హైదరాబాద్‌ అతలాకుతలం

Hyderabad is like that– నీట మునిగిన కాలనీలు, అపార్టుమెంట్లు, అండర్‌ పాస్‌లు
– మైసమ్మగూడలో అపార్టుమెంట్ల మొదటి అంతస్తుల్లోకి మురుగు నీరు
– నాలాలో కొట్టుకుపోయిన బాలుడు
– జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో పలుచోట్ల సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు మురుగు నీటితో నిండాయి. బాచుపల్లిలో నాలుగేండ్ల బాలుడు మూత లేని మ్యాన్‌హౌల్‌లో పడి నాలాలో కొట్టుకుపోయి మృతిచెందాడు. పలు బస్తీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్‌ పాస్‌ వద్ద భారీగా వర్షం నీళ్లు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లు చెరువులను తలపించాయి. ఒకే రోజు 18 సెంటీమీటర్ల వర్షం కురవడంతో పటేల్‌ చెరువు తెగిపోయింది.మేడ్చల్‌ జిల్లాలో పలు కాలనీలు, అపార్టుమెంట్లు నీట మునిగాయి. గణేష్‌నగర్‌, చింతల్‌, అయోద్యనగర్‌, మైసమ్మగూడలో దాదాపు 25 అపార్టుమెంట్లలోని మొదటి అంతస్తులు నీటమునిగాయి. ఆ ప్రాంతంలో కాలేజీలు, హాస్టళ్లుండటంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోటార్ల సహాయంతో నీటిని తోడేశారు. విద్యార్థులను ప్రొక్లెయిన్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని.. సమస్యలు లేకుండా ప్రయత్నించారు.
లాల్‌ బంగ్లాలో వరద
బేగంపేట్‌లోని లాల్‌బంగ్లా భవనం వరద నీటిలో మునిగిపోయింది. సెల్లార్‌ పూర్తిగా నీట మునగడంతో దాదాపు 20కి పైగా షాప్‌లు నీటిలోనే ఉండిపోయాయి. పలు ప్రాంతాల్లో దుకాణాల్లోకి నీరు చేరడంతో వస్తువులు, డాక్యుమెంట్లు, ఫర్నీచర్‌ పూర్తిగా తడిచాయి. వర్షం.. నీటి వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది.
వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌ బెటర్‌..
వర్షాల కారణంగా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం, సాయంత్రం వేళల్లో సమస్య మరింత తీవ్రంగా ఉండటంతో అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు ఐటీ యాజమాన్యాలకు కీలక సూచన చేశారు. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌ సౌకర్యం కల్పించాలని సూచించారు.
మెట్రో స్టేషన్‌ నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు
మెట్రో స్టేషన్‌ ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో మెట్రోస్టేషన్ల వద్ద మోకాలి లోతు నీరు ఉండటంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. మూసాపేట్‌ మెట్రో స్టేషన్‌ కింద వరద నీరు నిలువడంతో ఎర్రగడ్డ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్‌ వైపు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మూసాపేట్‌ మెట్రో స్టేషన్‌ నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
మేయర్‌ తీరుపై ఆగ్రహం
భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులను అలర్ట్‌ చెయ్యడంలో జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమైందని మేయర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వర్షం కారణంగా అనేక కాలనీలు నీటమునిగినా మేయర్‌ అక్కడి వరకు వెళ్లకుండానే ఫొటో ఎగ్జిబిషన్‌కు వచ్చినట్టు వచ్చి వెళ్లారని విమర్శిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు హై అలర్ట్‌ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వందలాది కాలనీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.
చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్‌
భారీ వర్షాల నేపథ్యంలో చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ అధికారులను ఆదేశించారు. మియాపూర్‌ సర్కిల్‌లో తెగిపోయిన పటేల్‌ చెరువును మంగళవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి కమిషనర్‌ పరిశీలిం చారు. కమిషనర్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ ఎంసీ పరిధిలో ఉన్న చెరువుల వద్ద వరద పరిస్థితిని గమ నించి అప్రమ త్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఇప్పటికే నిండు కుండల్లా ఉన్న హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్లు, ఉస్మాన్‌సాగర్‌ రెండు గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. దీంతో మూసీ నదిలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌ లోయర్‌ బ్రిడ్జి సమీపంలో కాలనీవాసులను ఇండ్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. మూసారం బ్రిడ్జి వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నాలాలో పడి బాలుడు మృతి
హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నిజాం పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రగతినగర్‌ పరిధిలో మంగళ వారం ఉదయం నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. వర్షాలతో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌ఐ కాలనీకి చెందిన బాలుడు మిథున్‌రెడ్డి (4) బయటకు వెళ్లగా.. మూతలేని మ్యాన్‌హౌల్‌లో పడిపోయాడు. తల్లిదండ్రులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంటల తరబడి పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా బాలుడు నాలాలో పడి కొట్టుకుపోయినట్టు గుర్తించారు.
నాలాలో గాలింపు చేపట్టగా నిజాంపేట్‌ రాజీవ్‌ గృహకల్ప 45వ బ్లాక్‌ వద్ద మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.