హైదరాబాద్‌ పరాజయం

Hyderabad's defeat– కోల్‌కత థండర్‌బోల్ట్స్‌ మెరుపు విజయం
– ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2024
చెన్నై : ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2024 సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతుంది. గ్రూప్‌ దశలో బ్లాక్‌హాక్స్‌ ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగో పరాజయం చవిచూసింది. గురువారం చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత థండర్‌బోల్ట్స్‌ చేతిలో 8-15, 8-15, 15-11, 18-20తో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఓటమి చెందింది. హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ కీలక ఆటగాళ్లు హేమంత్‌, జొసెఫ్‌, లాల్‌ సుజన్‌ అంచనాలను అందుకోలేదు. కోల్‌కత థండర్‌బోల్ట్స్‌ ఆటగాళ్లు వినిత్‌, అమిత్‌, కుకూర్‌లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావటం గమనార్హం. తొలి రెండు సెట్లలో ఆరంభంలో ఆధిక్యం సాధించినా హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఆఖరు వరకు ఆ జోరు చూపించలేదు. కానీ చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో సెట్‌లో గట్టిగా పుంజుకుంది. 15-11తో మూడో సెట్‌ను గెల్చుకుని మ్యాచ్‌ రేసులోకి వచ్చింది. కీలక నాల్గో సెట్‌లో సైతం హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఆఖరు వరకూ పోరాడింది. 13-13 నుంచి ప్రతి పాయింట్‌ ఆధిక్యం మారుతూ సాగిన సెట్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఆఖర్లో బోల్తా కొట్టింది. 20-18తో నాల్గో సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కోల్‌కత థండర్‌బోల్ట్స్‌ సొంతం చేసుకుంది.