– ప్రఖ్యాత నగరాలన్నీ నదుల చుట్టే విలసిల్లాయి
– ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్ల ఎంపికకు కసరత్తు
– దుబారు కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి సంప్రదింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూసీ నది పునరుద్ధరణతో హైదరాబాద్ నగరానికి మహర్ధశ పట్టనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్ పర్యటన ముగించుకుని దుబాయి చేరుకున్న సీఎం ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వరుసగా భేటీ అయ్యారు. మూసీ పొడవునా చేపట్టనున్న గ్రీన్ అర్బన్ పార్క్‌లు, వాణిజ్య సముదా యాలు, నడక దారులు మొదలగు అభివృద్ధి పనులను వారికి వివరించారు. రివర్స్ ఫ్రంట్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, నమూ నాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై వివిధ సంస్థలతో చర్చలు జరిపారు. ”చారిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుంది” అని సీం వారితో అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ ప్రాజెక్టుకు అద్భుతమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని కోరారు. దేశంలోని ఇతర పట్టణాలు, రాష్ట్రాలతో తాము పోటీ పడటం లేదనీ, ప్రపంచంలోనే అత్యుత్తమమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా మని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం 70 సంస్థలతో సంప్రదింపులు జరిపారు. అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ఆసక్తి ప్రదర్శించాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాయి. ఈ చర్చల్లో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్‌ఎండీఏ అదనపు కార్యదర్శి అమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు సందర్శన.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబారు వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం స్కై స్కాపర్ (ఆకాశ హర్మ్యం) పైకి వెళ్లి ఏరియల్ వ్యూలా కనిపించే వాటర్ ఫ్రంట్‌ను తిలకించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణానికి పట్టిన సమయం, వ్యయం, తదితర విషయాలపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.