ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు వ్యక్తి జ్ఞానంతో పాటు చాలా రకాలైన జీవన నైపుణ్యాలను పరీక్షించి అందులో సఫలమైన వారికి మాత్రమే నియామక పత్రాలను అందజేస్తున్నారు. జీవన నైపుణ్యాలు లేనివారు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు నేర్చుకోడానికి వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. ఇటువంటి శిక్షణా కేంద్రాలు పుట్టగొడగుల్లా పుట్టుకు రావడమే గాక కొన్ని శిక్షణా కేంద్రాలలో ఉపన్యాసం ఎక్కువ… ఉపయోగం తక్కువ చందాన్న బోధిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం మీద ఆంగ్లంలో ఖరీదైన పుస్తకాలు మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. మన దురదృష్టం ఏమిటంటే ఎక్కువ ధర కలిగిన పుస్తకాలు మంచి పుస్తకాలని నమ్ముతున్నాం. కానీ మన తెలుగు సాహిత్యంలో వందల సంవత్సరాలకు పూర్వమే ఈ వ్యక్తిత్వ వికాసాన్ని తెలియజేసే పుస్తకాలు వున్నాయి. వీటి వెల తక్కువ… జ్ఞానం ఎక్కువ! అటువంటి పుస్తకాలే మన శతకాలు.
ఒక వ్యక్తి వ్యక్తిత్వవికాసంలో నీతి, నిజాయితీ, నైతిక విలువల ప్రభావం ఎక్కువే..! నీతి, ధర్మం, సహనం, సజ్జనత్వం, ఓర్మి, సత్యం, స్నేహం వంటి మంచి గుణాల వల్ల కలిగే ప్రయోజనాలు. సంఘంలో మనుషులు ఎలా నడుచుకోవాలో, ఎలా నడిస్తే తనకూ, ఇతరులకూ కూడా మేలు జరుగుతుందో వంటి నైతిక విలువలు పాటించడం వల్ల మనకు తెలుస్తుంది. మన శతకకవులు చక్కని నీతి శతకాలు అందించారు. అందులో ఎన్నో నీతులను తెలిపారు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో బోధించాడు. సుమతీ శతకకర్త, భర్తహరి, ధూర్జటి వంటి పూర్వ కవులు సైతం మనకు ఎన్నో నీతివాక్యాలు చెప్పారు. సామాజిక చైతన్యం, కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు గురించి సామాన్య నీతులను సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కతులతో కల్పించి, నవ్వించి ఎదుటివారి లోపాలను, తన లోపాలను, గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని వేమన ప్రదర్శించాడు. సామాన్యాలు మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు. ‘ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు’ అనే విషయాన్ని మారద వెంకయ్య అమృత సముద్రంలో రెట్టవేసే కాకితో పోల్చాడు. అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణం చేస్తూ ఆ సముద్రంలో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రం చేత, ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు అని చెప్పారు. వరదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నడం, కఱవు వచ్చినప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, రహస్యాన్ని ఇతరులకు చెప్పడం, పిరికి వాడికి సేనా నాయకత్వమును ఇవ్వడం వంటివి ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి పేర్కొన్నాడు.
జాతకాలు చెప్పడం, అబద్దాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ లేనివి పలకడం, మొదలగు వాటిని ఇతరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి పేర్కొన్నాడు. లోతయిన భావాలను వాడుక భాషలోని పదాలతో చెప్పి సామాన్య మానవుని కూడా జ్ఞానిని చేయగలిగినవి ఈ శతకాలు. జీవితంలో పరిపూర్ణత సాధించి మనిషి ‘మనీషి’గా ఎదగడం ఎలానో ఇవి తెలుపుతాయి.
చిన్న పిల్లలకు మాటలు వచ్చినప్పటి నుండి శతకాలను నేర్పిస్తే స్పష్టమైన ఉచ్ఛారణ అలవాటు అవుతుంది. వీటిని చదవడం వలన జీవితంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఏది మంచి? ఏది చెడు? వంటి విషయాలు నేర్చుకోవచ్చు. శతకాలు చదవడం వలన నీతి సూత్రాలు, విలువలు, మానవత్వం, మంచి, మర్యాద, పెద్దలను గౌరవించడం వంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఆత్మవిశ్వాసం కోల్పోతున్న అనేక సందర్భాలలో మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
శతకాలు చదవడం వల్ల ఆనాటి సమాజం ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. పెద్దలకు నిత్య జీవితంలో వచ్చే చిన్నచిన్న కష్టాలను దాటే సలహాలు ఉంటాయి. స్థితప్రజ్ఞత లేని మనసు అదుపుతప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటువంటి సందర్భాలలో నేర్చుకున్న శతకాల సారాంశం మన మనసును అదుపులో పెడుతుంది. వేమన, సుమతీ శతకాలు ఇప్పటి తరంలో ఎంత మందికి తెలుసో తెలియదు గాని, ఇంతకు ముందరి తరానికి మాత్రం ఇవి సుపరిచాతాలే…!
– జనక మోహనరావు దుంగ,
8247045230