హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ బోణీ

హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ బోణీ– ముంబయి మెటియర్స్‌పై 3-2తో గెలుపు
– ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2024
చెన్నై : ప్రైమ్‌వాలీబాల్‌ లీగ్‌ 2024 సీజన్లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ బలంగా పుంజుకుంది. ముంబయి మెటియర్స్‌తో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో బ్లాక్‌హాక్స్‌ ఉత్కంఠ విజయం సాధించింది. ఐదు సెట్ల పాటు హౌరాహౌరీగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ 7-15, 12-15, 15-10, 15-11, 20-18తో ముంబయి మెటియర్స్‌ను ఓడించింది. ఐదు సెట్ల పాటు సాగిన మ్యాచ్‌లో ముంబయి మెటియర్స్‌ 2-0తో ముందంజ వేసినా.. హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ సంచలన ప్రదర్శనతో చివరి మూడు సెట్లను గెల్చుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అష్మత్‌ ఉల్లా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును దక్కించుకున్నాడు. హైదరాబాద్‌ ఆటగాళ్లలో అష్మత్‌ 13, కుమార్‌ సాహిల్‌ (10), హేమంత్‌ (8) రాణించారు. ముంబయి మెటియర్స్‌ తరఫున అమిత్‌ సింగ్‌, షంషీముద్దీన్‌, శుభమ్‌ చౌదరి పదేసి పాయింట్లు సాధించారు. తమిళనాడు యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఉదయనిది స్టాలిన్‌ సోమవారం చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌, ముంబయి మెటియర్స్‌ మ్యాచ్‌ను ప్రారంభించారు.