హైదరాబాద్‌ ఓటమి

Hyderabad defeat– 3 వికెట్ల తేడాతో ముంబయి గెలుపు
– విజయ్‌ హజారే ట్రోఫీ 2024
అహ్మదాబాద్‌: దేశవాళీ ప్రతిష్టాత్మక వైట్‌బాల్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌)లో హైదరాబాద్‌ రెండో మ్యాచ్‌లోనే నిరాశపరిచింది. గ్రూప్‌-సిలో సోమవారం అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి చేతిలో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 38.1 ఓవర్లలో 169 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (64, 74 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), అరవెల్లి అవనీశ్‌ రావు (52, 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరిసినా.. ఇతర బ్యాటర్లు తేలిపోయారు. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (0) వరుసగా రెండో మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరువలేదు. అభిరాత్‌ రెడ్డి (35) రాణించగా.. వరుణ్‌ (1), రోహిత్‌ రాయుడు (1), అజయ్‌ దేవ్‌ గౌడ్‌ (7), తనయ్‌ త్యాగరాజన్‌ (1), సివి మిలింద్‌ (3) విఫలం అయ్యారు. ముంబయి బౌలర్లలో అతర్వ వినోద్‌ (4/55), ఆయుశ్‌ (3/17) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని ముంబయి 25.2 ఓవర్లలోనే ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (44 నాటౌట్‌, 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), తనుశ్‌ కొటియన్‌ (39 నాటౌట్‌, 6 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 40 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. మరో 148 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో ముంబయి తొలి విజయం సాధించింది. హైదరాబాద్‌ బౌలర్లలో నిశాంత్‌ (3/42) రాణించాడు. ముంబయి ఆల్‌రౌండర్‌ తనుశ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.