ఆకలి..

ఆకలి..నేల మీద జీవం పుట్టింది
జీవానికి ఆకలి పుట్టింది ఆకలికి అన్నం పుట్టింది
భవంతుల్లో ఆకలికి ప్రవేశం లేదు
గేటు దగ్గర పడిగాపులు పడాల్సిందే
దైన్యపు చూపులు గేటువద్దే నిల్చుంటే
కడుపుల్లో ఆకలి ఆశగా లోనికి చూస్తుంటుంది
చపలచిత్తమైన నాలుక మాత్రం లోపలే తిష్టేసుకుని రోజుకో విందు
రంగూ రుచీ ఆస్వాదిస్తూ గేటు దాటలేని
ఆకలిని చూసి వికటాట్టహసం చేస్తుంది
గుడిసెల్లో ఆకలి పట్టాభిషిక్తమై అడ్డూ ఆపూ
లేకుండా తరతరాలు పాలిస్తుంది.. తీరని ఆకలి రౌరవ నరకపు వాకిలై
పాకుడు రాళ్లమీద పరుగులు పెట్టిస్తుంది మూడక్షరాల ఆకలి..
ఈ భూమ్మీద రాజకీయ అధికారం
మరే అధికారమైనా ప్రసాదించే స్వర్గపు వాకిలి!
ఆకలి తీరిపోతే ఎక్కడా ఏ పనీ జరగదు..! చీమ కూడా కదలదు
అధికారం లేదూ ఆవకాయా లేదు అంతా తలకిందులు..
రాజు బంటవుతాడు బంటు రాజవుతాడు
అసలు నాయకులు చెప్పే హామీలు
అభివద్ధి అవసరమే లేదు అందరూ నాయకులే..
పల్లకీ ఎక్కేవాళ్ళు పల్లకీ మోసేవాళ్ళుగా
సమాజాన్ని రెండుగా విడగొట్టిన స్వార్ధానికి ఆకలేగా ఆఖరి అస్త్రం!
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253