భార్య పై భర్త దాడి…

– కుమారుడి ఫిర్యాదు తో కేసు నమోదు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మద్యం మత్తులో భార్య పై భర్త దాడి చే‌సాడు. ఈ ఘటన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. కుమారుడు ఫిర్యాదు పై తండ్రి పై కేసు నమోదు అయింది.
ఫిర్యాదుదారు రాతపూర్వక కథనం మేరకు స్థానిక ఎస్.హెచ్.ఓ ఎస్సై టి. యయాతి రాజు ప్రకారం వివరాలు.. ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా గోపాలపురం కు చెందిన పెండ్ర రవి, భార్య దుర్గ స్వగ్రామమైన అశ్వారావుపేట మండలం ఆసుపాక కు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి ఇరువురు సంతానం ఉన్నారు. అయితే భార్యపై అనుమానంతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా భర్త రవి వేరుగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చి మద్యం మత్తులో గొడవ పడేవాడు.ఈ క్రమంలోనే శనివారం రాత్రి భార్య దగ్గరకు వచ్చిన రవి నిద్రిస్తున్న భార్యను అందుబాటులో ఉన్న పాత మంచం పట్టెతో తల నుదుటిపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు పెట్టడంతో కుటుంబీకులు మేల్కొని వచ్చేసరికి అక్కడి నుంచి పారిపోయాడు.రక్తపు గాయంతో ఉన్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ ఘటనపై బాధితురాలి పెద్ద కొడుకు అశోక్ బుధవారం చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుపై నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.