కాలమేదైనా కావొచ్చు
కారణమేదైనా అవ్వొచ్చు
ఈ దేశం అభాగ్యులకు పురిటిశాల
పసిబాలలకు ఆకలి జ్వాల ,
బొడ్డు తాళ్లని దారపు ఉండలా తెంపి
గాలిపటంలా పసికందులను వదిలేసే
కొందరు తల్లులకసలు తెలిసుండదేమో
ఆ పసి పతంగులు ఆకలి ముళ్ల కిందనో
లోకపు నోళ్ల కిందనో ఇరుక్కుపోతారని
దుఃఖపు చెట్టు పై వాలిపోతారని.
వానకు తడిసి, ఎండకు ఎండి
ఆకలికి మండే ఆ పెదవులపై
ఎప్పుడైనా తడి ఆరిపోతే,
ప్రాణం ఆవిరై, మోడుబారినట్టు
డొక్కల్లోనో, పక్క బొక్కల్లోనో
చేయి పెట్టి తడిమి చూస్తే
బొమ్మా బొరుసుల్ల
రెండు దిక్కులా ఆకలి చిత్రమే
వారి దేహ కాన్వాసు పై కనిపిస్తుంది.
ఏ తల్లి వదిలిపోతేనేమీ
ఎప్పుడో శోక దేవత పాలు తాగిన
శ్రావణ కుమారిడిలా
కళ్ళను కన్నీటి కావడిగా చేసి
చెత్త సంచులని
అట్లాసులా భుజాన మోసి
తరలిపోతారు స్ట్రీట్ చిల్డ్రన్లై
మారిపోతారు హంగ్రీ ఫైటర్లై.
– ఏ సందీప్ వొటారికారి
9390280093