”స్వాతంత్య్ర భారతదేశంలో ఆకలితో అలమటించే అనాథలు ఉండేందుకు వీల్లేదు. ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఉన్నారంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్టే. జాతీయ ఆహార భద్రత చట్టాన్ని తప్పనిసరిగా అమలు పరచాల్సిందే” అని గతంలోనే సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. ప్రపంచ ఆకలిసూచీలో గత పదేండ్లుగా మన దేశ ర్యాంకు అధోపాతాళానికి పడిపోతున్నది. వజ్రోత్సవాలు జరుపుకున్న స్వతంత్ర భారతదేశంలో ప్రజల పరిస్థితి ‘అన్నవస్త్రాలు అడిగితే ఉన్న వస్త్రాలు పోయినట్టు’గా మారిపోయింది. 2014లో ఆకలిసూచీలో 55వ స్థానంలో ఉన్న మన దేశం 2024లో 105వ స్థానానికి దిగజారడం విడ్డూరమే! అందునా దక్షిణాసియా దేశాలన్నింటిలోకెల్లా చివరిస్థానంలో నిలవడం దేశ దీనస్థితికి పరాకాష్ఠ. మనం మనకున్న ప్రకృతి, మానవ వనరులను సరిగ్గా ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నాం. అందుకే నేటికీ ఈ దేశంలో ఆకలిమంటలు రగులుతూనే ఉన్నాయి.
ప్రపంచంలో తీవ్రమైన 31ఆకలి రాజ్యాలలో భారత్ కూడా ఉండటం కడు విషాదం. భగ్గున మండుతున్న నిత్యావసరాలు ధరల సెగలకు అసంఖ్యాకులైన సామాన్యులు విలవిల్లాడు తున్నారు. ఇలా పట్టెడన్నం కోసం పరితపించే అభాగ్యుల సంఖ్య ప్రపంచమంతా పెరిగి పోతుండటం నేటి మహావిషాదం. ఇందుకు ఎవరిని నిందించాలి? అదే సమయంలో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రం ఆర్టికల్ 39(ఎ) ప్రకారం దేశంలోని పౌరులందరికీ తగిన జీవన సదుపాయాలు కల్పించాలి. దేశంలోని ప్రతి పౌరునికీ నాణ్యమైన ఆహారం అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దేశంలో ఆహారానికి కొరత లేకపోయి ఉంటే, ఆకలి చావుల సంఖ్య శూన్యంగా ఉండాలి కదా! కానీ నేటికీ దేశంలో ఆకలిచావులు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఆకలి, వాతావరణ మార్పులు, లింగ అసమానత్వం ఈ మూడింటి మధ్య నేరుగా సంబంధం ఉన్నదని నివేదిక ఎత్తిచూపింది. వివక్షాపూరితమైన నిబంధనలు, లింగ ఆధారిత హింస అనేవి మహిళలను, మైనారిటీలను ప్రమాదంలో పడేస్తున్నాయని, వారికి ఆహార, పోషకాహార భద్రత లభించడం లేదని తెలియజేసింది. ఈ సవాళ్లను అధిగమించేందుకు వారు చేస్తున్న ప్రయ త్నాలకు వాతావరణ మార్పుల ప్రభావం ప్రతిబంధకంగా ఉంటోందని నివేదిక చెప్పింది.
‘కన్‌సర్న్‌డ్ వరల్డ్‌వైడ్’, ‘వెల్త్‌హంగర్‌లైఫ్’ సంయుక్తంగా ప్రచురిస్తున్న జీహెచ్‌ఐ సిరీస్ తక్షణం దృష్టి సారించాల్సిన అంశాలను ప్రస్తావించింది. ఈ సంవత్సరపు నివేదికలో భారత్ స్కోరు 27.3. దేశంలో ఆకలి తీవ్రత ఏస్థాయిలో ఉన్నదో ఇది ప్రతిబింబిస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య స్వల్పంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 2016వ సంవత్సరపు జీహెచ్‌ఐ స్కోరు 29.3తో పోలిస్తే ప్రస్తుత స్కోరు మెరుగైనప్పటికీ అది ఇప్పటికీ ‘తీవ్రత’ కేటగిరీలోనే ఉంది. పొరుగు దేశాలకంటే బాగా వెనుకబడి ఉంది.
నేటికీ దేశంలో తినడానికి తిండిలేక, ఆకలిని తట్టుకోలేక నీళ్లు తాగుతూ, పొత్తికడుపును మోకాళ్లతో ఒత్తుకుంటూ అలమటిస్తున్న ప్రజలు కోకొల్లలు. దేశంలో ప్రతిరోజూ దాదాపు 19కోట్ల మంది ఆకలి కడుపుతో నిద్రిస్తున్నారని జాతీయ ఆరోగ్య నివేదిక తెలిపింది. ఒకవైపు ఉత్పత్తి, ఉత్పాదక సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వాలు చెప్పుతున్నప్పటికీ, ఈ ఉత్పత్తిలో కీలకంగా వ్యవహరిస్తున్న నిరుపేదలు ఇంకా ఎందుకు బక్కచిక్కిపోతున్నారో, ఆకలిచావులు ఎందుకు పెరుగుతున్నాయో అన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.
మన దేశంలో నేటికీ ఇంతటి భారీ స్థాయిలో పోషకాహారలోప బాధితులు ఉండడానికి పేదరికమే ప్రధాన కారణం. ఆకాశాన్నంటుతున్న ధరలతో, కొనే తాహతు లేక, అల్పవేతన జీవులు, నిరుపేదలు పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఇది వారి ఆయు ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది.
ఇవాళ దేశంలో ప్రతి ఇద్దరిలో ఒక మహిళ రక్తహీనతతో బాధపడుతున్నది. వారిలో అత్యధిక శాతం అట్టడుగు వర్గాలు, నిరుపేద వర్గాల స్త్రీలే! దేశంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి ఐక్యరాజ్యసమితి విధించిన ప్రపంచ పౌష్టిక ఆహార లక్ష్యాలను గాని, 2030 నాటికి రెండవ సుస్థిరాభివృద్ధి లక్ష్యమైన ‘జీరో హంగర్’ను గానీ చేరుకోవడం భారతదేశానికి పెనుసవాలే. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని వ్యవసాయం, ఆహార భద్రత, పౌష్టికాహార పంపిణీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ‘అన్నార్తులు అనాథలుండని/ఆ నవయుగ మదెంత దూరమో?/ కరువంటూ కాటకమంటూ / కనుపించని కాలాలెపుడో?’ అంటూ స్వప్నించిన మహాకవి కల ఎప్పటికి నెరవేరుతుందో…