ఆకలి

నా వెన్నుపై ఇంత మదపు భారముందని
నమ్మడం చాలా కష్టం
చేపలవాడు అన్నాడు : ఆమె కావాలా, నిర్లక్ష్యంగా-
తన వలలనీ, నరాలనీ కూడదీసుకుంటూ.
అలాగే అతడి మాటలు..
తనకు తాను ఎదుర్కొంటున్న సందర్భానికి
పవిత్రతను చేకూర్చేందుకు యత్నిస్తున్నాయి
తెల్లని ఎముక అతడి కళ్లలో గిర్రున తిరగడం చూశా
విశాలమైన ఇసుక తిన్నెల మీదుగా అతడిని అనుసరించా
నా మనసు మాంసపు జోలెలో ఓలలాడుతోంది
బహుశా, నేను నివసించిన ఇంట్లో ఆశను తగులబెట్టేయొచ్చు.
నిశ్శబ్దం నా భుజాలను చుట్టుకుందిబీ
నురుగు వద్ద శరీరం పంజాలా వంగింది.
సముద్రం నుంచి కేవలం అతడి పాత వలలే బయటపడ్డాయి
మినుకుమినుకుమనే చీకటిలో
అతడి గుడిసె గాయంలా తెరుచుకుంది
కొన్ని పగళ్లు, రాత్రుల ముందటి గాలిని నేనే
తాటాకులు నా చర్మానికి గీరుకున్నాయి
గుడిసె లోపల నూనె దీపం వేళ్లుసాచి
గంటల తరబడి గోడలను కమ్ముకుంటోంది
అంటుకున్న మసి నా మెదడులోని డొల్లతనాన్ని అధిగమిస్తోంది
అతడు చెప్పడం విన్నా : నా కూతురు, కేవలం పదిహేనేళ్లే.
దాన్ని అనుభవించండి, నేను కాసేపట్లో మళ్లీ వస్తా.
మీ బస్సు తొమ్మిదిగంటలకు బయల్దేరుతుంది
నాపై ఆకాశం విరిగిపడింది, ఒక తండ్రి అసహాయపు కుతంత్రం కూడా.
పొడవైన, సన్నని ఆమె వయసు రబ్బర్లా చల్లగా వుంది
ఆమె పుల్లల్లాంటి తన కాళ్లను వెడల్పు చేసింది
నేను అక్కడ ఆకలిని గ్రహించాను,
మరోవైపు చేప జారి, లోపల తిరుగుతోంది.
ఇంగ్లీషు : జయంత మహాపాత్ర
తెలుగు : దేశరాజు