– శతకం చేజార్చుకున్న తన్మయ్ అగర్వాల్
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు జట్ల రంజీ సమరం ఎటువంటి డ్రామా లేకుండా చప్పగా ముగిసింది. నాలుగు రోజుల ఆటలో ఇరు జట్లు విజయం కోసం అదనపు రిస్క్ తీసుకోలేకపోయాయి. దీంతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్, ఆంధ్ర రంజీ ట్రోఫీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగుల ఆధిక్యం సాధించిన ఆంధ్ర జట్టు విలువైన 3 పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. హైదరాబాద్‌కు ఒక్క పాయింట్ మాత్రమే లభించింది. ఎలైట్ గ్రూప్-బిలో ఐదు మ్యాచుల్లో 9 పాయింట్లతో హైదరాబాద్ ఆరో స్థానంలో నిలువగా..ఐదు మ్యాచుల్లో నాలుగు పాయింట్లతో ఆంధ్ర ఏడో స్థానానికి పరిమితమైంది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 448 పరుగులకు ఆలౌట్ కాగా.. షేక్ రషీద్ (203), కరణ్ షిండె (109) శతకాలతో రాణించారు. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 193/1 పరుగులు చేసింది. తన్మరు అగర్వాల్ (95), అభిరాత్ రెడ్డి (70 నాటౌట్) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన తన్మరు.. ఐదు పరుగుల తేడాతో మ్యాచ్‌లో రెండో శతకానికి దూరమయ్యాడు. ఆంధ్ర స్టార్ షేక్ రషీద్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో రంజీ ట్రోఫీ తొలి దశ ముగిసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ అనంతరం రంజీ ట్రోఫీ పున ప్రారంభం కానుంది. హైదరాబాద్ తన చివరి రెండు మ్యాచుల్లో హిమాచల్ ప్రదేశ్, విదర్భతో తలపడనుంది. జనవరి 23 నుంచి సొంతగడ్డపై హిమాచల్ ప్రదేశ్‌తో.. జనవరి 30 నుంచి నాగ్‌పూర్‌లో విదర్భతో హైదరాబాద్ ఆడనుంది.