24 నుంచి 26 వరకు…హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌

– మూడ్రోజుల వేడుకకు వేదికగా హైటెక్‌ సిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌’ ఈనెల 24 నుంచి 26 వరకు హైటక్‌ సిటీలోని సత్వ నాలెడ్జి సెంటర్‌, టీ హబ్‌లో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు విజయకుమార్‌, కిన్నెర మూర్తి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో భాష, సంస్కృతి, సాహిత్యం నుంచి మొదలుకుని వాతావరణ మార్పుల వరకు 20కి పైగా వివిధ అంశాలకు సంబంధించి సెమినార్లు, వర్క్‌షాపులు, ఎగ్జిబిషన్లు, తదితర కార్యక్రమాలుంటాయని తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ప్రారంభించనున్న ఫెస్టివల్‌లో లిథువేనియా, సిందీ భాషలపై ప్రత్యేక చర్చాగోష్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ వేడుకలకు వివిధ రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ ముఖ్యులు హాజరవుతారని తెలిపారు. రాజ్‌దీప్‌ సర్దేశారు, అరుణారారు, హర్షమందిర్‌, షబనా ఆజ్మీ, సినీ నటులు సిద్దార్థ తదితరులు ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొంటారని వెల్లడించారు. నగర వాసులతో పాటు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమితాదేశాయి తదితరులు పాల్గొన్నారు.