హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ షురూ

Hyderabad Open Tennis Tournamentహైదరాబాద్‌ : 20వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ఘనంగా ఆరంభమైంది. సికింద్రాబాద్‌ క్లబ్‌ టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీపీ) ఎం. రమేశ్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా రమేశ్‌ మాట్లాడుతూ.. ’20వ సారి మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌కు అభినందనలు. వయసుకు ఎదురీదుతూ ఉత్సాహంగా పోటీపడుతున్న క్రీడాకారులు యువతకు సూార్తిేదాయకం. ఈ రోజుల్లో ఆటలను జీవన శైలిలో భాగం చేసుకోవటం అనివార్యం. క్రీడలతో ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం దక్కుతుంది. పోలీసు స్పోర్ట్స్‌ ఐజీగా క్రీడల ప్రాధాన్యత నాకు తెలుసు. ఇటువంటి టోర్నీలు మరిన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 220 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. నాలుగు వయో విభాగాల్లో సింగిల్స్‌, డబుల్స్‌లో విజేతలకు నిలిచిన అథ్లెట్లకు రూ. 2 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి వెల్లడించారు. టోర్నమెంట్‌లో పోటీపడే క్రీడాకారులకు ఉచిత భోజనం, బస వసతి సౌకర్యాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు.