– తన్మయ్, అభిరాత్, హిమతేజ మెరుపుల్
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (177, 327 బంతుల్లో 19 ఫోర్లు) భారీ సెంచరీతో కదం తొక్కగా.. కొడిమెల హిమతేజ (76, 106 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), రాహుల్ (52), అభిరాత్ రెడ్డి (73), నిశాంత్ (71, 93 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), రక్షణ్ రెడ్డి (42 నాటౌట్, 135 బంతుల్లో 2 ఫోర్లు) అదరగొట్టారు. టాప్ ఆర్డర్, టెయిలెండర్లు మెరుపులతో రంజీ ట్రోఫీ గ్రూప్-బిలో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ (10), తనయ్ త్యాగరాజన్ (0), చామ మిలింద్ (4), అనికెత్ రెడ్డి (4) నిరాశపరిచినా.. చివరి రెండు వికెట్లకు భారీ భాగస్వామ్యాలు నమోదు అయ్యాయి. 399/8తో నిలిచిన హైదరాబాద్‌కు రక్షణ్ రెడ్డి, శరణు నిశాంత్‌లు భారీ స్కోరు అందించారు. హిమాచల్‌ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 33/1తో ఎదురీదుతోంది. శరణు నిశాంత్ (1/17) బంతితోనూ హిమాచల్‌ను దెబ్బకొట్టాడు. హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 532 పరుగుల భారీ వెనుకంజలో కొనసాగుతుంది.