హైదరాబాద్‌ భారీ విజయం

Hyderabad is a big win– ఇన్నింగ్స్‌ 50 పరుగులతో పుదుచ్చేరిపై గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఈ ఏడాది రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ తొలి విజయం సాధించింది. ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుదుచ్చేరిపై హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగుల భారీ వెనుకంజలో నిలిచిన పుదుచ్చేరి ఫాలోఆన్‌లో తీవ్రంగా ప్రతిఘటించింది. ఓపెనర్‌ శ్రీధర్‌ రాజు (106) సెంచరీతో మెరువగా..అజరు (69), ఆకాశ్‌ (31), మారిముత్తు (21), అంకిత్‌ (22 నాటౌట్‌) హైదరాబాద్‌ బౌలర్లను విసిగించారు. ఫాలోఆన్‌లో 119.3 ఓవర్లలో 333 పరుగులకు పుదుచ్చేరి కుప్పకూలింది. స్పిన్నర్‌ తనరు త్యాగరాజన్‌ (7/106) ఏడు వికెట్ల ప్రదర్శనతో మాయ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 536/8 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో 9 వికెట్లు సహా అర్థ సెంచరీతో రాణించిన తనరు త్యాగరాజన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఇన్నింగ్స్‌ విజయంతో హైదరాబాద్‌ బోనస్‌ పాయింట్‌ను సైతం దక్కించుకుంది.