15 ఏళ్లలో అల్ఫా సిటీల జాబితాలోకి హైదరాబాద్‌

– చేతిలో 15 ప్రాజెక్టులు
– ఈ ఏడాది రూ.2,000 కోట్ల బుకింగ్స్‌ లక్ష్యం
– రామ్కీ ఎస్టేట్స్‌ ఎండి నంద కిశోర్‌ వెల్లడి
నవ తెలంగాణ – బిజినెస్‌ బ్యూరో
నిర్మాణ రంగంలో హైదరాబాద్‌ దూసుకువెళ్తుందని రామ్కీ ఎస్టేట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నంద కిశోర్‌ అన్నారు. వచ్చే 15 ఏళ్లలో ప్రపంచ దిగ్గజ నగరాల జాబితాలో హైదరాబాద్‌ చేరనుందన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌, దుబాయి, లండన్‌ లాంటి అల్పా సిటీస్‌ ఫ్లస్‌లో చోటు సంపాదించుకోనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అభివృద్థికి విస్తృతావకాశాలు ఉన్నాయన్నారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్కీ ప్రాజెక్టులను వర్య్చూవల్‌గా సందర్శించడానికి వీలుగా ‘రామ్కీ వర్స్‌’ను ఆయన ఆవిష్కరించారు. ఇది జులై 14 నుంచి పూర్తిగా అందుబాటులోకి రానుందన్నారు. గృహాలు కొనుగోలు చేసేటప్పుడు ఇది వాస్తవిక అనుభవానికి దగ్గరగా చూపిస్తుందన్నారు. నగరానికి చెందిన డెవలపర్‌ వర్చువల్‌ రియాలిటీ కోణంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి అన్నారు. రామ్కీ గ్రూప్‌లో భాగమైన తమ సంస్థ ఆర్థిక సంవత్సరం 2023-24లో రూ.2,000 కోట్ల బుకింగ్‌ విలువను చేరాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందుకోసం రూ.45 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువ చేస్తే నివాసాల నిర్మాణం, విక్రయాలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నరు, బెంగళూరు తదితర నగరాల్లో 15 ప్రాజెక్టులను చేపడుతుందన్నారు. 15 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాజెక్టుల విలువ రూ.10వేల కోట్లుగా ఉంటుందన్నారు. వచ్చే మూడున్నరేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని వెల్లడించారు. రామ్కీ ఎస్టేట్‌ వద్ద రూ.6500 కోట్ల విలువ చేసే స్థలాలు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నంలో వైజాగ్‌ క్రిస్టల్‌ పేరుతో ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. వచ్చే మూడేళ్లలో తమ సంస్థ గిడ్డంగుల వ్యాపారంలోకి ప్రవేశించనుందన్నారు. ఈ సమావేశంలో రామ్కీ ఎస్టేట్స్‌ సిఎఫ్‌ఒ జితేంద్ర లబడియా, డైరెక్టర్‌ తారక రాజేష్‌, మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శరత్‌ బాబు పాల్గొన్నారు.