ వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన. మొత్తం 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గం నిర్మాణానికి గ్రీన్‌ సిగల్‌
– రూ.2,700 కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐల్లో అడ్వాన్స్‌డ్‌ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం. టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
– దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించటంలో కొత్త రికార్డు సృష్టించిన తెలంగాణ. దాదాపు రూ.40,232 కోట్ల పెట్టుబడులు, 30 వేల ఉద్యోగాల కల్పనకు భరోసా.
– 300 ఎకరాల్లో జీనోమ్‌ వ్యాలీ ఫేజ్‌-2ను త్వరలోనే ప్రారంభిస్తామని ‘బయో ఆసియా-2024’ సదస్సులో ప్రకటించిన సీఎం రేవంత్‌. రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పిస్తామని వెల్లడి. వికారాబాద్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల నిర్మాణానికి యోచన.
– ధరణి సమస్యల పరిష్కారానికి అయిదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ
– హైదరాబాద్‌లో ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మూసీ పునరుజ్జీవం, పరివాహక ప్రాంతాల అభివద్ధి ప్రాజెక్టు. డిజైన్లు, ప్రతిపాదనలకు రంగం సిద్ధం
– హైదరాబాద్‌లో డ్రగ్స్‌ చలామణిపై ఉక్కుపాదం. నార్కోటిక్స్‌ నియంత్రణ. టీ.ఎస్‌.నాబ్‌ను గ్రే హాండ్స్‌, ఆక్టోపస్‌ తరహాలో పటిష్టం చేసేందుకు నిర్ణయం
– సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా. 43 వేల మంది కార్మికులకు వర్తించేలా రూపకల్పన
– బంజారాహిల్స్‌లో బాబూ జగ్జీవన్‌రామ్‌ భవన్‌ ప్రారంభోత్సవం
– ఎల్బీనగర్‌ సమీపంలోని బైరామల్‌ గూడా ఫ్లై ఓవర్‌ ప్రారంభం
– ఉప్పల్‌ సమీపంలో నల్లచెరువు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం
– హైకోర్టు నూతన భవనానికి వందెకరాల స్థలం కేటాయింపు
– పారిశ్రామిక అభివద్ధికి ‘మెగా మాస్టర్‌ ప్లాన్‌ 2050’
– ఇండియన్‌ నేవీ రాడార్‌ స్టేషన్‌, వికారాబాద్‌ ఫారెస్ట్‌ ఏరియాలో దేశంలో రెండో విఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం
– ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున నియోజకవర్గాల అభివద్ధికి రూ.1,190 కోట్ల కేటాయింపు
– నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. మెడికల్‌, నర్సింగ్‌, ఫిజియోథెరపీ కళాశాలకు భూమిపూజ
– గద్దర్‌ విగ్రహం ఏర్పాటు. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డ్‌
– మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటు శంకుస్థాపన
– హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ దుబారు మోడల్‌ టూరిజం స్పాట్‌ ఏర్పాటుకు నిర్ణయం
– ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల పారితోషకం
– స్వయం సహాయక సంఘాలకు చేయూతగా కొత్త కార్యక్రమాలు
– ఉర్దూ అకాడమీ ఏర్పాటు
– ఎన్‌ఆర్‌ఎస్సీతో స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ ఒప్పందం, డ్రోన్‌ పైలెట్లకు శిక్షణ
– రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిర్ణయం
– వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లకు ఉండే టీఎస్‌ను టీజీగా మార్పు, వంద కొత్త బస్సుల ప్రారంభం, రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ
ఉద్యోగ నియామకాలతోపాటు జాబ్‌ క్యాలెండర్‌ అమలుకు ప్రయత్నాలు. గ్రూప్‌-1, గ్రూప్‌-2,గ్రూప్‌-3కు సంబంధించి డైరెక్టు రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించిన సర్కార్‌. గత ప్రభుత్వ హయాంలో పరీక్షల నిర్వహణ వైఫల్యాలతో గ్రూప్‌-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. కొత్త ప్రభుత్వం అప్పటి పరీక్షను రద్దు చేసి, 563 పోస్టులతో గ్రూప్‌ -1 కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. మెగా డీఎస్సీని ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసిన సర్కార్‌

అవుటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ. గొర్రెల పంపిణీ పథకం, చేప పిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  విచారణకు ఆదేశం. ధరణి పోర్టల్‌ ఏజెన్సీపై విచారణ. మిషన్‌ భగీరథ విలేజ్‌ లెవల్‌ ఇంట్రా పైపులైన్లు, గ్రామాల్లో పనులపై విచారణ. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ  అధికారుల పాత్రపై విచారణ. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో రూ. వందల కోట్లకుపైగా వ్యాట్‌ ఎగవేత. దీనిపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. రైతుల సమస్యలను నేరుగా  పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం అనుసంధానం. తొలి విడతగా 110 అసెంబ్లీ  నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ యూనిట్ల ఏర్పాటు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం సహకారంతో రూ.97 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన  వ్యవసాయ శాఖ.