– విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణే లక్ష్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ, ఆస్తుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చైర్మెన్‌గా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు హైడ్రాను విస్తరించారు. ఓఆర్‌ఆర్‌కు అవతల ఉండే ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బర్ రీజియన్ (టీసీయూఆర్)గా ఏర్పాటు చేస్తూ, దానికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిని చైర్మెన్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. రెండు విభాగాలకు సంబంధించిన విధివిధానాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరంలో ఏటా 3.2 శాతం జనాభా పెరుగుతున్నదనీ, దీనివల్ల శివారు ప్రాంతాల్లో వేగవంతమైన అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)తో పరిధితోపాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి ప్రాంతాలకు హైడ్రా వర్తిస్తుందని వివరించారు. పార్కులు, లే అవుట్ ఖాళీ స్థలాలు, ఆటస్థలాలు, చెరువులు, నాలాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు వంటివి ఆక్రమణలకు గురికాకుండా, హైడ్రా పరిరక్షించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పై ప్రాంతాల్లోని ఆక్రమణలను సంబంధిత విభాగాల ఆనుమతితో తొలగిస్తారు. అలాగే భవన నిర్మాణాలు నిర్దేశిత ప్లాన్ ప్రకారం జరిగేట్టు చూడటం కూడా ఈ విభాగం విధుల్లో ఒకటి. హైడ్రాలో సీఎం చైర్మెన్‌గా పలు విభాగాల ఉన్నతాధికారులతో కలిపి 12 మందితో బోర్డును ఏర్పాటు చేశారు. టీసీయూఆర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సబ్‌కమిటీలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. దీనిలోనూ పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. హైడ్రా ద్వారా ట్రాఫిక్ నిర్వహణ, నీరు నిలిచిన ప్రాంతాల గుర్తింపు, రోడ్ల మరమ్మతులు, విపత్తుల నియంత్రణ వంటి విధులు నిర్వహిస్తారు.ఈ రెండు విభాగాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుంది. దానితో పాటు హైడ్రాలో భాగస్వామ్యమైన వివిధ ప్రభుత్వ శాఖలు వసూలు చేసే పన్నుల్లో కొంత వాటాను దీనికి కేటాయిస్తారు.