హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు పేరు మార్చాలి

– టీపీఎస్‌ అధ్యక్షురాలు నిరాకిషోర్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో వందలాదిమంది విద్యార్థుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద ఉన్న కేబీఆర్‌ పార్కు పేరు మార్చాలని తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్‌) అధ్యక్షురాలు నిరాకిషోర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ మృతవీరుల స్మారక స్థూపం గన్‌పార్క్‌ వద్ద టీపీఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం తర్వాత స్వతంత్ర భారతంలో జరిగిన అతిపెద్ద నరమేధం 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమమే అని ఆమె పేర్కొన్నారు. వందకు పైగా పోలీస్‌ కాల్పుల్లో 369 మంది విద్యార్థులు మరణించారనీ, అందుకు కారకుడైన కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో పార్క్‌ ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కేబీఆర్‌ పార్కుకు తెలంగాణ మృతవీరుల స్మారక పార్కుగా పేరు మార్చాలని డిమాండ్‌ చేశారు. టీపీఎస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ నారాయణ మాట్లాడుతూ నెల రోజుల్లో కేబీఆర్‌ పార్కు పేరు మార్చకపోతే తదుపరి కార్యాచరణతో ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ నారాయణ కార్యదర్శి సనావుల్లా ఖాన్‌ యువ నాయకులు బింగి వార్‌ రవి తదితరులు పాల్గొన్నారు.