భారత్‌లో ఆకలి కేకలు !

Hunger in India!– అంతర్జాతీయ క్షుద్బాధ సూచీలో 111 స్థానం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్షుద్భాధ సూచీ (జిహెచ్‌ఐ)-2023లో మొత్తం 125 దేశాలకు గానూ భారత్‌ 111వ స్థానంలో వుంది. ఆకలిపై సాగిన పోరాటంలో 2015 నుండి పురోగతి స్తంభించిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఆఫ్ఘనిస్తాన్‌, హైతి, 12 సబ్‌ సహారా దేశాలు భారత్‌ కంటే అధ్వాన్నమైన స్థితిలో వున్నాయి. వంద పాయింట్ల స్కేలులో జీరో అంటే అస్సలు ఆకలి బాధలు లేకపోవడమని అర్ధం. వంద అంటే అత్యంత అధ్వాన్నమైన పరిస్థితి. ఈ స్కేలులో భారత్‌ 28.7 స్కోర్‌ వద్ద వుంది. దాని ప్రాతిపదికన భారత్‌ ర్యాంక్‌ 111గా వుంది. దీని ప్రకారం భారత్‌లో ఆకలి బాధలు చాలా తీవ్రంగా వున్నాయని వెల్లడవుతోంది. పోషకాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, బరువు తగ్గుదల, బాలల్లో మరణాలు ఈ నాలుగు అంశాలతో కూడిన ఫార్ములా ఆధారంగా జిహెచ్‌ఐ స్కోర్‌ను లెక్కిస్తారు. 2000, 2015 మధ్యలో ఆకలి బాధలను పరిష్కరించడంలో భారత్‌ పనితీరు బాగుంది. గణనీయమైన విజయాలను సాధించింది.
2వేల సంవత్సరంలో 38.4గా వున్న స్కోర్‌ 2008లో 35.5గా వుండగా, 2015లో 29.2కి చేరింది. గత ఎనిమిదేళ్ళలో కేవలం 0.5పాయింట్లు మాత్రమే తగ్గింది. భారత్‌ పనితీరు మొత్తంగా అంతర్జాతీయ ధోరణిని ప్రతిబింబిస్తోంది. 2023లో మొత్తంగా ప్రపంచ దేశాల జిహెచ్‌ఐ స్కోర్‌ 18.3గా వుంది. అయితే, 2015నాటి స్కోరుతో పోలిస్తే కేవలం ఒక పాయింట్‌ తగ్గింది. వాస్తవానికి పోషకాహారం లోపంతో బాధపడే వారి సంఖ్య 2017లో 7.5శాతంగా వుండగా, 2022లో 9.2శాతానికి పెరిగింది. అంటే 73.5 కోట్ల మంది ప్రజలు ఈ పోషకాహారం లోపం బారిన పడ్డారు. తీవ్రమైన ఆకలి బాధలను ఎదుర్కొంటున్న దేశాల్లో దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ సహారా ప్రాంతాలు వున్నాయి. ఇక్కడ వీటి జిహెచ్‌ఐ స్కోర్లు 27గా వున్నాయి.
అంటే చాలా తీవ్రమైన క్షుద్భాద వుందని సంకేతం. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలు 11.9 స్కోరుతో మూడవ అత్యధిక క్షుద్భాధ స్థాయి గల ప్రాంతాలుగా వున్నాయి. 2015, 2023 మధ్య జిహెచ్‌ఐ స్కోర్లు మరింత అధ్వాన్నంగా మారిన ఏకైక ప్రాంతం లాటిన్‌ అమెరికా, కరేబియా. చైనాను అధిగమించి తూర్పు, ఆగేయాసియా దేశాలు రెండవ అతి తక్కువ జిహెచ్‌ఐ స్కోరు సాధించిన ప్రాంతాలుగా వున్నాయి. యూరప్‌, సెంట్రల్‌ ఆసియా ప్రాంతాల్లో జిహెచ్‌ఐ స్కోరు ఆరుగా వుంది. దీన్ని అత్యంత తక్కువగా పరిగణిస్తారు.