మణికొండ అల్కపూరి టౌన్‌షిప్‌లో హైడ్రా పంజా

మణికొండ అల్కపూరి టౌన్‌షిప్‌లో హైడ్రా పంజా– కమర్షియల్‌ షెట్టర్స్‌ తొలగింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రెసిడెన్షియల్‌గా అనుమతులు తీసుకొని కమర్షియల్‌గా షెట్టర్లు వేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వాటిపై హైడ్రా పంజా వేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని మణికొండ అల్కపూరి టౌన్‌షిప్‌లో అనుహర్‌ మార్నింగ్‌రాగా అపార్టుమెంట్‌లో రెసిడెన్షియల్‌కు బదులుగా గ్రౌండ్‌ఫ్లోర్‌ను కమర్షియల్‌గా కొనసాగిస్తున్న అంశంపై రెండు వారాల కిందట హైడ్రా కమిషనర్‌ ఐజీ రంగనాథ్‌కు ఫిర్యాదు అందింది. 7 రోజుల్లో షెట్టర్లను తొలగించాలంటూ గత నెల 27న మణికొండ మున్సిపల్‌ అధికారులు నోటీసులిచ్చారు. అయితే, సంబంధికులు స్పందించకపోవడంతో కమిషనర్‌ ఆదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలను గురువారం హైడ్రా అధికారుల సమక్షంలో మున్సిపల్‌ సిబ్బంది తొలించారు. ఈ క్రమంలో అధికారులకు, వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా తాము వ్యాపారం కొనసాగిస్తున్నామని, మణికొండ మున్సిపాల్టీకి లక్షల రూపాయల కమర్షియల్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నామంటూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెసిడెన్షియల్‌ నుంచి కమర్షియల్‌గా కన్వర్షన్‌ అయిందని వాదనలకు దిగారు. ఓ వ్యక్తి తమ వద్ద డబ్బులు డిమాండ్‌ చేశాడని, ఇవ్వని కారణంగా సదరు వ్యక్తి పలుకుబడితో ఒత్తిడి మేరకే కూల్చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా తెల్లవారుజామున కూల్చివేతలు జరిపాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ టౌన్‌షిప్‌లో దాదాపు 38 ఫ్లాట్స్‌కుపైగా ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయాలు కొనసాగిస్తున్నారని చర్యలు తీసుకోవాలంటూ అందులో నివసిస్తున్న వారు మూడేండ్ల కిందట నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిల్డర్‌ వ్యాపారులకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకపోగా, నోటీసులకు సైతం స్పందించలేదు. నోటీసులిచ్చిన తర్వాతే కూల్చివేశారు. అయితే నోటీసులు ఇవ్వలేదని, ఎలాంటి సమాచారమూ లేకుండానే హైడ్రా, మున్సిపాల్టీ అధికారులు చర్యలు తీసుకున్నారని బిల్డర్‌ ఆరోపించడంతోపాటు ప్రచారం చేశాడు. దీన్ని కమిషనర్‌ తీవ్రంగా పరిగణించారు. జీహెచ్‌ఏంసీ మినహా ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో తెలంగాణ మున్సిపాల్టీ యాక్టు 2019 సెక్షన్‌178(2) ప్రకారం కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు కమిషనర్‌ తెలిపారు. అనుమతి లేని వ్యాపార సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో చిరు వ్యాపారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ట్రాఫిక్‌కు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.