– సౌత్ జోన్‌లో గుండ్లపోచంపల్లి, నిజాంపేట్, సిద్దిపేట సత్తా
– సూరత్‌తో కలిసి ఏడోసారి అగ్రస్థానంలో నిలిచిన ఇండోర్
– స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ముర్ము
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోనే బెస్ట్ క్లీనెస్ట్ సిటీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఏడోసారి సత్తా చాటింది. 2023 ఏడాదికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో… గుజరాత్‌లోని సూరత్‌తో కలిసి ఇండోర్ అగ్రస్థానాన్ని పంచుకుంది. నవీ ముంబయి తన మూడో స్థానాన్ని పదిలపర్చు కుంది. ఇక టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. నాలుగో స్థానంలో విశాఖపట్నం, ఆరో స్థానంలో విజయవాడ, ఎనిమిదో స్థానంలో తిరుపతి, తొమ్మిదో స్థానంలో హైదరాబాద్ నిలిచాయి. గురువారం కేంద్ర గహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యుఏ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవంలో చీఫ్ గెస్ట్‌గా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు. క్లీన్ సిటీస్, క్లీనెస్ట్ కంటోన్మెంట్, సఫాయిమిత్ర సురక్ష, గంగా టౌన్స్, బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ కేటగిరీలలో టాప్ త్రిలో నిలిచిన సిటీలకు ఆమె అవార్డులను అందజేశారు. కాగా… నేషనల్ లెవల్‌లో 24, జోనల్ లెవల్‌లో 20, స్టేట్ లెవల్‌లో 54 ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 110 అవార్డులను కేంద్రం ప్రదానం చేసింది. లక్ష లోపు జనాభా కలిగిన సిటీల కేటగిరీలో సస్వాద్, పటాన్, లోనావాలా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మధ్యప్రదేశ్‌లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డు క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా ఎంపికైంది. క్లీనెస్ట్ గంగా సిటీల్లో వారణాసి, ప్రయాగ్ రాజ్ మొదటి రెండు అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ప్రోగ్రాంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2023 డ్యాష్ బోర్డును రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావడం ముఖ్యమైన ముందడుగన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రాలు, అర్బన్ లోక్ బాడీస్(యూఎల్ బీ)ల పనితీరును ప్రశంసించారు. 2023 ఏడాదిగాను ‘వేస్ట్ టు వెల్త్’ థీమ్ ఆలోచించాల్సిన కీలకమైన అంశమని గుర్తు చేశారు. వ్యర్థాల నుండి సంపదను సష్టించాలనే అంశాన్ని తాను నొక్కి చెప్పాలనుకుం టున్నానన్నారు. ఈ అంశం మొత్తం పరిశుభ్రతకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి పర్యావరణ పరంగా జీరో వేస్ట్ ప్రొగ్రాంను హైలైట్ చేయడానికి జీ- 20 లీడర్స్ ఢిల్లీ డిక్లరేషన్ కట్టుబడి ఉందన్నారు.
జీహెచ్‌ఎంసీకి క్లీన్ సిటీ అవార్డు….
లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ కేటగిరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఫైవ్ స్టార్ రేటింగ్‌లో 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే సౌత్ జోన్‌లో మొత్తం నాలుగు అవార్డుల్లో తెలంగాణకు మూడు అవార్డులు వరించాయి. 15-25 వేల మధ్య జనాభా, రాష్ట్రం లోపల లక్షల లోపు జనాభా కలిగిన కేటగిరిలో గుండ్లపోచంపల్లి క్లిన్ సిటీగా నిలిచింది. 25-50 వేల మధ్య జనాభా కలిగిన సిటీల్లో నిజాంపేట్, 50 నుంచి లక్ష లోపు జనాభా కలిగిన సిటీల్లో సిద్దిపేట క్లీన్ సిటీ
అవార్డులను పొందాయి. కాగా… జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు దక్కిన అవార్డును జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సోమ భారత్, సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజులలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అందుకున్నారు. జీహెచ్‌ఎంసీకి క్లీనెస్ట్ సిటీ అవార్డు దక్కడం పట్ల హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో రాష్ట్రం మరిన్ని అవార్టులు అందుకోవాలని ఆకాంక్షించారు.