శివుని తలపైన గంగమ్మ వలే హుస్నాబాద్

– కీర్తి కిరీటంలో కలికితురాయి గౌరవెల్లి ప్రాజెక్టు
– గౌరవెల్లి భూనిర్వాసితుల త్యాగం మరువలేనిది
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గౌరవెల్లి ప్రాజెక్టు, శనిగరం చెరువు, సింగరాయ ప్రాజెక్టు పూర్తి కావడంతో శివుని తల పైన గంగమ్మ వలే హుస్నాబాద్ ప్రాంతం ఉందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవ సంబరాలు పోతారం (ఎస్) శుభం గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ
నాడు నెర్రలు బారిన నేల …నేడు గౌరవెల్లి జలాలతో సస్యశ్యామలం కాబోతుందన్నారు. గౌరవెల్లి బూరెలు వసతుల త్యాగం మరువలేనిదని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు అతి తొందరలో ప్రారంభిస్తామని అన్నారు. గతంలో హుస్నాబాద్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు కుంటలు దర్శనమిచ్చేవని, బతుకమ్మలు వేయాలన్న, వినాయకుని దుర్గామాతల నిమజ్జనం చేయాలన్న నీళ్లు ఉండేవి కావన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ని 700 చెరువులు కుంటలు జలకళ ఉట్టిపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ ద్వారా ఎలకతుర్తి మండలానికి నీళ్లు వస్తున్నాయని, దేవాదుల ద్వారా సైదాపూర్, చిరుమామిడి మండలానికి నీళ్లు వస్తున్నాయని చెప్పారు.మిడ్ మానేరు ద్వారా మహమ్మదాపూర్ లో నిర్మించిన ట్యాంకులతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అన్నారు. మహాసముద్రం గండిని పూడ్చడం ద్వారా దాదాపు 14 గ్రామాల్లో నీటిమట్టం పెరిగిందన్నారు. ఆనాడు స్వయంగా సీఎం కేసీఆర్ సందర్శించి మహాసముద్రం గండి పనులకు శంకుస్థాపన చేశారని త్వరగా ఆ పనులు పూర్తి చేసుకున్నామని, గౌరవెల్లి ప్రాజెక్టు యొక్క క్రెడిట్ మొత్తం సీఎం కేసీఆర్ కే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ బాబు, సిద్దిపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, ఈ ఈ రాములు నాయక్, జెడ్పిటిసి భూక్య మంగా , ఎంపీపీలు లగావత్ మానస సుభాష్, మాలోతు లక్ష్మి బీల్ నాయక్ , హుస్నాబాద్ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, పక్కన పేట మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు, డి ఈ లు తదితరులు పాల్గొన్నారు.