న్యూఢిల్లీ : 2023 వన్డే వరల్డ్‌కప్ నిర్వహణకు ఆతిథ్య బీసీసీఐ కీలక సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. సబ్ ఏర్పాటు బాధ్యతలను ఎస్‌జీఏం ఆఫీస్ బేరర్లకు అప్పగించగా.. ప్రపంచకప్ వేదికల పర్యవేక్షణ, స్టేడియాల ఆధునీకరణకు సబ్సిడీలకు సబ్ కమిటీలు నియమించారు. సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హైదరాబాద్, బెంగళూర్‌లను పర్యవేక్షించనుండగా.. అహ్మదాబాద్, చెన్నైలను రోజర్ బిన్ని.. ఢిల్లీ, ధర్మశాలను జై షా.. ముంబయి, కోల్‌కత, తిరువనంతపురంను దేవాజిత్ సైకియ.. పుణె, లక్నో, గువహటిలను ఆశీష్‌లు పర్యవేక్షించనున్నారు. స్టేడియాల్లో మౌళిక సదుపాయాల కల్పన సబ్సిడీలకు ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ కుమార్, మాజీ కోశాధికారి అనిరుధ్ చౌదరి, ప్రభ్‌తేజ్ భాటియా, శంకర్ సహా ఐదుగురు ఆఫీస్ బేరర్లు ఉండనున్నారు. ప్రపంచకప్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్ర క్రికెట్ సంఘాలతో నేడు న్యూఢిల్లీలో బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.