హైదరాబాద్‌ జోరు సాగేనా?

Will Hyderabad continue to grow?– గుజరాత్‌తో రంజీ పోరు నేటి నుంచి
నవతెలంగాణ-హైదరాబాద్‌
అపెక్స్‌ కౌన్సిల్‌లో అంతర్గత కుమ్ములాటలు, జట్టు సెలక్షన్స్‌లో అవినీతి మరకలతో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఇంతకాలం వార్తల్లో నిలిచింది. సుదీర్ఘ విరామం అనంతరం క్రికెట్‌లో ప్రతిభ, విజయాలతో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. గత సీజన్లో రంజీ ప్లేట్‌ చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్‌.. ఇటీవల ఆల్‌ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ విజేతగా అవతరించింది. దీంతో, హైదరాబాద్‌ రంజీ జట్టుపై అంచనాలు ఏర్పడటం మొదలైంది. గత సీజన్‌ నుంచి రెడ్‌బాల్‌ ఫార్మాట్‌లో అజేయంగా నిలిచిన హైదరాబాద్‌ ఈ ఏడాది రంజీ ట్రోఫీపై కన్నేసింది. స్టార్‌ ఆటగాడు తిలక్‌ వర్మ సారథ్యంలో హైదరాబాద్‌ బరిలోకి దిగుతుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్‌ జట్టులో ఉన్న తిలక్‌ వర్మ.. తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రాహుల్‌ సింగ్‌ సారథ్య బాధ్యతలు తీసుకోనున్నాడు.
అందరూ ఫామ్‌లోనే.. : హైదరాబాద్‌ జట్టులో అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. రాహుల్‌ సింగ్‌, తన్మరు అగర్వాల్‌, రోహిత్‌ రాయుడు బ్యాటింగ్‌ బాధ్యతలను మోయనున్నారు. కార్తికేయ కక్‌, సి.వి మిలింద్‌లతో కలిసి రవితేజ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. స్పిన్నర్‌ తనరు త్యాగరాజన్‌ కెరీర్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అతడి మాయ ముంగిట ప్రత్యర్థి బ్యాటర్లు నిలువటం లేదు. నేడు గుజరాత్‌తో మ్యాచ్‌లో త్యాగరాజన్‌ స్పిన్‌ మాయజాలం జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయనుంది. మరోవైపు, గుజరాత్‌ సైతం బలమైన జట్టు. యువ ఆటగాళ్లతో ఉత్సాహం మీదున్న గుజరాత్‌ను సొంతగడ్డపై హైదరాబాద్‌ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. హైదరాబాద్‌, గుజరాత్‌ రంజీ మ్యాచ్‌ నేడు ఉదయం 9.30 గంటలకు సికంద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఆరంభం కానుంది. ఇదిలా ఉండగా, రంజీ ట్రోఫీ ఈ సీజన్‌లో కొత్తగా కనువిందు చేయనుంది. గతంలో ఒకే షెడ్యూల్‌లో టోర్నమెంట్‌ పూర్తయ్యేది. ఈ సీజన్‌ నుంచి టోర్నమెంట్‌ షెడ్యూల్‌లో కీలక మార్పులు చేశారు. ప్రతి జట్టు గ్రూప్‌ దశలో తొలి విడతలో ఐదు మ్యాచులు ఆడనుంది. ఆ తర్వాత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20, విజరు హజారే 50 ఓవర్ల టోర్నమెంట్‌ లు జరుగుతాయి. అనంతరం మళ్లీ రెండో విడతలో రంజీ ట్రోఫీ షురూ అవుతుంది. టోర్నమెంట్‌ను రెండు దశల్లో నిర్వహించటం ఆటగాళ్లకు ఉపయుక్తం గా ఉంటుందని అనుకున్నా…ఆ ప్రభావం ఏ విధంగా ఉండేది టోర్నమెంట్‌ ఫలితంపైనే ఆధారపడి ఉంటుంది.